తమిళ రీల్ హీరోల రియల్ హీరోయిజం హేట్సాఫ్

ఈ తరహా అంశాల్లో తగిన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే అంశాన్ని తగిన వేదిక మీద కార్తీ ప్రశ్నించిన తీరును అభినందించాల్సిందే.

Update: 2026-09-28 06:07 GMT

రీల్ హీరోస్ రియల్ హీరోలుగా వ్యవహరించే ధోరణి అన్ని చిత్రపరిశ్రమల్లో అస్సలు కనిపించదు. బాలీవుడ్.. టాలీవుడ్.. శాండల్ వుడ్.. ఇలా ‘వుడ్’ లు ఏదైనా.. ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే తత్త్వం కనిపించదు. అందుకు మినహాయింపుగా కనిపిస్తుంది కోలీవుడ్. మిగిలిన చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలతో పోలిస్తే.. తమిళ చిత్ర హీరోల్లో సామాజిక అంశాల విషయాల్లో వారు మిగిలిన చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలతో పోలిస్తే ముందుంటారు. రాజకీయాల కంటే రాజకీయ పార్టీలను నేరుగా ప్రశ్నించే విషయంలో అస్సలు తగ్గరు. తమకు ఏమైనా అవుతుందన్న ఆలోచన పెద్దగా చేయని తత్త్వం కనిపిస్తుంది.

కమల్ హాసన్.. ప్రకాశ్ రాజ్.. విజయ్.. సూర్య.. విశాల్.. తాజాగా ఆ జాబితాలోకి చేరారు హీరో కార్తీ. తాజాగా కోవైలో జరిగిన మాజీ పోలీస్ అధికారుల ట్రస్ట్ పదో వార్షికోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఆయన.. రాష్ట్ర పోలీసులు ఎదుర్కొంటున్న కీలక అంశాన్ని ప్రస్తావించి వార్తల్లోకి వచ్చారు. ప్రజలకు భద్రత కల్పించే పోలీసులకు పొరుగు రాష్ట్రాల్లో మాదిరి వీకాఫ్ (వారాంతపు సెలవు) ప్రకటించే విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.

గత డీఎంకే ప్రభుత్వం మాదిరే ప్రస్తుత టీవీకే ప్రభుత్వం కూడా ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం చేస్తున్నట్లుగా పేర్కొంటూ.. ‘ఇలాంటి నిర్ణయాలను ప్రకటించే విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావటం లేదు’ అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీ అందునా.. మొన్నటి వరకు సహ నటుడిగా ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ.. విషయాల ఆధారంగా ప్రశ్నించే తత్త్వం కార్తీలో కనిపించిందని చెప్పాలి.

కార్తీ ఆవేదనలో న్యాయం ఉంది. ఎందుకంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర పోలీసులకు వీకాఫ్ ఇచ్చే విషయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే నిర్ణయం తీసుకుంటామని విజయ్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల హామీని అమలు చేయటానికి.. అందునా పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటించటానికి పెద్ద సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇదో పాలనా నిర్ణయం. ఆర్థికంగా పెద్ద భారం పడే అవకాశం లేదు. కాకుంటే.. ఈ సెలవును ప్రకటిస్తే.. ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానంలో కొంత మార్పులు తప్పించి.. ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి అదనపు భారం పడదు.

ఈ తరహా అంశాల్లో తగిన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే అంశాన్ని తగిన వేదిక మీద కార్తీ ప్రశ్నించిన తీరును అభినందించాల్సిందే. ఎన్నికల వేళ ఇచ్చిన హామీపై విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోని అంశాన్ని తాజాగా కార్తీ ప్రశ్నించటం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీకి అనుగుణంగా పోలీసులకు వారాంతపు సెలవును వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసిన తీరు చూస్తే.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ అసలుసిసలు హీరోగా కార్తీ కనిపిస్తారని చెప్పాలి. మరి.. కార్తీ డిమాండ్ పై ముఖ్యమంత్రి విజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. చివరగా.. ఈ తరహాలో తెలుగు హీరోలు ఎందుకు స్పందించరు? సామాజిక అంశాలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించే ధైర్యం ఎవరికి ఉందన్న ప్రశ్న.. కార్తీ ఉదంతాన్ని చూసినంతనే మనసులో మెదలటం ఖాయం. కాదంటారా?

Tags:    

Similar News