స్వర్ణ వార్డు ఉద్యోగులకు కూటమి గుడ్ న్యూస్

ఏపీలో స్వర్ణ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభ వార్తను వినిపించింది.

Update: 2026-09-27 14:56 GMT

ఏపీలో స్వర్ణ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభ వార్తను వినిపించింది. వారికి పదోన్నతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు 244 వివరాల ప్రకారం స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ మార్గాలు కల్పించారు. పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని స్వర్ణ వార్డు సచివాలయాల్లో నాలుగు రకాల కేడర్లకు చెందిన ఉద్యోగుల హోదాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా అందుబాటులో ఉన్న మిగులు పోస్టులను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ప్రమోషన్ అవకాశాలు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా పోస్టులు :

ఇదిలా ఉంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటు చేస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయాలలో ఉన్న 458 వార్డు ఎమెనిటీస్ కార్యదర్శులు 457 వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శులు మిగులు పోస్టులు మొత్తం 915 పోస్టులు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 815 మిగులు పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ద్వారా అర్హులైన వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులకు ప్రమోషన్ కల్పిస్తారు. అలాగే డేటా ప్రోసెసింగ్ కార్యదర్శుల ప్రమోషన్లు చూస్తే వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులకు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రావడం వల్ల ఖాళీ అయ్యే పోస్టుల్లోకి అర్హులైన వారికి ప్రమోషన్ ఇస్తారు. అదే విధంగా గ్రేడ్-వన్ పోస్టుల సృష్టి జరుగుతుంది. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ 815 గ్రేడ్-టూ పోస్టులను గ్రేడ్-వన్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు.

అర్హులైన వారి కోసం :

ఇక వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలుగా 815 గ్రేడ్-టూ పోస్టులను గ్రేడ్-వన్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు. వీటి ద్వారా అర్హులైన గ్రేడ్-టూ కార్యదర్శులకు గ్రేడ్-వన్ హోదాకు ప్రమోషన్లు లభిస్తాయి. దీని వల్ల అదనపు ఆర్థిక భారం లేదని చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న మిగులు పోస్టులను ఎంట్రీ లెవెల్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారానే ఈ మార్పులు చేశారు, అందువల్ల ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం పడదని చెబుతున్నారు. అదే సమయంలో ఉద్యోగుల కెరీర్ పురోగతికి ఇది దోహదపడుతుంది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వు ద్వారా వార్డు సచివాలయ సిబ్బందికి స్పష్టమైన ప్రమోషన్ మార్గం లభిస్తుందని చెబుతున్నారు.

నెల రోజులలో ప్రమోషన్లు:

దీని మీద మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. గతంలో ఇవ్వాల్సిన రెగ్యులరైజేషన్ ని కూడా కూటమి ప్రభుత్వమే అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల డిమాండ్ మేరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్స్ ని ఆర్థిక శాఖకు పంపామని చెప్పారు. ఆటోమేటిక్ లీవ్స్ సాంక్షన్ విధానం తెచ్చామని కూడా వెల్లడించారు. ఇప్పటికే 14 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చాం. మిగతా వారికీ రాబోయే నెల రోజుల్లో ఇస్తామని ఆయన వివరించార్. త్వరలో కొత్త పీఆర్సీని వేస్తామని తెలిపారు. మొత్తానికి స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News