మీడియా గుడ్డితనం పీక్స్ కు చేరుతోందా?

ఈ రోజు జాతీయ.. ప్రాంతీయ దినపత్రికలను చూస్తే..ఒక వార్త ప్రముఖంగా కనిపిస్తుంది. అదేమంటే.. దేశంలోనే తొలి ఎల్ఎన్ జీ రైలును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారని.

Update: 2026-09-28 05:17 GMT

గతానికి వర్తమానానికి మధ్య వ్యత్యాసం అంతకంతకూ పెరుగుతోందా? ప్రశ్నించాల్సిన మీడియా తన కనీస బాధ్యతను మర్చిపోతుందా? సొంతంగా శోధించే గుణాన్ని కోల్పోతుందా? ప్రభుత్వాలు అధికారికంగా ఏదైనా చెబితే గుడ్డిగా ఫాలో కావటం.. వారు చెప్పే గొప్పలకు డప్పు కొట్టే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతుందా? ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే కన్నా.. వారు కల్పించుకునే హైప్ కు తాను భాగస్వామి అవుతుందా? ఇదంతా ఎందుకు జరుగుతోంది? తమకు వచ్చిన సమాచారంపై కనీస ప్రశ్నల్ని తనను తాను సంధించుకునే శక్తిని మీడియా మిస్ అవుతుందా? అంటే అవునన్న చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిన దుస్థితి.

గడిచిన కొన్నేళ్లుగా ఈ తీరు పెరుగుతోంది. మీడియా సంస్థల్ని సమాజానికి మేలు చేసేలా.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కన్నా.. దాన్నో వ్యాపారంగా చూసే ధోరణి పెరిగిన కొద్దీ ప్రశ్నించే తత్త్వం.. ప్రజలకు జవాబుదారీగా ఉండే లక్షణాన్ని కోల్పోతున్న దుస్థితి. అది కేంద్ర ప్రభుత్వమైనా.. రాష్ట్ర ప్రభుత్వమైనా మీడియా తీరు మాత్రం ఒకేలా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చేసుకునే ప్రచారానికి తానా అంటే తందానా అన్న రీతిలో సాగుతుండటంతో.. ప్రజలకు చేరాల్సిన సమాచారం చేరకపోవటమే కాదు.. నిజాలు మరుగున పడిపోతున్న వైనం కనిపిస్తుంది.

ఈ రోజు జాతీయ.. ప్రాంతీయ దినపత్రికలను చూస్తే..ఒక వార్త ప్రముఖంగా కనిపిస్తుంది. అదేమంటే.. దేశంలోనే తొలి ఎల్ఎన్ జీ రైలును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారని. భారతీయ రైల్వే రూపాంతరం చెందుతూ.. మరింత ఆధునికీకరణ సంతరించుకుంటుందన్న మాటను చెబుతూ.. రైల్వేల గొప్పతనాన్ని కీర్తించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా.. ఈ గొప్పల్ని కాస్తంత క్రాస్ చెక్ చేస్తే.. ప్రభుత్వాలు చెప్పే మాటల్లోని బడాయితనం ఇట్టే కనిపిస్తుంది.

ఇంతకూ అమిత్ షా చెప్పిందేంటి? ఈ ఎల్ఎన్ జీ రైలు ఏమిటి? దీని సాంకేతికత ఏంటి? ప్రపంచంలో ఈ సాంతికేత ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? ఏ దేశం దీన్ని తొలిసారి ఫాలో అయ్యింది? భారత్ కు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ టెక్నాలజీని వాడుతున్నారు? ఇప్పుడే ఎందుకు? అన్నింటికి మించి.. ఈ తరహా టెక్నాలజీని దేశంలోని ఎంత శాతం ట్రాక్ కు వినియోగించనున్నారు? నిజానికి ఇదంత గొప్ప విషయమా? మోడీ సర్కారు సాధించిన భారీ విజయమా? లాంటి ప్రశ్నలను వేసుకుంటూ.. వీటికి సంబంధించిన సమాధానాల్ని వెతికితే.. షాకింగ్ నిజాలే కాదు.. విస్మయానికి గురి చేసే వాస్తవాలు కళ్ల ముందుకు వస్తాయి.

