ట్రంప్ మాస్టర్ ప్లాన్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌కు చెక్ పెట్టేలా 2 కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు!

ఈ నిర్ణయం అమెరికా రాజకీయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయుల్లో తీవ్ర ఆందోళనను, చర్చను రాజేసింది.

Update: 2026-08-07 05:14 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కఠిన వలస విధానాలకు మరింత పదును పెడుతూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ లేదా జన్మహక్కు పౌరసత్వ విధానాన్ని నియంత్రించడంతో పాటు బర్త్ టూరిజం పేరుతో జరుగుతున్న అక్రమ పౌరసత్వ యత్నాలను అడ్డుకునే లక్ష్యంతో ఆయన రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. ఈ నిర్ణయం అమెరికా రాజకీయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయుల్లో తీవ్ర ఆందోళనను, చర్చను రాజేసింది.

ట్రంప్ సంతకం చేసిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. అమెరికా భూభాగంలో జన్మించిన ప్రతి శిశువుకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి తాత్కాలిక వీసాలపై ఉన్నవారు.. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి పిల్లలకు ఈ హక్కును పరిమితం చేసేలా కొత్త నిబంధనలు రూపొందించనున్నారు. ఇక రెండో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రధానంగా బర్త్ టూరిజంను లక్ష్యంగా చేసుకుంది. కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కితే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో కొందరు గర్భిణీలు టూరిస్ట్ వీసాలపై వచ్చి అక్కడ ప్రసవిస్తున్నారని.. ఇలాంటి ధోరణులను అరికట్టేందుకు వీసా జారీ ప్రక్రియను.. ఇమ్మిగ్రేషన్ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.

అయితే ఈ నిర్ణయాలు అమల్లోకి రావడం అంత తేలికైన విషయం కాదు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం దేశ సరిహద్దుల్లో జన్మించిన ఎవరికైనా ఆటోమేటిక్‌గా పౌరసత్వం పొందే హక్కు ఉంది. రాజ్యాంగబద్ధంగా లభించిన ఈ హక్కును కేవలం అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా రద్దు చేయడం సాధ్యం కాదని రాజ్యాంగ నిపుణులు, వలసదారుల హక్కుల సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి. గతంలో కూడా ట్రంప్ ప్రభుత్వం చేసిన ఇలాంటి ప్రయత్నాలను సుప్రీంకోర్టు ఆమోదించలేదు. దాంతో ఈ కొత్త ఉత్తర్వులు కూడా వెంటనే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొని కోర్టుల్లో నిలిచిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో హెచ్-1బి వంటి తాత్కాలిక వర్క్ వీసాలపై ఉన్నవారు దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు ఈ పరిణామాలను ఎంతో ఆసక్తిగా భయంతో గమనిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు వలస వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికేనని వైట్ హౌస్ సమర్థించుకుంటున్నప్పటికీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు కోర్టుల పరిశీలనను తట్టుకుని నిలబడతాయా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News