ఏపీ లోకల్ ఫైట్ లోకి బండ్ల గణేష్.. గుడివాడ వైసీపీ సభలో కామెంట్స్ పై ఫైర్
ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేనివారు కూడా ఈ వాగ్యుద్ధంలోకి వస్తుండటం ఆసక్తి రేపుతోంది.
ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేనివారు కూడా ఈ వాగ్యుద్ధంలోకి వస్తుండటం ఆసక్తి రేపుతోంది. శనివారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ సన్నాహాక సమావేశం నిర్వహించగా, ఇందులో మాట్లాడిన మచిలీపట్నం వైసీపీ ఇంచార్జి పేర్ని కిట్టు డిప్యూటీ సీఎం పవన్ పై ఘాటు విమర్శలు చేశారు. ఈ క్రమంలో సినీనటుడు, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ పేరు ప్రస్తావిస్తూ పవన్ పై పేర్ని కిట్టు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన సినీ నటుడు బండ్ల గణేష్ ఘాటు రిప్లై ఇచ్చారు.
‘‘పవన్ కల్యాణ్ గారు ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో , ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో నీకు అన్నీ అర్థమయ్యేలా త్వరలో చెప్తా తమ్ముడు పేర్ని కిట్టి..!!’’ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. గుడివాడ సభలో పేర్ని కిట్టూ మాట్లాడుతూ బండ్ల గణేష్ డబ్బు కోసం పవన్ ను కీర్తిస్తుంటారని వ్యాఖ్యానించారు. పవన్ అంటే మత్తు, ఒక వ్యసనం అంటూ బండ్ల గణేష్ గతంలో చెప్పడాన్ని ఎత్తిచూపుతూ పవన్ సినిమా నటుడు కనుక, ఆయనతో సినిమాలు తీస్తే డబ్బులు వస్తాయని బండ్ల గణేష్ వంటివారు పొగుడుతుంటారని వ్యాఖ్యానించారు. కానీ, గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని సినీ నటుడు కాకపోయినా, ఆయన అంటే ఇక్కడి ప్రజలకు ఒక మత్తు, వ్యసనం అంటూ అన్నారు. ఇలా కొడాలి నానిని పొగుడుతూ, డిప్యూటీ సీఎంను విమర్శిస్తూ బండ్ల గణేష్ పేరు ప్రస్తావిస్తూ సాగిన పేర్ని కిట్టు వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
దీంతో బండ్ల గణేష్ స్పందించి పవన్ అంటే ఏంటో త్వరలో అర్థమవుతుందని హెచ్చరిక పంపారు. దీంతో స్థానిక ఎన్నికల వేడి మరింత రాజుకున్నట్లుగా ఉందని చెబుతున్నారు. వచ్చే నెలలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో విపక్షం వైసీపీ అలర్ట్ అయింది. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నియోజకవర్గస్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో అన్నిస్థానాలకు పోటీ చేయాలని, ప్రభుత్వం నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చినా తాము అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
అయితే, రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేని బండ్ల గణేష్ వంటివారిని మధ్యలోకి లాగడం వల్ల వైసీపీకి ఎటువంటి ప్రయోజనమో అర్థం కావడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సినీ నటుడు అవడం వల్ల బండ్ల పేరు వాడటం వల్ల కార్యకర్తలకు వెంటనే అర్థమవుతోందన్న ఆలోచనతో పేర్ని కిట్టు ప్రసంగంలో ఆయన పేరు వాడుకున్నారని, ఈ విషయంలో బండ్ల రియాక్ట్ అయినప్పటికీ రాజకీయంగా వైసీపీకి ఇబ్బంది లేదని, అదే సమయంలో పార్టీకి, యువనాయకుడు అయిన పేర్ని కిట్టుకు మంచి ప్రచారం దక్కిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తాజా మాటల యుద్ధంతో స్థానిక ఎన్నికల వేడి క్రమంగా ఎక్కువవుతోందని అంటున్నారు.