జెడ్పీ పీఠం... టార్గెట్ చేసిన కిమిడి ?
ఈ నేపధ్యంలో చిన్న శ్రీను కుమార్తె ఈ పీఠాన్ని అధిరోహిస్తారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఇపుడు టీడీపీకి చెందిన నేతలే ఈ పీఠాన్ని టార్గెట్ చేశారు అని అంటున్నారు.
విజయనగరం జెడ్పీ పీఠం విషయంలో లెక్కలు మాత్రమే కాదు రాజకీయం కూడా పూర్తిగా మారుతోంది. ఈ పీఠం చుట్టూ ఆశావహులు సరికొత్త ఆశలను అల్లుకుని అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్నారు. నిజానికి విజయనగరం జెడ్పీ అంటే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఫ్యామిలీదే అన్నది ఈ మధ్య దాకా అంటున్న వింటున్న మాట. ఎపుడైతే చిన్న శ్రీను వైసీపీకి గుడ్ బై కొట్టేసి టీడీపీలోకి చేరిపోయారో అధికార కూటమి బలం మరింత పెరిగింది. సమీకరణలు కూడా సమూలంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో చిన్న శ్రీను కుమార్తె ఈ పీఠాన్ని అధిరోహిస్తారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఇపుడు టీడీపీకి చెందిన నేతలే ఈ పీఠాన్ని టార్గెట్ చేశారు అని అంటున్నారు.
ఫోకస్ పెట్టిన యువ నేత :
కిమిడి నాగార్జున విజయనగరం జిల్లా టీడీపీలో యువ నాయకుడు. ఆయన 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2024లో అయితే ఆయన పెదనాన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అక్కడికి షిఫ్ట్ కావడం వల్ల చాన్స్ పోయింది. ఇక కిమిడి నాగార్జునది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తల్లి కిమిడి మృణాళిని 2014 నుంచి 2017 వరకూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక తండ్రి కూడా గతంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నాగార్జునకు విజయనగరం డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది. కానీ అధికార పదవులు ఇంకా దరి చేరలేదు, దాంతో ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్తు చైర్మన్ పీఠాన్ని కైవశం చేసుకుంటే జిల్లా మీద పట్టు సాధించవచ్చు అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ప్రస్తుతం టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు.
ఎమ్మెల్యే రేసులో నుంచి :
అదే సమయంలో ఎస్ కోటలో ఎమ్మెల్యే రేసులో చివరి దాకా దూసుకుని వచ్చి సీనియర్ నేత కోళ్ల లలిత కుమారికి చాన్స్ దక్కడంతో తప్పుకున్న ఎన్నారై గొంప క్రిష్ణ పేరు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం బలంగా వినిపిస్తోంది. ఆయనకు కూడా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవిని ఇచ్చింది. కానీ సరైన అవకాశం కోసం చూస్తున్న గొంప క్రిష్ణ జిల్లా స్థాయిలో చక్రం తిప్పడానికి జెడ్పీ పీఠం సరైనది అని భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన ఫోకస్ కూడా ఈ వైపే పెట్టేశారు అని అంటున్నారు. కిమిడి నాగార్జున గొంప క్రిష్ణ ఇద్దరూ బలమైన సామాజిక వర్గానికి చెందిన యువ నేతలు, బీసీ నేతలు, అంతే కాదు అంగబలం అర్ధబలం ఉన్న వారు. దాంతో టీడీపీ వీరిలో ఒకరికి చాన్స్ ఇస్తే కనుక కళ్ళు మూసుకుని పీఠం కైవశం అవుతుందని అంచనా వేస్తున్నారు.
వీరంతా కూడా రెడీ :
కేవలం ఈ ఇద్దరు నేతలే కాదు అనేక మంది ఈ పీఠం కోసం చూస్తున్నారు. వారిలో నెల్లిమర్ల నుంచి ఎక్కువ మంది నేతల క్యూ ఉంది. సీనియర్ నేత సువ్వాడ రవిశేఖర్ ఈ పదవి కోసం చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన పేరు అయితే టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం విషయంలోనూ ప్రచారం సాగింది. ఇపుడు ఈ పదవి విషయంలో కూడా నలుగుతోంది. ఇక వనజాక్షి అనే మహిళా నేత కూడా ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఇక నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి అయిన కర్రోతు బంగార్రాజు ఈ పదవిలో తన వారిని నిలబెట్టేందుకు చురుకుగా పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. ఈసారి నెల్లిమర్లకే జెడ్పీ పీఠం అని అంటున్నారు. మరింత మంది నేతలు కూడా క్యూ కడుతున్నారు. టీడీపీలో ఈ పరిస్థితి ఉంటే జనసేన నుంచి కూడా ఆశావహులు ఉన్నారు. దాంతో ఎవరిని జెడ్పీ పీఠం వరిస్తుందో చూడాల్సి ఉంది. ఇంతకీ చిన్న శ్రీను వారసురాలు జెడ్పీ పీఠానికా లేక మేయర్ సీటుగా అన్నది కూడా తేలితేనే లెక్క సరిపోతుంది అని అంటున్నారు.