తొలుత దేశంలోని తొలి ఎల్ఎన్ జీ రైలు గురించి.. దాని గొప్పతనం గురించి.. ఆ రైలును ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు స్టార్ట్ చేశారు? ఈ ప్రారంభోత్సవ వేళలో అమిత్ షా ఏం చెప్పారన్నది సింపుల్ గా చూసి.. తర్వాత అసలు విషయంలోకి వెళితే.. ‘విషయం’ అర్థమవుతుంది. ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత ట్రైన్ల జాబితాలోకి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఎల్ ఎన్ జీ రైలు అందుబాటులోకి వచ్చేసింది. గుజరాత్ లోని సబర్మతి రైల్వేస్టేషన్ లో ఈ సరికొత్త రైలును కేంద్ర హోం మంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు. డీజిల్ వినియోగాన్ని తగ్గించి.. ఇంధన ఖర్చుల్లో పొదుపు చేసేందుకు ఈ తరహా రైళ్లు సాయం చేస్తాయని చెబుతున్నారు. కాలుష్య ఉద్గారాలను నియంత్రించే లక్ష్యంలో భాగంగా పలు ప్రత్యేకతలతో ఈ రైలును భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రవేశ పెట్టినట్లుగా పేర్కొన్నారు.

ఈ రైలు ఇంజిన్ ప్రత్యేకత ఏమంటే.. లభ్యతకు అనుగుణంగా ఎల్ ఎన్ జీ లేదా డీజిల్ తోనూ ఇది పని చేస్తుంది. అంటే డ్యూయల్ ఫ్యూయల్ ఇంజిన్ అన్న మాట. 8 కోచ్ లు ఉన్న నాన్ ఏసీ ఛైర్ కారును సబర్మతి - మహేసన జంక్షన్ వరకు నడిపారు. దీని రెగ్యులర్ రూట్ ఇంకా ఫైనల్ చేయలేదు. ఇప్పటికే వినియోగంలో ఉన్న 1400 హెచ్ పీ సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్ పవర్ కార్లను ఎల్ ఎన్ జీ డ్యూయల్ ఇంధన వ్యవస్థకు అనుగుణంగా మార్పులు చేశారు. దీంతో సాంప్రదాయక డీజిల్ వినియోగాన్ని 40 శాతం తగ్గించొచ్చన్నది ఒక అంచనా.

ఈ ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా.. భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత రైల్వే వ్యవస్థను పూర్తిగా మార్చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ తన పాలనలో రూ.12 లక్షల కోట్లకు పైగా మోసాలు.. అవినీతి.. కుంభకోణాలకు పాల్పడిందే తప్పించి ఇంకేం చేయలేదన్నారు. ఇప్పటికే హైడ్రోజన్ రైలును (రెండు నెలల క్రితం) ప్రారంభించుకోగా.. తాజాగా ఎల్ ఎన్ జీ రైలును అందుబాటులోకి తీసుకొచ్చిన వైనాన్ని అమిత్ షా గొప్పలు చెప్పుకున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటల్ని చదివేశారు కదా? ఇప్పుడు వాస్తవాల్లోకి వెళదాం. ఈ తరహా టెక్నాలజీ ప్రపంచానికి ఎప్పుడు పరిచయమైంది? అలా మొదలుపెట్టిన దేశం ఏది? ఇప్పుడు ఈ తరహా సాంకేతికతను వినియోగిస్తున్న దేశాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాల్ని తెలుసుకుందాం. ఎల్ఎన్ జీ టెక్నాలజీతో రైళ్లను నడుపుతున్న దేశాలు చాలా పరిమితం. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే ఈ సాంకేతికతో రైళ్లునడుపుతున్న దేశాలు అరడజను మాత్రమే. అందులోకి తాజాగా భారత్ వచ్చి చేరింది. ఈ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది రష్యా. ముఖ్యంగా భారీ సరుకు రవాణా కోసం వీటిని రూపొందించారు. అది కూడా ఎప్పుడో తెలుసా?.. 1980చివర్లో.

అయితే.. అప్పట్లో తొలిసారి తీసుకొచ్చిన ఇంజిన్ కు ఇప్పటి ఇంజిన్ కు చాలానే మార్పులు ఉన్నాయి. కాకుంటే.. లోకో మోటివ్ ఇంజిన్లను ఎల్ఎన్ జీ తో నడిచేలా డిజైన్ చేసి.. సక్సెస్ ఫుల్ గా నడిపారు. అయితే.. వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చింది మాత్రం 1992-1993 మధ్య కాలంలో. సంప్రదాయ డీజిల్ వాడకానికి ఫుల్ స్టాప్ పెట్టి.. పర్యావరణహితంగా మారేందుకు వీలుగా అమెరికా.. రష్యాలు ఈ టెక్నాలజీకి పెద్దపీట వేశాయి. దాదాపు నలభై ఏళ్ల క్రితం నాటి టెక్నాలజీ గురించి ఇప్పుడు గొప్పగా చెప్పుకోవటం ఏమిటి? అయినా.. ఇప్పుడే భారత్ వీటి వైపు మొగ్గు చూపుతోంది? అన్న ప్రశ్నలు సహజంగా వస్తాయి.

