విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ రూమర్లు.. యూనివర్సిటీలో ఎల్.పీయూ విద్యార్థుల విధ్వంసం

పంజాబ్‌లోని ప్రముఖ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్.పీయూ)లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Update: 2026-09-27 11:16 GMT

పంజాబ్‌లోని ప్రముఖ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్.పీయూ)లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించిన ఒక పుకారు విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలను రగిలించింది. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగడంతో క్యాంపస్ పరిసరాలు రణరంగంగా మారాయి.

సోషల్ మీడియాలో కలకలం.. రూమర్లతో చెలరేగిన ఆగ్రహం

లేడీస్ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. అనంతరం తీవ్ర మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందనే వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం క్యాంపస్‌లో కార్చిచ్చులా వ్యాపించడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆందోళనతో రాత్రికి రాత్రే సుమారు 2,000 మంది విద్యార్థులు ఒకచోట చేరారు. యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే స్పందించి వాస్తవాలను వెల్లడించాలని.. విద్యార్థుల భద్రతపై స్పష్టత ఇవ్వాలని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఉద్రిక్తంగా మారిన నిరసన.. జాతీయ రహదారి దిగ్బంధం

న్యాయం కావాలంటూ శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల నిరసన క్రమంగా అదుపు తప్పింది. ఆందోళనకారుల్లోని కొందరు తీవ్ర ఆగ్రహంతో క్యాంపస్‌లోని ఆస్తులపై రాళ్ల దాడికి పాల్పడటమే కాకుండా కొన్ని చోట్ల నిప్పంటించారు. క్లాస్‌రూమ్‌లను ధ్వంసం చేయడంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. అనంతరం విద్యార్థులు జలంధర్–ఫగ్వారా జాతీయ రహదారిపైకి చేరుకుని రోడ్డు దిగ్బంధం చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రంగంలోకి పోలీసులు.. కేసులో ఊహించని మలుపు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించిన వివరాలు ఈ ఘటనలో కీలక మలుపుగా మారాయి. గ్యాంగ్ రేప్ లేదా లైంగిక దాడికి సంబంధించి ఇప్పటివరకు బాధితుల నుంచి గానీ.. ఇతరుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ఆ ఘటనకు ఈ గ్యాంగ్ రేప్ ఆరోపణలకు ఎలాంటి సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు.

సోషల్ మీడియా దుష్ప్రచారానికి పరాకాష్ట

ఒక నిర్ధారణ లేని వార్త సోషల్ మీడియాలో ఏ స్థాయిలో శాంతిభద్రతల సమస్యను సృష్టించగలదో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. విద్యార్థులు తమ సహచరి భద్రత పట్ల ఆందోళన చెందడం సహజమే అయినప్పటికీ ఆధారాలు లేని పుకార్లను నమ్మి విధ్వంసానికి దిగడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది.

ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పుకారు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? విద్యార్థిని ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటి? అనే కోణంలో విచారణ వేగవంతం చేశారు. పోలీసుల అధికారిక దర్యాప్తు నివేదిక బయటకు వస్తేనే ఈ మొత్తం ఘటనపై పూర్తి స్పష్టత రానుంది.



Tags:    

Similar News