ఇందిరాకూ మోడీకి పోలిక పెట్టిన రాహుల్

ఇప్పటిదాకా రాజకీయ విశ్లేషకులు మాత్రమే ఈ పోలిక తెచ్చేవారు. శ్రీమతి ఇందిరాగాంధీకి నరేంద్ర మోడీకి కొన్ని విషయాలలో సారూప్యం ఉందని చెప్పేవారు.

Update: 2026-09-25 03:30 GMT

ఇప్పటిదాకా రాజకీయ విశ్లేషకులు మాత్రమే ఈ పోలిక తెచ్చేవారు. శ్రీమతి ఇందిరాగాంధీకి నరేంద్ర మోడీకి కొన్ని విషయాలలో సారూప్యం ఉందని చెప్పేవారు. అదేంటి అంటే ఇద్దరూ అత్యంత బలమైన ప్రధానులుగా దేశాన్ని పాలించడం. ఇద్దరి హయాంలో తాము అనుకున్న నిర్ణయాలను సాఫీగా తీసుకోవడం, విపక్షాలకు నియంత్రించే పరిస్థితి లేకపోవడం. ఇక వరసగా మూడు సార్లు మోడీ ప్రధాని అయ్యారు. మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇందిరా గాంధీ కూడా మూడు సార్లు దేశానికి ప్రధాని అయ్యారు. ఇద్దరూ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించారు. అంతకు మించి ఇద్దరికీ మరే పోలిక లేదు, ఎందుకంటే ఇందిరా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మోడీ అదే కాంగ్రెస్ సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీకి చెందిన అగ్ర నేత. ఇలా ఇందిరాగాంధీ మోడీ విషయంలో విశ్లేషణలు ఉంటే సరికొత్త పోలిక ఒకటి తెచ్చి పెట్టారు ఇందిరాగాంధీ మనవడు గాంధీల ఐదో తరం వారసుడు అయిన రాహుల్ గాంధీ. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా.

ఇందిరకు అయినట్లు మోడీకి :

రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం తీరు మీద ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీకి మోడీకి ప్రజా వ్యతిరేకత ఎందుకు రాదు అని ప్రశ్నించారు. యాంటీ ఇంకెంబెన్సీకి మోడీ అతీతులా అన్నట్లుగా మాట్లాడారు. 1966 జనవరిలో ప్రధాని అయిన ఇందిరాగాంధీ 1977 మార్చిలో అంటే సరిగా 11 ఏళ్ళ రెండు నెలలకు యాంటీ ఇంకెంబెన్సీ కారణంగా గద్దె దిగి మాజీ ప్రధాని అయ్యారు.ఇదే విషయం రాహుల్ గాంధీ చెబుతూ మోడీ రెండు టెర్ముల తరువాత ఎందుకు వ్యతిరేకత రాదు అని లాజిక్ పాయింట్ తీశారు. అంటే 2024 లో బీజేపీ ఓడిపోవాలి కదా అలా ఎందుకు జరగలేదు అన్నది రాహుల్ తీస్తున్న వాలీడ్ పాయింట్ అన్న మాట.

భారీ విజయం తరువాత :

ఇక ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో దేశానికి ఘన విజయం అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి ఐరన్ లేడీని తరువాత ఎన్నికల్లో జనాలు ఓడించారు కదా అని ఆయన అంటున్నారు. అటువంటి గొప్ప నేత ఇందిరా గాంధీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు అని గుర్తు చేస్తున్నారు. అదే యాంటీ ఇంకెంబెన్సీ సూత్రం మోడీకి బీజేపీకి ఎందుకు వర్తించదు అని అడుగుతున్నారు. ఒక వైపు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వ్యతిరేక పవనాలు ఉన్నా తీరా ఎన్నికల సమయానికి అవి అకస్మాత్తుగా ఎలా మాయమయ్యాయని రాహుల్ గుచ్చి మరీ ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత సర్వసాధారణమని, అలాంటిది బీజేపీకి మాత్రం ఎలా వర్తించడం లేదని ఆయన నిగ్గదీస్తున్నారు. ఇక యాంటీ ఇంకెంబెన్సీ ఉన్నది నిజం. కానీ అసలు కారణం ఓట్ల దొంగతనం జరగడమేనని తాము ఓడిపోతున్నట్లుగా తమ పార్టీ ఒక నిర్ధారణకు వచ్చిందని రాహుల్ అంటున్నారు.

ఎమర్జెన్సీని మరిచారా :

అయితే రాహుల్ గాంధీ తన నాయనమ్మ ఇందిరమ్మ ఓటమి గురించి అన్నీ చెప్పి ఎమర్జెన్సీని మరిచారని అంటున్నారు. ఇందిరాగాంధీ 1977లో ఓడిపోవడానికి కారణం సహజంగా వచ్చే ప్రజా వ్యతిరేకత కంటే ఆమె ఏకంగా 20 నెలల పాటు విధించిన ఎమర్జెన్సీ ప్రధాన కారణం అని మేధావుల నుంచి వస్తున్న మాట. ఇందిరాగాంధీ కనుక ఎమర్జెన్సీ విధించకపోతే కనీస మెజారిటీ తో గెలిచేవారు అని అంటున్నారు. ఎమర్జెన్సీ ప్రతిపక్షాలను అందరినీ కలిపిందని అదే లేకపోతే విడిగా విపక్షాలు బరిలోకి దిగితే మరోసారి కాంగ్రెస్ గెలిచేదని విశ్లేషిస్తున్నారు. ఇక మోడీ విషయానికి వస్తే బీజేపీ బలంతో పాటు విపక్షాల బలహీనత కూడా గెలిపిస్తోంది అని అంటున్నారు. 2024 నాటికి విపక్షాల మధ్య ఒక లెక్క దాకా ఐక్యత వచ్చిందని దాని ఫలితమే బీజేపీకి 240 సీట్లు అని అంటున్నారు. ఆనాడు కాంగ్రేసేతర పక్షాలు అన్నీ కలసి ఇందిరను గద్దె దించాయని, ఇపుడు బీజేపీయేతర పక్షాలు కలిస్తే మోడీ కూడా మాజీ అవుతారని అంటున్నారు. కానీ పెద్దన్న కాంగ్రెస్ ఆ చొరవ తీసుకుంటుందా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. కాంగ్రెస్ దృష్టిలో ఆలోచనల్లో ఓట్ల చోరీ జరిగింది అన్నది అయితే ఉండొచ్చు. కానీ రాజకీయంగా చూస్తే ఈ సమీకరణల గురించి కూడా కాంగ్రెస్ ఎందుకు ఆలోచించదు అన్నది రాజకీయ పండితుల మాట.

Tags:    

Similar News