అప్పుడు అనుచితం.. ఇప్పుడు ఆసక్తికరం.. పవన్, చంద్రబాబుపై బోరుగడ్డ తాజా వ్యాఖ్యలు
గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా ఆ ఇద్దరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా ఆ ఇద్దరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అనరాని మాటలతో విరుచుకుపడిన బోరుగడ్డ ఇప్పుడు పవన్, చంద్రబాబు విషయంలో తన తప్పు అంగీకరిస్తూనే ఆ ఇద్దరిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ అంటే ఇష్టం, ఆయన సినిమాలు తాను చూసేవాడినని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుతో బ్యూరోక్రాట్లుగా పనిచేసిన మా చిన్నాన్నలు కలిసి పనిచేశారని చెప్పుకొచ్చాడు. సీఎం, డిప్యూటీ సీఎంపై ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లు బోరుగడ్డ మాట్లాడటం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తాను మాజీ ముఖ్యమంత్రి జగన్ కు వీరాభిమాని అంటూ చెప్పుకుంటున్న బోరుగడ్డ అనిల్ కుమార్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం నివాసం ముందు రెండు రోజుల క్రితం అనూహ్య రీతిలో భార్యతో కలిసి ధర్నా చేసిన ఆయనను యూట్యూబ్ చానళ్లు వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రకటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఎవరు ఔనన్నా కాదన్నా తాను వైసీపీలోనే ఉంటానని, వైసీపీ పక్షాన పోరాడుతానని, జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసేవరకు నిద్రపోనని ఒక వీడియో విడుదల చేసిన బోరుగడ్డ తాజాగా ఒక యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డి క్షమాపణ చెప్పేవరకు పోరాటం ఆపేది లేదంటూ తేల్చిచెప్పారు.
తాను రౌడీషీటర్ అంటూ సొంత పార్టీకి చెందిన కారుమూరి వెంకటరెడ్డి ప్రచారం చేయడంతోనే బాధపడుతున్నట్లు బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు అయిన టీడీపీ, జనసేన నేతలు కూడా ఎప్పుడూ తాను రౌడీషీటర్ అంటూ ఆరోపించలేదని గుర్తు చేశారు. కానీ, సొంత వారే రౌడీషీటరు అంటూ మాట్లాడటం వల్ల తమ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో కారుమూరి వెంకట్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇదే సమయంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు కరెక్టుగా లేవని అధినేత జగన్మోహనరెడ్డి చెప్పడంతో అప్పట్లో క్షమాపణ చెప్పానని తెలిపారు. రాజకీయంగా అలా మాట్లాడేనే తప్ప కావాలని, ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరచాలనే ఆలోచన తనకు లేదని చెప్పారు.
వైసీపీలో ఉంటూ గతంలో ఇలా మాట్లాడిన వారు ఆ తర్వాత టీడీపీ, జనసేనలోకి వెళ్లారని, కానీ తన విషయంలోనే తప్పు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని బోరుగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మహాసేన రాజేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పై దారుణంగా మాట్లాడారని బోరుగడ్డ తెలిపారు. రాజకీయాల్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదని బోరుగడ్డ అన్నారు. ప్రస్తుతం సజ్జలతో తనకు ప్రాబ్లం వచ్చిందని, రేపు ఆయన నాకు మంచి మిత్రుడు కావొచ్చు కదా? అంటూ బోరుగడ్డ వ్యాఖ్యానించారు. తన విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్యాయం చేయరని నమ్మకం ఉందని స్పష్టం చేశారు.