మొదట్లో భారత రైల్వేస్ తన ఫోకస్ మొత్తాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్ వర్క్ ను విద్యుద్దీకరణ మీదనే పెట్టింది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న బ్రాడ్ గేజ్ రైల్వే నెట్ వర్క్ లో 99.6 శాతం విద్యుద్దీకరణను పూర్తి చేసింది. విద్యుత్ లైన్లు లేని మిగిలిన కొన్ని రూట్లలోనూ.. అత్యవసర సమయాల్లో వాడేందుకు మాత్రమే డీజిల్ రైళ్లు ఉన్నాయి.అయితే.. ఈ డీజిల్ వినియోగాన్ని 2030 నాటికి జీరో స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా ఈ టెక్నాలజీని భారత రైల్వేస్ ఇప్పుడు అందిపుచ్చుకుంది.

1988లో రష్యా వాడిన టెక్నాలజీలో గ్యాస్ లీకేజీ లాంటి భద్రతా లోపాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాటిని అధిగమించిన పరిస్థితి. ఇప్పుడు భారత రైల్వేస్ వాడుతున్న సాంకేతికత అప్డేటెడ్ గా చెప్పాలి. ఇది గ్యాస్ ను డీజిల్ గా మార్చేస్తుంది. ఈ టెక్నాలజీతో కలిగే ప్రయోజనం ఏమంటే.. పాత డీజిల్ ఇంజిన్లను పూర్తిగా పక్కన పడేయకుండా వాటిని తక్కువ ఖర్చుతో ఎల్ ఎన్ జీ ఇంజిన్లుగా మార్చేయటం ద్వారా ఖర్చు తగ్గటమే కాదు.. విద్యుద్దీకరణ లేని 0.4 శాతం బ్రాడ్ గేజ్ లైన్లలో వీటిని వినియోగించే వీలు ఉంటుంది. డీజిల్ భారాన్ని.. కాలుష్యాన్ని తగ్గించే వీలు కలుగుతుంది.

ఈ ఏడాది జులైలో హైడ్రోజన్ రైళ్లను విజయవంతగా తీసుకొచ్చింది. కానీ.. దీని టెక్నాలజీ చాలా ఖరీదైనది. కాకుంటే సంప్రదాయ డీజిల్ నుంచి ఎల్ఎన్ జీ టెక్నాలజీని వినియోగించటం ద్వారా ఏడాదికి ఒక రైలుకు రూ.24 లక్షలు ఆదా చేస్తుంది. అదే సమయంలో కాలుష్యాన్ని 40 శాతం తగ్గించే వీలుంది. ఇదంతా డీజిల్ ఇంజిన్ వినియోగంతో లెక్కేసినప్పుడే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికిప్పుడు హైడ్రోజన్ రైళ్లను భారీగా అందుబాటులోకి తెచ్చే పరిస్థితి భారత్ కు లేదు. అందుకు కొంత సమయం పట్టొచ్చు. ఇలాంటి వేళ.. మధ్యేమార్గంగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా.. ఇప్పటికే ఉన్న డీజిల్ ఇంజిన్ ను అప్ గ్రేడ్ చేసుకోవటం కాస్తంత కలిసి వచ్చే అంశం.

నిజానికి ఎల్ఎన్ జీ టెక్నాలజీతో నడిచే రైళ్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ రైళ్లు చాలా చౌకగా.. ఎక్కువ వేగంతో.. వంద శాతం కాలుష్యరహితంగా నడుస్తాయి. ఎల్ఎన్ జీ రైళ్లను నడపటానికి ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే సహజవాయువును ద్రవరూపంలో ఉంచటానికి మైనస్ 162 సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమన్నది మర్చిపోకూడదు. అంతేకాదు.. ఎల్ఎన్ జీ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరల మీద ఆధారపడి ఉంటాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధాల్లాంటి పరిస్థితుల్లో దీని ధరలు మరింతగా పెరుగుతాయి. ఇలా గ్యాస్ మీద ఆధారపడి రైళ్లను నడపటం సురక్షితం కాదన్న ఉద్దేశంతో ప్రపంచంలోనిచాలా దేశాలు ఈ టెక్నాలజీకి దూరంగా ఉంటాయి.

