'బసవ తారకం' సేవలు మరింత మందికి!
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి బసవ రామ తారకం పేరుతో హైదరాబాద్‌లో క్యాన్సర్ ఆసుపత్రి ఉన్న విషయం తెలిసిందే.;
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి బసవ రామ తారకం పేరుతో హైదరాబాద్‌లో క్యాన్సర్ ఆసుపత్రి ఉన్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశం నుంచి ప్రపంచ దేశాల నుంచి కూడా క్యాన్సర్ వ్యాధి గ్రస్థులు ఇక్కడ చికిత్స పొందుతు న్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి పూర్తి ఉచితంగా.. పేదలు, నిర్భాగ్యులకు కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నారు.
ఇక, సాధారణ రోగులకు అత్యంత తక్కువ ఫీజులకేకేన్సర్ నిపుణులు సేవలు అందిస్తున్నారు. దీనికి చైర్మనగా హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆయన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు క్యాన్సర్ కారణాలను గుర్తించేందుకు ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంది. దీంతో చాలా మంది పేదలు.. ఈ సేవలను పొందలేక పోతున్నారు.
వైద్యులు కూడా క్యాన్సర్ కారణాలను, లక్షణాలను ముందస్తుగానే గుర్తిస్తే.. దానిని నివారించుకునేందుకు లేదా.. ప్రాణాపాయం నుంచి కాపాడుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పేదలు, రిమోట్ ఏరియాలోని ప్రజలకు క్యాన్సర్ పరీక్షలను(అంటే.. క్యాన్సర్ లక్షణాలు తెలుసుకునేందుకు) చేసేందుకు వీలుగా మొబైల్ వాహనాలను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని(బుధవారం, ఫిబ్రవరి 4) పురస్కరించుకుని ఈ మొబైల్ వాహనాలను బాలయ్య ప్రారంభించారు. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించనున్నారు. మరింత మందికి సేవలు అందించేందుకు ఈ వాహనాలను కొనుగోలు చేశామని.. దాతల సహకరించారని ఆయన తెలిపారు. ఈ వాహనాల ద్వారా క్యాన్సర్ లక్షణాలు గుర్తించే పరీక్షలను పేదలకు ఉచితంగా.. మధ్యతరగతి వారికి స్వల్ప రుసుములతో చేయనున్నారు.