మోడీ చుట్టూ రాహుల్.... రాజకీయం పండేదెలా ?
దేశంలో ఏది ఎక్కడ జరిగినా మోడీకే ఆపాదిస్తూ తన రాజకీయ పరిధిని బాగా కుదించుకుంటున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది.
కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ రాజకీయ ప్రదర్శన అంతా మోడీ కాంపౌండ్ లోనే సాగుతోంది అన్న ఘాటు విమర్శలు ఉన్నాయి. ఆయన లేచింది మొదలు నరేంద్ర మోడీ మీదనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. అఫ్ కోర్స్ ప్రధాని మోడీయే కాబట్టి ఆయన్నే టార్గెట్ చేయాలి. దాని వల్ల ఎంతో కొంత మైలేజ్ వస్తుంది కానీ రాజకీయం అంటే మోడీ మాత్రమే కాదు కదా అన్న మాట కూడా ఉంది. మోడీ జపం చేయడంతోనే కాంగ్రెస్ అగ్ర నేతకు సరిపోతోంది అన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి. దేశంలో ఏది ఎక్కడ జరిగినా మోడీకే ఆపాదిస్తూ తన రాజకీయ పరిధిని బాగా కుదించుకుంటున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది.
ఈసీ మీద విమర్శలు :
కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మీద ఒక జాతీయ మీడియాలో వచ్చిన వార్తా కధనం విపక్షం చేతికి ఆయుధంగా మారింది. అంత వరకూ బాగానే ఉన్నా ఆ ఆయుధాన్ని జనం చేతిలో ఉంచి అక్కడ నుంచి తిప్పితేనే లాభం అన్న సంగతినే అగ్ర నేత రాహుల్ విస్మరిస్తున్నారు అని అంటున్నారు. దేశంలో మేధావుల నుంచి సగటు ప్రజలతో మమేకం అయి వారిలో అవగాహన పెంచడం ద్వారా ఏమి జరుగుతోంది అన్నది వివరించే ప్రయత్నం చేయకుండా ఎంతసేపూ వారు రాజీనామా చేయాలి, వీళ్ళు దిగిపోవాలి అని పాత కాలం డిమాండ్లతో రాజకీయం చేసే ఒరిగేది ఏముంది అన్నదే చర్చగా ఉంది. ఇక చూస్తే ఈసీ మీద వచ్చిన విమర్శలకు అక్కడ నుంచి కూడా సమాధానం వివరణ కూడా వచ్చింది. ఇక ఒక జాతీయ పత్రిక కధనం పట్ల నమ్మకం ఉంచడం మంచిదే కానీ ఈసీ వివరణను కూడా చూడాలి కదా అన్న మాట సైతం వినిపిస్తోంది.
మోడీ ఇమేజ్ మీదనే :
రాహుల్ ఎప్పుడూ చేస్తున్న పాత ప్రాక్టీస్ నే మరోసారి ఈ విషయంలోనూ చేస్తున్నారు అని అంటున్నారు. మోడీ ఇమేజ్ ని ఎంతో కొంత డ్యామేజ్ చేయాలన్నది కాంగ్రెస్ సహా విపక్షాల వ్యూహం. అయితే ఇక్కడే ఎత్తుగడలు బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు. ప్రజలలో ఈ అంశాన్ని ఎంత ఎక్కువగా చర్చకు పెట్టి వారి నుంచి ఎంతగా వ్యతిరేకతను ప్రభుత్వం మీద పెంచగలిగితే అంతగా ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారు. దాని కోసం ప్రజా క్షేత్రాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మీడియా ముందు చేసే విమర్శలు కానీ సోషల్ మీడియా సందేశాలు కానీ పెద్దగా ప్రభావం చూపించవు అని అంటున్నారు.
ఓటమికి కారణాలా :
ఆటలో ఒకరు గెలుస్తారు. మిగిలిన వారు ఓటమి చెందుతారు. గెలిచిన వారికి కారణాలు అవసరం లేకపోవచ్చు. కానీ ఓడిన వారు మాత్రం సవా లక్ష వెతుక్కుంటారు. అయితే ఇక్కడ లాజిక్ కూడా మిస్ అవుతున్న పరిస్థితిని కూడా జనాలు గమనిస్తున్నారు అన్నది మరచిపోతే ఎలా అన్నది కూడా ఉంది. ఉదాహరణకు రాహుల్ గాంధీ చెప్పినదే తీసుకుంటే రెండు సార్లు ప్రధానిగా ఉన్న మోడీ 2024 ఎన్నికల్లో యాంటీ ఇంకెంబెన్సీ వల్ల ఎందుకు ఓటమి పాలు కాకూడదని లాజిక్ పాయింట్ తీశారు. మరి అదే మూడు సార్లు ఢిల్లీలో గెలిచిన ఆప్ కి కేజ్రీవాల్ కి అలాగే బెంగాల్ లో మూడు సార్లు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎందుకు వర్తించదు అన్నది కూడా జనం చర్చించుకుంటారు కదా అని అంటున్నారు.
తర్కం ఉండాలి కదా:
రాజస్థాన్ లో బీజేపీ కాంగ్రెస్ అయిదేళ్ల అధికారాన్ని ఓడించి గెలిచింది. అయితే హర్యానా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల బీజేపీ వరసగా గెలవడం అన్నది అయితే ఆలోచించాల్సి ఉంది. అయినా సరే గెలిచిన వారు అక్రమాలు చేశారు అని ఓడిన వారు ప్రజాదరణ ఉన్నా పీఠానికి దూరం అవుతున్నారు అని చెప్పడానికి కూడా తర్కం ఉండాలి కదా అంటున్నారు. ఆడలేక మద్దెలోడు అన్నట్లుగా విపక్షాల యాగీ ఉంది అనుకుంటే మాత్రం అది మరోసారి వారికే ఇబ్బందికరం అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈసీ పనితీరు పారదర్శకంగా ఉండాలి అన్నది సబబు అయిన డిమాండ్. అదే సమయంలో తమ రాజకీయ ప్రదర్శన కూడా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా ప్రతిపక్ష బాధ్యత. ఈ విషయంలో లీడ్ తీసుకోవాల్సిన రాహుల్ తన రాజకీయం మొత్తం మోడీ చుట్టూ తిప్పాలని చూస్తే పండదు కదా అన్నదే అసలైన మాట.