రైతు బజార్ నుంచి నేరుగా కస్టమర్ ఇంటికే.. AP ప్రభుత్వ ప్రయోగంలో సవాళ్లు!
తాజాగా రైతు బజార్ నుంచి నేరుగా వినియోగదారుని ఇంటికే కూరగాయల్ని అందించే క్విక్ కామర్స్ వ్యాపారంలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా బరిలో దిగుతోంది అనగానే..! అందరిలో ఒకటే విస్మయం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్విక్ కామర్స్ మార్కెట్ విపరీతమైన వేగంతో దూసుకుపోతోంది. తాజాగా రైతు బజార్ నుంచి నేరుగా వినియోగదారుని ఇంటికే కూరగాయల్ని అందించే క్విక్ కామర్స్ వ్యాపారంలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా బరిలో దిగుతోంది అనగానే..! అందరిలో ఒకటే విస్మయం.
వాస్తవంలో ఏదైనా ప్రభుత్వం 15 ని.ల డెలివరీని ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సెస్ ఫుల్ గా రన్ చేయగలదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక మంచి ప్రయత్నానికి ఎల్లపుడూ ప్రోత్సాహం ఉంటుంది కానీ, ప్రభుత్వమే ప్రయివేటు సంస్థలాగా అవసరమైన లాజిస్టిక్స్ ని మెయింటెయిన్ చేయగలదా? అనే సందేహం రావడం సహజం. ఇప్పటివరకు ప్రపంచంలో మరే ఇతర దేశం లేదా భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఈ రకమైన అత్యంత వేగవంతమైన వ్యవస్థను పూర్తిస్థాయిలో విజయవంతంగా నడిపిన దాఖలాలు లేవు. జెప్టో, బ్లింకిట్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు కౌంటర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన `డిజి రైతు బజార్-ఫామ్ టు హోమ్` మోడల్ అనేది ప్రభుత్వ రంగంలోనే అత్యంత సాహసోపేతమైన ప్రయోగం. ఎందుకంటే 15 నిమిషాల `హైపర్‌లోకల్ డెలివరీ` అనేది భారీ లాజిస్టిక్స్, అత్యాధునిక టెక్నాలజీ - కోట్లాది రూపాయల ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులతో ముడిపడి ఉన్న సంక్లిష్టమైన వ్యవహారం.
ఈ రకమైన డిజిటల్ విప్లవం కోసం భారత ప్రభుత్వం నేరుగా యాప్‌లను రన్ చేయకుండా.. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) అనే పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా చిన్న వ్యాపారులు, రైతు ఉత్పాదక సంఘాలు (ఎఫ్.పి.వోలు) నెట్‌వర్క్‌లో చేరి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ షాడోఫాక్స్, డుంజో వంటి లాజిస్టిక్స్ సహాయంతో సరుకులను అమ్ముకుంటున్నారు. ఇది దేశంలోని 600కు పైగా నగరాల్లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నా.. ఇవి సాధారణంగా ఆర్డర్ డెలివరీకి 30 నిమిషాల నుండి కొన్ని గంటల సమయం తీసుకుంటున్నాయి తప్ప, ప్రైవేట్ యాప్‌ల లాంటి 15 నిమిషాల బుల్లెట్ స్పీడ్‌ను ఇంకా అందుకోలేకపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే.. చైనా - సౌత్ కొరియా దేశాలు రైతుల ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చడానికి వినూత్నమైన పద్ధతులను అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రి-టెక్ మార్కెట్ కలిగిన చైనాలో `కమ్యూనిటీ గ్రూప్ బయింగ్` మోడల్ సూపర్ సక్సెస్ అయింది. అక్కడ ప్రభుత్వ మద్దతుతో నడిచే సహకార సంఘాలు మెయితువాన్, పిందువోదువో వంటి ప్రైవేట్ యాప్‌లతో టై-అప్ అయి, నగరాల్లోని నిర్దేశిత కమ్యూనిటీ పాయింట్స్ ద్వారా 15-30 నిమిషాల్లో సరుకులను చేరవేస్తున్నాయి. మరోవైపు సౌత్ కొరియా ప్రభుత్వం స్థానిక ఈ-కామర్స్ దిగ్గజం `కూపాంగ్` నెట్‌వర్క్ .. ప్రభుత్వ సబ్సిడీల సహాయంతో రాత్రికి రాత్రే రైతుల తోటల నుండి తాజా సరుకులను సేకరించి తెల్లవారేసరికి ఇళ్ల ముందుకు తెచ్చే`రాకెట్ డెలివరీ` సిస్టమ్‌ను ప్రోత్సహిస్తోంది.
నిజానికి ప్రభుత్వాలు సాధారణంగా `సేమ్ డే డెలివరీ` (మరుసటి రోజు లేదా కొన్ని గంటల్లో) మోడల్‌ను మాత్రమే సమర్థవంతంగా నిర్వహించగలవనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. కానీ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల దోపిడీ నుండి అటు రైతును, ఇటు వినియోగదారుడిని కాపాడాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 15-మినిట్స్ రేసులోకి దిగడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఏపీ ప్రభుత్వం గనుక ఈ `డిజి రైతు బజార్` ద్వారా రైతు సంఘాల లాజిస్టిక్స్‌ను పటిష్టం చేసి... అనుకున్న సమయానికి నాణ్యమైన సరుకులను అందించగలిగితే.. ఇది భారతదేశంలోనే కాకుండా గ్లోబల్ లెవెల్‌లోనే మొట్టమొదటి అత్యంత విజయవంతమైన `ప్రభుత్వ క్విక్ కామర్స్ సక్సెస్ స్టోరీ`గా నిలుస్తుంది.