ఈ పదవి వదిలేస్తా.. ఆ పదవి ఇవ్వండి.. లక్ష్మీ కటాక్షం ఉందా..?
మండలి సీటు కోసం.. త్యాగాలు చేసేందుకు ఒకరిద్దరు నాయకులు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారిలో కేంద్ర మాజీమంత్రి.. పనబాక లక్ష్మి ముందున్నట్టుగా టీడీపీ నేతల మధ్య చర్చ సాగుతోంది.
మండలి సీటు కోసం.. త్యాగాలు చేసేందుకు ఒకరిద్దరు నాయకులు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారిలో కేంద్ర మాజీమంత్రి.. పనబాక లక్ష్మి ముందున్నట్టుగా టీడీపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. ప్రస్తుతం మండలిలో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. ఇవి రెండూ గవర్నర్ కోటాకు చెందినవే. పైగా వైసీపీ నుంచి పెద్దగా పోటీ ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంపిక చేసిన వారు.. నేరుగా మండలిలో కూర్చునే అవకాశం ఏర్పడింది. ఇది నాయకులకు మరింత ఆశలు పెంచేలా చేసింది.
ఈ క్రమంలో పనబాక లక్ష్మి.. ముందు వరుసలో ఉన్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నిక ల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవ స్థానం బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. అయితే.. తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానంటే.. ఈ పదవిని వదులు కునేందుకు రెడీ అంటూ.. సమాచారం పంపించారన్నది టీడీపీలోని ఓ వర్గం నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాను టికెట్ కూడా ఆశించేది లేదని ఆమె వెల్లడిస్తున్నారట.
దీనికితోడు . ఎస్సీ కోటాను కూడా ఆమె ఉటంకిస్తున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు ఏం చేస్తారన్నది చూడాలి. మరోవైపు.. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి ముఖ్యంగా తూర్పులో బలమైన నాయకు డిగా ఉన్న ఒకరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఆయన రాజ్యసభ సీటు ఆశించారన్న చర్చ ఉంది. కానీ, అది దక్కలేదు. ఇప్పట్లో రాజ్యసభ సీట్లు కూడా ఖాళీ కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని టాక్.
అదేసమయంలో ఎస్సీ కోటాకు ఒక సీటును కేటాయిస్తే.. అది తనకే ఇవ్వాలని ఓ ఎమ్మెల్యే గారి తండ్రి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన కూడా పార్టీకి విధేయుడిగా ముద్ర వేసుకున్నారు. ఈ ముగ్గరు తీవ్రస్థాయి లో ప్రయత్నాలు చేస్తున్నారన్నది సీనియర్లు చెబుతున్న మాట. అయితే.. వీరిలో ఎవరికి సీటు దక్కు తుందో చెప్పలేం కానీ.. ఆశావహుల జాబితా మాత్రం చాలానే ఉందని అంటున్నారు. ఇన్ని దాటుకుని ఎవరికి చంద్రబాబు అభయం ప్రసాదిస్తారో చూడాలి.