28 రోజుల ఫోన్ రీఛార్జ్ దోపిడీకి చెక్.. సామాన్యుడికి దక్కిన ఊరట
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథపరిటీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. టెలికాం ఆపరేటర్ల వ్యాపార ధోరణికి చెక్ పెడుతూ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తెచ్చింది.
ప్రతి నెలా రీఛార్జ్ ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులకే ముగిసిపోతుండటంతో ఏడాదికి 12 నెలలకు బదులుగా 13 సార్లు డబ్బులు చెల్లించాల్సి వస్తోందని సగటు మొబైల్ వినియోగదారుడు చాలా కాలంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథపరిటీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. టెలికాం ఆపరేటర్ల వ్యాపార ధోరణికి చెక్ పెడుతూ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తెచ్చింది.
ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి దిగ్గజ కంపెనీలు అందిస్తున్న దాదాపు అన్ని ప్లాన్లలో డేటా నిర్బంధంగా ఉంటోంది. అయితే కేవలం మాట్లాడటానికి లేదా సెకండరీ సిమ్ సజీవంగా ఉంచుకోవడానికి మాత్రమే ఫోన్ వాడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది ఆర్థిక భారంగా మారింది. ఈ నేపథ్యంలో 'వాయిస్ & ఎస్ఎంఎస్ ఓన్లీ' ప్లాన్లను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. స్మార్ట్‌ఫోన్ వాడని సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రాంత వినియోగదారులు, ఫీచర్ ఫోన్ యూజర్లు , సెకండరీ సిమ్‌లను నిర్వహించేవారికి ఈ విధానం ఎంతగానో లబ్ధి చేకూరుస్తుంది. అంతేకాకుండా 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యవధితో లభించే సరసమైన వోచర్లను రూపొందించాలని కూడా స్పష్టం చేసింది.
ఇప్పటివరకు అమల్లో ఉన్న 28 రోజుల రీఛార్జ్ సైకిల్ వల్ల కస్టమర్లు ఏడాదిలో ఒక నెల అదనంగా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ 'కంబైన్డ్ వ్యాలిడిటీ' ట్రిక్‌కు ముగింపు పలుకుతూ ట్రాయ్ క్యాలెండర్ నెల ఆధారిత వ్యాలిడిటీని ప్రతిపాదించింది. ఉదాహరణకు మీరు ఒక నెలలో 10వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే ప్రతి నెలా మళ్లీ 10వ తేదీనే మీ ప్లాన్ రిన్యూ అవుతుంది. ఒకవేళ ఫిబ్రవరి వంటి నెలల్లో ఆ నిర్దిష్ట తేదీ లేకపోతే, ఆ నెల చివరి రోజు వరకు వ్యాలిడిటీ సజావుగా కొనసాగుతుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం ఆపరేటర్లు ప్రత్యేక ప్లాన్లపై తగిన రీతిలో టారిఫ్ ధరలను తగ్గించాల్సి ఉంటుంది. అయితే ప్లాన్ల ధరలపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రానప్పటికీ ప్లాన్ల రూపకల్పన ప్రక్రియను టెలికాం కంపెనీలు ఇప్పటికే వేగవంతం చేసినట్లు సమాచారం. ఈ మార్పుల వల్ల టెలికాం కంపెనీల సగటు ఆదాయంపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ కస్టమర్ల అసంతృప్తిని తగ్గించడానికి ఇది ఎంతో అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.
డేటా పేరుతో అవసరం లేని ప్యాక్‌లను నెత్తిన రుద్దే రోజులకు కాలం చెల్లనుంది. రాబోయే రోజుల్లో టెలికాం కంపెనీలు కొత్త టారిఫ్ ప్లాన్లను అధికారికంగా ప్రకటించిన తర్వాతే సగటు వినియోగదారుడికి ఎంత మేర జేబు భారం తగ్గుతుందనేది స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ట్రాయ్ తీసుకున్న ఈ చర్య టెలికాం రంగంలో కస్టమర్ల హక్కులకు పెద్ద పీట వేసిందనడంలో సందేహం లేదు.