వైసీపీ జాతీయ రాజకీయం...డైలామాలో నేనా ?

ఆయన ఒక వైపు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక కీలక బిల్లులకు మద్దతు ఇస్తూ అదే సమయంలో కొన్ని అంశాలలో విభేదిస్తున్నారు.

Update: 2026-09-27 14:57 GMT

వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ స్థాయి రాజకీయాలో తమ పార్టీ స్టాండ్ ఎటు అన్న దాని విషయంలో కొంత గందరగోళానికి గురి అవుతున్నారా అన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి సందేహంగా ఉంది. ఆయన ఒక వైపు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక కీలక బిల్లులకు మద్దతు ఇస్తూ అదే సమయంలో కొన్ని అంశాలలో విభేదిస్తున్నారు. దాంతో వైసీపీ స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పాలని సహజంగానే డిమాండ్ వస్తోంది. అదిపుడు ఇండియా కూటమి వైపు నుంచి వచ్చింది. ఆ కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా జగన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ మీద ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అంతే కాదు ఆయనకు కొన్ని సూచనలు కూడా చేశారు. అదే ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

మీ వైఖరి ఏంటి :

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విషయంలో వైసీపీ అధినాయకత్వం అనుసరిస్తున్న వైఖరిని మహువా మొయిత్రా గట్టిగానే ప్రశ్నించారు. తాజాగా జగన్ కేంద్ర ఎన్నికల సంఘం తీరుని ప్రశ్నిస్తూ వారి నియామకానికి సంబంధించి 2023లో చేసిన చట్టాన్ని పున సమీక్షించాలని డిమాండ్ చేశారు. చిత్రమేంటి అంటే గతంలో వైసీపీ ఈ చట్ట సవరణకు మద్దతు ఇచ్చింది. ఇపుడు అదే ఎన్డీయే మిత్ర పక్షాలకు అలాగే ఇండియా కూటమి పక్షాలకు జగన్ ని విమర్శించేందుకు ఒక అవకాశం ఇచ్చింది. అందుకే మహువా మొయిత్రా ఎన్డీయే సర్కార్ పట్ల వైసీపీ స్పష్టమైన వైఖరి ఏమిటో చెప్పాలని కోరుతున్నారు.

మద్దతు ఇస్తూనే :

వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి అనేక బిల్లుల విషయంలో పూర్తి మద్దతు ప్రకటించింది. అందులో ఎన్నికల సంఘం నియమించే కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్యానెల్ లో మార్పు చేసే చట్ట సవరణ బిల్లు ఒకటి. ఇపుడు దానినే వైసీపీ ప్రశ్నించడంతో ఆ పార్టీని మరింతగా కార్నర్ చేసేందుకు వివిధ రాజకీయ పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. నాడు మద్దతు ఇచ్చి నేడు ఈ ప్రశ్నలు వేయడం పట్ల వైసీపీ స్టాండ్ ని అంతా నిలదీస్తున్నారు. నిజానికి ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత గత రెండేళ్ళుగా కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తూ వస్తోంది. దాంతో జగన్ తాజా డిమాండ్ మీద ఇండియా కూటమి పక్షాలు అయితే అంతగా విశ్వసించలేని పరిస్థితి గా ఉంది అని అంటున్నారు.

డీలిమిటేషన్ కి సపోర్టు వద్దు :

ఒక వైపు ఎన్డీయే ప్రభుత్వం పెట్టే బిల్లులకు మద్దతు ఇస్తూ మరో వైపు రాజ్యాంగబద్ధమైన సంస్థల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేయడం ఏమిటన్నది మహువా మొయిత్రా జగన్ ని ప్రశ్నిస్తున్నారు. ఎన్డీయేకు నిరంతరం వైసీపీ మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆమె నిలదీస్తున్నారు. వైసీపీకి రాజ్యాంగబద్ధమైన సంస్థల పనితీరుపై ఆందోళన నిజంగా ఉంటే కనుక ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని మహువా మొయిత్రా సలహా ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఎన్డీయే ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ బిల్లు ప్రక్రియకు పార్లమెంట్ లో మద్దతు ఇవ్వకుండా తన పార్టీ ఎంపీలను జగన్ నియంత్రించాలని మహువా మొయిత్రా సూచించారు.

వైసీపీకి సవాల్ గా :

ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ ఒకసారి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది. ఏప్రిల్ 16, 17 తేదీలలో జరిగిన ప్రత్యేక సమావేశాలలో ఈ బిల్లుకు 298 మంది ఎంపీలు మద్దతుగా నిలిచారు. అందులో లోక్ సభలో ఉనన్ వైసీపీ నలుగురు ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు అని వార్తలు వచ్చాయి. ఇపుడు అదే పాయింట్ ని పట్టుకుని మహువా మొయిత్రా జగన్ ని ప్రశ్నిస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచి ఆ తర్వాత ప్రజా ఆమోదం కోరే వారికి మద్దతు ఇవ్వవద్దని కూడా ఆమె వైసీపీఅధినేత జగన్ కి విజ్ఞప్తి చేశారు. ఇదిపుడు వైసీపీ జాతీయ రాజకీయ విధానాలకు ఒక సవాల్ గా మారే చాన్స్ ఉందా అన్న చర్చ సాగుతోంది.

అటూ ఇటూ కూడా :

వైసీపీ వైఖరి చూస్తే అంశాల వారీగా మద్దతు అని చెబుతోంది. అయితే అలాంటిది కాకుండా స్పష్టంగా ఒకే వైపు ఉండాలని ఇండియా కూటమి పక్షాలు కోరుతున్నట్లుగా మహువా మొయిత్రా వ్యాఖ్యలు బట్టి అర్ధం అవుతోంది. ఇంకో వైపు ఎన్ డీయే మిత్ర పక్షం అయిన టీడీపీ కూడా జగన్ ద్వంద్వ రాజకీయ విధానాలు అని విమర్శిస్తోంది. ఆ పాటీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికి అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమి కూడా వైసీపీ తాజా ప్రకటన మీద భిన్నంగానే రియాక్ట్ అయ్యాయి. మరి ఈ నేపధ్యంలో వైసీపీ ఏమి చేస్తుంది అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News