రిటైర్ అయ్యి దశాబ్దం దాటినా చెక్కు చెద‌ర‌ని క్రికెటర్ బ్రాండ్ వ్యాల్యూ

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు డికేడ్ దాటి ఏళ్లు గడుస్తున్నా.. `క్రికెట్ దేవుడు` సచిన్ టెండూల్కర్ బ్రాండ్ వ్యాల్యూ .. ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

Update: 2026-08-07 17:24 GMT

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు డికేడ్ దాటి ఏళ్లు గడుస్తున్నా.. `క్రికెట్ దేవుడు` సచిన్ టెండూల్కర్ బ్రాండ్ వ్యాల్యూ .. ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మైదానంలో పరుగులు తీయడం ఆపేసినా.. వాణిజ్య ప్రపంచంలో ఆయన సాధించిన విజయాన్ని మరొకరు అందుకోవడం దాదాపు అసాధ్యమని తాజా లెక్క‌లు నిరూపిస్తున్నాయి. దేశంలో అత్యంత విశ్వసనీయమైన, విలువైన సెలబ్రిటీలలో ఒకరిగా 53 ఏళ్ల సచిన్ ఇప్పటికీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

తాజాగా వెలువడిన `సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2025` వివ‌రాల‌ ప్రకారం.. సచిన్ బ్రాండ్ వ్యాల్యూ దాదాపు రూ. 1,200 కోట్లుగా నమోదైంది. దీనితో భారతీయ రిటైర్డ్ క్రీడాకారులలో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన క్రికెట‌ర్‌గా రికార్డుల‌కెక్కారు. దేశంలోని అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో సచిన్ 4వ స్థానాన్ని కైవసం చేసుకోగా.. పాత - కొత్త తరం క్రీడాకారుల మధ్య నిలకడగా టాప్-5లో కొనసాగుతున్న ఏకైక రిటైర్డ్ ప్లేయర్ సచిన్ మాత్రమే కావడం విశేషం.

అంతేకాకుండా.., ప్రస్తుతం యాక్టివ్‌గా మైదానంలో ఆడుతున్న అనేక మంది యువ క్రికెటర్ల కంటే సచిన్ టెండూల్కర్ ఎక్కువ సంఖ్యలో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. క్రీడాకారుల విభాగంలో విరాట్ కోహ్లీ తదుపరి స్థానంలో అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ కలిగిన రెండవ భారతీయ ప్లేయర్‌గా నిలిచారు.

మరొకవైపు క్రికెట్ విశ్లేషణల్లోనూ సచిన్ స్థాయి చెక్కుచెదరలేదు. ఇటీవల ఒక టాక్ షోలో ``ఎప్పటికైనా భారతదేశపు అత్యుత్తమ క్రికెటర్ ఎవరు?`` అని సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానేను ప్రశ్నించగా.. సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ వంటి ఎందరో దిగ్గజాల పేర్లు ఉన్నా రహానే ఏమాత్రం సందేహించకుండా సచిన్ టెండూల్కర్ పేరునే ఎంచుకున్నారు. ఏ శకంతో పోల్చినా సచిన్ అత్యంత సంపూర్ణమైన - ఆల్-టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ అని ఆయన ప్రశంసించారు.

సుదీర్ఘమైన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో తిరుగులేని రికార్డులు నెలకొల్పిన మాస్టర్ బ్లాస్టర్, రిటైర్మెంట్ తర్వాత కూడా తన వ్యాపార, ప్రకటనల సామ్రాజ్యంతో చరిత్ర సృష్టిస్తున్నారు. సమయం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. కొత్త తరం తారలు వెలుగులోకి వస్తున్నా సచిన్ టెండూల్కర్ అనే పేరుకున్న విశ్వసనీయత -బ్రాండ్ ఇమేజ్ ముందు ఇంకెవరూ నిలవలేరని ఈ గణాంకాలు స్పష్టంగా చాటిచెబుతున్నాయి. భార‌త‌దేశంలో వివాద‌ర‌హితుడైన క్రికెట‌ర్ గా అత‌డిపై బ్రాండ్ల‌కు ఉన్న న‌మ్మ‌కం కూడా అలాంటిది.

Tags:    

Similar News