కాకుంటే.. మన దగ్గర ఉన్న డీజిల్ ఇంజిన్లు.. అదే సమయంలో విద్యుద్దీకరణకు వీలుగా లేని రూట్లు (0.4 శాతం మొత్తం బ్రాడ్ గేజ్ లో) ఈ టెక్నాలజీతో ఉన్న ఇంజిన్లు వినియోగించేందుకు మాత్రమే వీలవుతుంది. పలు పాశ్చాత్య దేశాలు కాస్త ఖర్చు ఎక్కువే అయినా బ్యాటరీ.. హైడ్రోజన్ రైళ్ల మీద ఫోకస్ చేస్తున్నాయి. దేశంలో కరెంట్ లైన్లు లేని 0.4 శాతం రూట్లకు మాత్రమే ఈ ఇంజిన్లు ఉపయోగపడతాయి. ఇవి సుదూర ప్రాంతాలకు కాకుండా.. నగరాల మధ్య తక్కువ దూరం ఉండే రూట్లకు సెట్ అవుతాయి. ఒక్కసారి ఈ రైలులో ఇంధనాన్ని నింపితే ఏకధాటిగా 1600-2000 కి.మీ. ప్రయణించే వీలుంది. చిన్న రూట్లలో అయితే.. వారానికి ఒకసారి ఇంధనం నింపితే సరిపోతుంది.

ఇదంతా చదివిన తర్వాత కలిగే సందేహం ఏమంటే.. చాలా పరిమిత అవసరాల కోసం వినియోగించే ఈ తరహా రైళ్లను కేంద్ర హోం మంత్రి ప్రారంభించటం.. దానికి భారీ ప్రచారాన్ని మీడియా ఇవ్వటం ఏమిటని? మన దేశంలోని మీడియా సంస్థలకు ఒక బలహీనత ఉంది. అదేమంటే.. టెక్నాలజీ ఏదైనా.. విషయం మరేదైనా సరే.. దేశంలో తొలిసారి లాంటి ట్యాగ్ లైన్ కు ఇట్టే ఆకర్షితులవుతారు. ఇప్పటివరకు లేని టెక్నాలజీ మన దేశం ఫాలో అవుతుందంటే.. అది అత్యాధునిక సాంకేతికతగా ఫీల్ కావటమే అసలు సమస్య. కాకుంటే.. ఈ తరహా టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు విపత్తుల వేళ.. విద్యుత్ తో రైళ్లు నడపలేని పరిస్థితుల్లో.. యుద్ధ ప్రాతిపదికన ఈ టెక్నాలజీతో ఉన్న రైళ్లను నడిపే వీలు ఉంటుంది. ఇక్కడ చెప్పేదేమంటే.. టెక్నాలజీని తప్పు పట్టటం లేదు. అవసరానికి మించిన ప్రచారమే అసలు సమస్య.

ఇందుకు తగ్గట్లు.. ఈ ట్రైన్ ప్రారంభించే సమయంలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాన్ని చూస్తే.. రైల్వేల రూపురేఖల్ని తమ ప్రభుత్వం మార్చేసిందని.. గత ప్రభుత్వాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయని ఆయన విమర్శించారు. నిజంగానే మోడీ హయాంతో భారత రైల్వేలు ఎంత సాధించాయి? ఎంత సాధించలేకపోయాయి? 2014 ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే భారత రైల్వేల రూపురేఖలు ఎంతలా మారుస్తామన్న మాటకు.. ఇన్నేళ్ల పాలన తర్వాత చేసిందేమిటి? అన్న విషయాన్ని చర్చకు పెడితే.. అదో పుస్తకమే అవుతుంది. ఇప్పుడు చెప్పేది ఒక్కటే. ప్రభుత్వాలు తమ పేరు ప్రఖ్యాతుల కోసం అవసరం లేని వాటికి భారీ ప్రచారం చేసుకోవటం మామూలే.

ఇలాంటి సందర్భాల్లో పని కట్టుకొని విమర్శించమని చెప్పటం లేదు. అదే సమయంలో నిజాలు చెప్పటం.. గొప్పల్ని బడాయితనంతో చెప్పుకునే తీరుకు అడ్డుకట్ట వేసేలా.. ప్రభుత్వాల తీరు మారేలా చేయాల్సిన అవసరం మీడియా మీద ఉంది. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ఇప్పుడు చెప్పిన విషయాల్లో.. ఈ ట్రైన్ ను ప్రారంభించి.. గొప్పగా మాట్లాడిన కేంద్రమంత్రి అమిత్ షాకు అంత అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఈ విషయాన్ని భారత రైల్వేలకు చెందిన కీలక అధికారులు సరైన రీతిలో బ్రీఫ్ చేసి ఉంటే.. ఈ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేపట్టకపోయే అవకాశమే ఎక్కువ. ఒకవేళ ఈ విషయాలన్నీ తెలిసి కూడా దీనిని ప్రారంభించి.. ఇంతగా గొప్పలు చెప్పుకున్నారంటే.. మోడీ సర్కారు కేవలం ప్రచారం కోసం.. తాము సాధించిన చిన్న విజయాల్ని కూడా పెద్ద గొంతుకతో చెప్పుకోవటానికి ఎందుకు తహతహలాడుతుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.

Tags:    

Similar News