స్కూలు వల్ల కాడైంది.. విద్యార్థి కాల్పులకు బలైంది..

థాయిలాండ్‌లో మరోసారి గన్ హింస తీవ్ర విషాదానికి దారితీసింది. బాంగ్ క్రూయి ప్రాంతంలోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2026-08-07 17:17 GMT

థాయిలాండ్‌లో మరోసారి గన్ హింస తీవ్ర విషాదానికి దారితీసింది. బాంగ్ క్రూయి ప్రాంతంలోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉండడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆయుధంతో స్కూలుకు వచ్చిన విద్యార్థి తరగతి గదులు, పాఠశాల ప్రాంగణంలో కనిపించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కొందరు తరగతి గదుల్లో తలదాచుకోగా మరికొందరు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనతో పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా భయానక వాతావరణంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో జరిగిన కాల్పుల్లో అతడు మరణించినట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం పోలీసులే అతడిని ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ ఘటనకు ముందు నిందితుడు తన ఇంట్లోనే ఘోరానికి పాల్పడినట్లు సమాచారం. స్కూలుకు వెళ్లే ముందు ఇంట్లో ఉన్న తన తాతమ్మలను కూడా కాల్చి చంపినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి మానసిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం, ఆయుధం అతడి చేతికి ఎలా చేరిందనే అంశాలను కూడా విచారిస్తున్నారు.

ఈ దుర్ఘటనతో థాయిలాండ్ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ ఘటన మరోసారి విద్యాసంస్థల్లో భద్రతా చర్యలు, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అవసరాన్ని గుర్తు చేసింది. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉండగా దేశవ్యాప్తంగా ఈ సంఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News