వైసీపీ టూ జనసేన...ఎవరికి లాభం ?
ఇక జనసేన విషయానికి వస్తే వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు అక్కడ మొదటి స్థానమే దక్కుతుంది. ఎందుకంటే జనసేనలో వారికి అంతగా పోటీ ఉండదు,
వైసీపీలో వర్గ పోరు ఉంది. చాలా చోట్ల ఎక్కువ మంది నేతలు ఉన్నారు. వారంతా నియోజకవర్గం స్థాయి నాయకులే. వారిని అలా ప్రోత్సహించిన అధినాయకత్వం మరో సమయంలో వారి ప్లేస్ లో కొత్త వారిని తీసుకుని రావడంతో వారు పక్కకు పోయినా తమకంటూ ఉన్న వర్గంతో పార్టీలో పోరుకు కారణం అవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోరు వల్ల వైసీపీకి జరగాల్సిన రాజకీయ నష్టం బాగానే జరిగింది. ఇపుడు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల వేళ వారికి మరో చాన్స్ వచ్చినట్లుగా ఉంది. అందుకే వైసీపీని వీడిపోతున్నారు. వీరంతా జనసేనను బెస్ట్ ఆప్షన్ గా చూసుకుంటున్నారు.
జనసేన టార్గెట్ :
ఏపీలో రెండే పార్టీల వ్యవస్థ నుంది. జనసేన మూడవ పార్టీగా ఎమర్జ్ కావాలని అనుకుంటోంది. ఈ నేపధ్యంలో విపక్షంలో ఉన్న వైసీపీని జనసేన టార్గెట్ చేసింది. అధికారంలో ఉండగానే పార్టీని పటిష్టం చేసుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కూడా భావిస్తోంది. అంది వచ్చిన అవకాశాలను సొమ్ము చేసుకునేందుకు జనసేన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కి వైసీపీ నేతలు చాలా చోట్ల గాజు గ్లాస్ పట్టుకుంటున్నారు. అలా వైసీపీలో వర్గ పోరు గట్టిగా ఉన్న చోట్ల ఇమడలేని నేతలు అంతా జనసేనకు షిఫ్ట్ అవుతున్నారు. దీంతో వైసీపీ టూ జనసేన పొలిటికల్ షిఫ్టింగ్ ఎవరికి లాభం అన్న చర్చ ముందుకు వస్తోంది.
వైసీపీకి మేలేనా :
వైసీపీలో ఉన్నా కూడా వర్గ పోరుతో నష్టం చేస్తూ వస్తున్న నాయకులను ఆ పార్టీ కలిపి ఉంచలేకపోతోంది. నిన్నటిదాకా తాము ఇంచార్జిగా ఉన్న ప్లేస్ లో కొత్త వారు వస్తే సహకరించడం కష్టం అన్నది ఈ నేతల భావన. అలా ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడ్చే విషయంలో అధినాయకత్వం ఫెయిల్ అవుతోంది. దాంతో ఈ నేతలు పార్టీని వీడుతున్నారు. దీని వల్ల వైసీపీకి రాజకీయ నష్టమా లేక లాభమా అంటే తాత్కాలికంగా నష్టమే అని అంటున్నారు. ఎందుకంటే వారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అయితే పార్టీలో ఉంటూ చేసే నష్టం కంటే ప్రత్యర్ధిగా ఉంటేనే ఉత్తమం అన్న భావన కూడా ఉంది. దాని వల్ల పార్టీలో ఎలాంటి గందరగోళం లేకుండా అంతా ఏకత్రాటిపైకి వస్తారు అని భావిస్తున్నారు. ఇక వారి వెంట వెళ్ళిన నేతలు ఎవరైనా ఉంటే సార్వత్రిక ఎన్నికల నాటికి బలం తిరిగి సంపాదించుకోవడానికి పార్టీకి చాలా సమయం ఉంటుందని కూడ విశ్లేషిస్తున్నారు.
జనసేన సంగతేంటి :
ఇక జనసేన విషయానికి వస్తే వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు అక్కడ మొదటి స్థానమే దక్కుతుంది. ఎందుకంటే జనసేనలో వారికి అంతగా పోటీ ఉండదు, అయితే కూటమిలో టీడీపీ కూడా ఉంది. నిన్నటిదాకా టీడీపీకి ఎదురు నిలిచి పోరాడి ఇపుడు మిత్రులుగా వచ్చినా ఆ పార్టీ నుంచి అనుకున్న సహకారం ఉండకపోవచ్చు. దాంతో కూటమిలో ఇమడడం మరో సవాల్ గా ఉంటుంది. అయితే జనసేన సొంతంగా రేపటి రోజున బలపడాలి అనుకుంటే వీరే కీలకం అవుతారు. అందువల్ల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుంటే ఈ చేరికలు జనసేనకు లాభమే. అపుడు ఏపీ రాజకీయాల్లో మూడవ ఫోర్స్ గా జనసేన కూడా గట్టిగా నిలబడుతుంది అని అంటున్నారు.
కొత్త నేతలను తయారు చేసుకోవడమే :
అయితే వైసీపీ నేతలను కానీ ఇతర పార్టీల నాయకులను కానీ తెచ్చి పార్టీని బలోపేతం చేసుకోవడం కంటే సొంతంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కొత్త నేతలను తయారు చేసుకోవడమే జనసేనకు మంచిది అన్నది కూడా సలహా సూచనలు వస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయాల్లో రెడీ మేడ్ ఫలితాలు కావాలి కాబట్టి ఇప్పటికి ఇదే కరెక్ట్ అన్నది కూడా ఉంది. ఇక జనసేన ఎంత బలపడితే అంత టీడీపీకే ఇబ్బంది అన్న చర్చ కూడా ఉంది. మరి ఈ జంపింగులతో కూటమి బలంగా మారుతుందా లేక అసంతృప్తులు ఇబ్బందులు వచ్చి వైసీపీకి మేలు చేస్తుందా అంటే 2029 ఎన్నికలే సరైన జవాబు చెప్పాల్సి ఉంటుంది.