ఫ్యాన్ స్విచాఫ్...జగన్ చెప్పినా నో రిజల్ట్ !

జిల్లాలో వైసీపీ ఓటమి కాగానే సీనియర్ నేతలు చాలా మంది సైలెంట్ అయిపోయారు. కొంతమంది నేతలు తప్పుకున్నారు.

Update: 2026-09-28 04:34 GMT

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది అని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తం జిల్లాలో ఒకనాడు వెలిగిన పార్టీ ఇపుడు నానా రకాలుగా ఇబ్బంది పడుతోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లలో 13 గెలుచుకున్న వైసీపీ 2024 కి వచ్చేసరికి సున్నాకు సున్నా ఫలితం మూటకట్టుకుంది. ఇక కూటమి సగం పాలన పూర్తి అయింది. జిల్లాలో మెల్లగా యాంటీ ఇంకెంబెన్సీ కూటమి ప్రభుత్వం మీద ఏర్పడుతోంది. అయితే దానికి ఏ మాత్రం సొమ్ము చేసుకునే పరిస్థితిలో వైసీపీ లేకపోవడమే అసలైన రాజకీయ విషాదంగా ఉంది అంటున్నారు. దీని వెనక అధినాయకత్వం తప్పిదాలు కొన్ని ఉంటే జిల్లాలో నేతల తీరు కూడా కారణం అవుతోంది అంటున్నారు.

నిస్తేజం నడుమ :

జిల్లాలో వైసీపీ ఓటమి కాగానే సీనియర్ నేతలు చాలా మంది సైలెంట్ అయిపోయారు. కొంతమంది నేతలు తప్పుకున్నారు. అలా భీమవరం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ వంటి నాయకుడు వైసీపీని వీడినా ఆ స్థాయి నేతను పార్టీ గుర్తించి ముందుంచలేకపోయింది. కొత్త నాయకులు అయితే పార్టీ మీద పట్టు సంపాదించలేక కిందా మీద అవుతున్నారు. ఇక మరి కొన్ని నియోజకవర్గాలలో ఇంచార్జిలను మార్చేసి కొత్త వారికి చాన్స్ ఇచ్చి వైసీపీ ప్రయోగాలు చేసింది. దాంతో అక్కడ కూడా పార్టీ ఇబ్బందులు పడుతోంది. అలా ఉండి, పాలకొల్లు, చింతలపూడి, కోవూరు, గోపాలపురం, ఆచంట వంటి నియోజకవర్గాలలో ఫ్యాన్ పూర్తిగా స్విచాఫ్ అయిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక్కడ ఇంచార్జిలుగా ఉన్న నాయకులు సొంతంగా కార్యక్రమాలను నిర్వహించడం లేదని పార్టీ నేతలే అంటున్నారు. పార్టీ క్యాడర్ తో కలవడం తక్కువ అని జనంతో కూడా కలిసేది ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

అంతా ఓకే అంటూ :

ఇక అధినేత నిర్వహించే సమీక్షా సమావేశాలకు వెళ్ళి అక్కడ జిల్లాలో పార్టీ అంతా బాగుందని చెబుతూ వస్తున్న నేతలు గ్రౌండ్ లో మాత్రం వర్క్ చేయడం లేదని అంటున్నారు. ఇక హైకమాండ్ కి ఈ విషయాలు చెప్పడానికి ఎవరూ సాహసించలేని పరిస్థితి ఉంది. ఏకగ్రీవాలు వద్దే వద్దు అని గట్టిగా వైసీపీ అధినాయకత్వం ఆదేశించినా కూడా నాయకులలో అయితే చురుకు పుట్టడం లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే పార్టీకి మంచి రోజులు రావాలని క్యాడర్ అయితే భావిస్తోంది. కానీ అటు అధిష్టానం ఆలోచనలను ఇటు క్యాడర్ మనో భావాలను గమనించకుండా నియోజకవర్గాల వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

కూటమి చాన్స్ ఇస్తున్నా :

ఇక్కడొక విశేషం ఉంది అని అంటున్నారు. కూటమిలో అనైక్యత కానీ సీట్లలో పేచీ కానీ ఎమ్మెల్యేల పనితీరు విషయంలో జనంలో ఏర్పడిన వ్యతిరేకత కానీ వైసీపీకి ఎంతో కొంత చాన్స్ ఇస్తోంది అని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అయినా సరే వైసీపీ నాయకులు మాత్రం ఏమీ పట్టనట్లుగా సాగుతున్నారన్నదే కార్యకర్తల మాటగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఈ విధంగా అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక 2029 లో జరిగే ఎన్నికల నాటికి కూడా సర్దుకోకపోతే పగో జిల్లా వైసీపీ మీద పూర్తిగా పగ బట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Tags:    

Similar News