అమరావతి మీద ధర్మాన సంచలన వ్యాఖ్యలు
అమరావతి రాజధాని విషయంలో వైసీపీలో ఇప్పటికీ అదే గందరగోళం చెలరేగుతోందా అన్న చర్చ నడుతోంది.
అమరావతి రాజధాని విషయంలో వైసీపీలో ఇప్పటికీ అదే గందరగోళం చెలరేగుతోందా అన్న చర్చ నడుతోంది. ఇప్పటికి అయిదు నెలల క్రితం భారత పార్లమెంట్ లో అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని అక్కడ ఆమోదించి చట్టబద్ధత కల్పించారు. అయితే వైసీపీ మాత్రం అమరావతి విషయంలో ఇంకా తన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని చెబుతోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఒక టీవీ డిబేట్ లో అమరావతి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదు అంటూనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రీకృత విధానాలు :
అమరావతి రాజధాని పేరుతో కేంద్రీకృత విధానాలకు మాత్రమే తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ధర్మాన స్పష్టం చేశారు. ఒక పౌరుడిగా వైసీపీ నాయకుడిగా తాను ఎప్పటికీ ఇదే మాటకు కట్టుబడి ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. మొత్తం మూడు బడ్జెట్ లను ఇప్పటికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెడితే ఆ సొమ్ము అంతా అమరావతికే పెట్టారని ఆయన ఆక్షేపించారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూచీ కత్తుతో యాభై వేల కోట్ల రూపాయలను తెచ్చి ఖర్చు చేస్తున్నారు అని అన్నారు. ఇవన్నీ ప్రజలు తీర్చాల్సినవే అని ఆయన చెప్పారు. ప్రజలు కట్టే పన్నులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా సంపద పంచాల్సిన అవసరం ఉందని ధర్మాన అన్నారు. రాజ్యాంగం ఇదే చెబుతోంది అని అన్నారు. అందుకే తమ పార్టీ ఈ కేంద్రీకృత విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తోంది అని ఆయన చెప్పారు.
గొంతు కోస్తున్నారు :
ఉత్తరాంధ్రాతో పాటు రాయలసీమ ప్రజల గొంతు కోస్తున్నారు అని ధర్మాన మండిపడ్డారు. ఎనభై ఏళ్లు గడచినా అనేక ఉత్తరాంధ్రా జిల్లాల నీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విభజన ఏపీకి 23 కేంద్ర సంస్థలను ఇస్తే అందులో ఒక్కటి కూడా శ్రీకాకుళానికి ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అయిదేళ్ల పాలనలో తాము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మూలపేటలో నాలుగు వేల కోట్లతో పోర్టుల నిర్మాణం అన్నది వైసీపీ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఉద్ధానంలో ప్రజలకు వేయి కోట్లు పెట్టి రక్షిత మంచి నీరు పధకం ద్వారా అందించామని చెప్పారు. అలాగే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు గిరిజన ప్రాంతాలలో వర్శిటీతో పాటు ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజిని తీసుకుని వచ్చామని ధర్మాన వెల్లడించారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా వైసీపీ హయాంలోనే జరిగింది అని ధర్మాన చెప్పారు. చంద్రబాబు గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఉత్తరాంధ్రాకు ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మావిగన్ మీద :
ఇక మావిగన్ విషయంలో కూడా వైసీపీ అధినేత అన్నది వేరు అని ధర్మాన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం సంపదను కేవలం కొందరికే పెట్టకుండా మరిన్ని జిల్లాలకు విస్తరించాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు అని ఆయన అన్నారు. అంతే తప్ప వైసీపీ కేంద్రీకృత విధానాలకు కట్టుబడి ఉన్నట్లు కానే కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో తమ పార్టీ పూర్తిగా అవగాహనతోనే ఉందని ధర్మాన చెప్పడం విశేషం.
తెలంగాణా ఉద్యమం :
సంపద అంతా ఒకే చోట పోగేయడం వల్లనే తెలంగాణా ఉద్యమం వచ్చింది అని ధర్మాన వివరించారు. ఈ ఉద్యమం 1969లో తొలిసారి వచ్చినా సక్సెస్ కాలేదని 2000 సంవత్సరంలో మాత్రం రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మొత్తం ప్రజలు పాల్గొనడం వల్లనే విజయవంతం అయింది అన్నారు. తమ ప్రాంతానికే సంపద అంతా ఉండాలన్న మానవ సహజమైన స్వార్ధం కూడా ఉద్యమానికి కారణం అన్నారు. రేపటి రోజున ఇదే తీరున అమరావతిలో కూడా ఉద్యమం రాదని గ్యారంటీ ఏముందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు గత అనుభవాలను పక్కన పెట్టి మరీ అమరావతి పేరుతో కేందృఈకృత విధానాలను అమలు చేస్తున్నారు అని అన్నారు. రాజధానికి మౌలిక సదుపాయాలు ఉండాలి అని అదే సమయంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. తాను వేర్పాటు వాద వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన సమర్ధించుకుంటూనే చంద్రబాబు చర్యల వల్లనే రేపటి రోజున ఆ పరిస్థితి వస్తుందేమో అన్నదే ఆందోళన అని చెప్పుకొచ్చారు.