'అమ‌రావ‌తి- ఐ' ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్న‌ల్.. ఏంటిది?

అదేవిధంగా ప‌లు కీల‌క అంశాల‌పై కూడా మంత్రివ‌ర్గం నిర్ణ‌యాలు తీసుకుంది. ముఖ్యంగా సుల‌భ‌త‌ర వాణిజ్య విధానాన్ని ప్రోత్స‌హించే చ‌ట్టం-2026కు అనుమ‌తి ల‌భించింది.

Update: 2026-08-07 01:30 GMT

ఏపీ ప్ర‌భుత్వం రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 'అమ‌రావ‌తి-ఐ' ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న భేటీ అయిన మంత్రులు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమ‌తులు ఇచ్చేందుకు ఏక‌గ్రీవంగా అంగీక‌రించారు. అదేవిధంగా ప‌లు కీల‌క అంశాల‌పై కూడా మంత్రివ‌ర్గం నిర్ణ‌యాలు తీసుకుంది. ముఖ్యంగా సుల‌భ‌త‌ర వాణిజ్య విధానాన్ని ప్రోత్స‌హించే చ‌ట్టం-2026కు అనుమ‌తి ల‌భించింది. త‌ద్వారా.. పెట్టుబ‌డుల‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ల‌భించ‌నున్నారు.

ఏంటీ 'అమ‌రావ‌తి-ఐ' ప్రాజెక్టు?

'అమరావతి ఐ'(Amaravati Eye) ప్రాజెక్టు అనేది లండన్‌లోని ప్రసిద్ధ 'లండన్ -ఐ' తరహాలో అమరావతిలో నిర్మించతలపెట్టిన ఒక భారీ జెయింట్ అబ్జర్వేషన్ వీల్ (రాట్నం). పర్యాటక రంగాన్ని విశేషంగా ఆకర్షిం చేందుకు ఈ ఐకానిక్ ప్రాజెక్టు నిర్మాణానికి 2018లోనే ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అప్ప‌ట్లోనే టెండ‌ర్లు కూడా పిలిచింది. అయితే.. త‌ర్వాత వైసీపీ పాల‌న రావ‌డంతో అమ‌రావ‌తి పూర్తిగా మూలన బ‌డింది. దీంతో ఈ ప్రాజెక్టు కూడా ప‌క్క‌కు పోయింది. తాజాగా మ‌రోసారి దీనిని ప‌ట్టాలెక్కించ‌నున్నారు.

ఏం చేస్తారు?

ఈ ప్రాజెక్టును కృష్ణా నది ఒడ్డున (రివర్‌ఫ్రంట్) దాదాపు 6 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తారు. ఇది దాదాపు 139 మీటర్ల ఎత్తుతో నిర్మాణం కానుంది.ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ వీల్‌గా నిలుస్తుంది. దీనిని DBFOT (Design, Build, Finance, Operate, and Transfer) పద్ధతిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా నిర్మిస్తారు. ఎంపికైన ప్రైవేట్ భాగస్వామి 30 ఏళ్ల పాటు దీనిని నిర్వహిస్తారు.

ఈ జెయింట్ వీల్ నిర్మాణానికి సుమారు రూ. 120 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు అనుబం ధంగా మరో ఒక ఎకరంలో 39.2 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో షాపింగ్, కమర్షియల్ ప్రాజెక్టులను నిర్మిస్తారు. జాయింట్ వీల్ ను సంద‌ర్శించేందుకు, ఎక్కేందుకు వ‌చ్చే పర్యాటకుల నుంచి టికెట్ల ద్వారా ఏటా రూ. 35.66 కోట్లు, కమర్షియల్ జోన్ ద్వారా మరో రూ. 6.32 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది రాజ‌ధాని అమ‌రావ‌తికి కీల‌క ప్రాజెక్టుగా మారుతుంద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

మ‌రిన్ని నిర్ణ‌యాలు..

+ ఏపీ ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట‌న‌ర్‌షిప్‌( పీపీపీ) పాలసీ-2026 ముసాయిదాకు ఓకే.

+ వైసీపీ తీసుకువ‌చ్చిన `దిశ బిల్లు-2019`, ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు-2024లను ఉపసంహరించారు.

+ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు పాదచారుల భద్రత పాలసీ-2026కు ఆమోదం తెలిపారు.

+ రాష్ట్రంలో 2 కొత్త ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

+ అమరావతి క్యాంటమ్‌ వ్యాలీ ట్విన్‌ టవర్స్ నిర్మాణానికి వెయ్యి కోట్ల‌ను కేటాయించారు.

Tags:    

Similar News