గొంతెండిన విశాఖకు వరం
వాయు గుండాన్ని మీడియా వాయు గండంగా మార్చి ట్విస్ట్ చేస్తుంది. అంటే వాయు గుండం ఎప్పుడు వచ్చినా నష్టమే చేస్తుందని.
వాయు గుండాన్ని మీడియా వాయు గండంగా మార్చి ట్విస్ట్ చేస్తుంది. అంటే వాయు గుండం ఎప్పుడు వచ్చినా నష్టమే చేస్తుందని. కానీ ఈసారి అలా కాదు, రాక రాక వచ్చిన వానలతో వాయు గుండం కాదు వరం అని అంతా అంటున్నారు. ఇక కురిసినవి వానలా అంటే కానే కాదు బీభత్సమైన భారీ నుంచి అతి భారీ వర్షాలు. వరసగా నాలుగు రోజుల పాటు కరవు తీరా కురిసాయి. దీంతో రాష్ట్రమంతా వానలతో సందడి చేసింది. ఉత్తరాంధ్ర అయితే ఊపిరి పీల్చుకుంది. ఈ వానలతో గొంతెండిన విశాఖకు ప్రాణం లేచివచ్చినట్లు అయింది అని అంటున్నారు.
సగటున 31 సెంటీమీటర్లు :
ఇక విశాఖలో ఈసారి రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. ఏకంగా సగటున 31 సెంటీమీటర్ల వర్షపాతం కురిసి రికార్డు సృష్టించింది. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలతో విశాఖ జిల్లాలో సగటున 319.3 మిల్లీ మీటర్ల దాకా వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలు అన్నింటా నీరు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా జల కళతో అంతా ఉంది. భారీ వానలతో ఇబ్బందులు ఒక వైపు ఉన్నా విశాఖకు దాహార్తిని తీర్చే జలాశయాలు అన్నీ నీటితో కళకళలాడడం మాత్రం భారీ ఊరటను ఇస్తోంది అని అంటున్నారు.
గోదావరి నీరు :
మరో వైపు గోదావరి నీరు కూడా ఉప్పొంగి పొరలుతోంది. దాంతో ఆ నీటిని ఏలేరు రిజర్వాయర్ కి మళ్ళించి పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి తరలించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక చంద్రబాబు అయితే వరద నీటితో చెరువులు రిజర్వాయర్లు అన్నీ నింపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ విషయానికి వస్తే ఇపుడు తాగు నీటి కష్టాలు అయితే లేకుండా పోయాయని అంటున్నారు. నిన్నటి దాకా నీటి కోసం కష్టపడిన వారికి ఈ తీవ్ర వాయుగుండం అయితె పూర్తిగా ఉపశమనం కలిగించింది అని అంటున్నారు.
కటకట తప్పేనా :
రిజర్వాయర్లు అన్నీ నీటి కళను సంతరించుకున్న క్రమంలో ప్రస్తుతం అయితే నీటి గండం గట్టెక్కినట్లే అని అధికారులు అంచనా వేస్తున్నారు, కనీసం కొంత కాలం పాటు అయినా నీటికి భరోసా ఉందని అంటున్నారు. ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు ఎటూ తుఫాను నెలలుగా ముద్ర పడ్డాయి. దాంతో ఆ నెలలలో కచ్చితంగా ఒకటి రెండు వాయు గుండాలు కానీ తుఫాన్లు కానీ వస్తే మళ్లీ నీటి కొరత అన్నదే ఉండదని అంటున్నారు. మొత్తానికి వాయు గుండం ఇంత మేలు చేసింది అని అంతా అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే ఈ తీవ్ర వాయు గుండం కారణంగా జరగలేదని అంటున్నారు. అదే సమయంలో తాగు నీటి కొరత తీర్చిందని చెబుతున్నారు. ఇక ఖరీఫ్ సీజన్ ముగిసింది కాబట్టి సాగుకు ఈ వరద నీరు ఉపయోగపడకపోయినా రబీ సీజన్ కి అయినా మేలు చేస్తుంది అని అంటున్నారు. కేవలం విశాఖ మాత్రమే కాదని విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు కూడా భారీ వానలతో జలాశయాలు నీరు నిండి నీటి ఇబ్బందులు తీరాయని అంటున్నారు.