ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే: 'అసిస్టెంట్ డైరెక్టర్' గ్రాఫ్ ఇదే.. !
నడికుదిటి ఈశ్వరరావు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చురుకైన, విభిన్నమైన గుర్తింపు ఉన్న నాయకుడిగా కొనసాగు తున్నారు.
నడికుదిటి ఈశ్వరరావు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చురుకైన, విభిన్నమైన గుర్తింపు ఉన్న నాయకుడిగా కొన సాగుతున్నారు. 2024 శాసనసభ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి బిజెపి తరపున ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఆయన పనితీరు, వ్యక్తిత్వం, ప్రజా సేవకు సంబంధించిన విషయాల్లో ఫీల్ గుడ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజా సమస్యలపై తక్షణ స్పందన చూపిస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యల పట్ల ఆయన వేగంగా స్పందిస్తున్నారు. ఈయనకు సినీ పరిశ్రమకు మధ్య అవినాభావ సంబంధం ఉండడం గమనార్హం. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పనిచేశారు.
తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆయన తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరుకు కృషి చేయడం వంటి కార్యక్రమాలతో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐఐఎం కోల్‌కతా పూర్వ విద్యార్థి అయిన ఈశ్వరరావు విద్య ప్రాముఖ్యతను గుర్తించి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో తన పేరుతోనే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థను స్థాపించారు. ఇక, సినీ రంగం నుండి ప్రజా సేవకు మారిన ఆయన.. గతంలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారు.కూటమిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోను, కూటమి పార్టీల సమన్వయంలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తన చమత్కారమైన సంభాషణలు, ప్రసంగాలతో తోటి నాయకులను, ప్రజలను ఆకట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నియోజకవర్గ అభ్యున్నతికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్థానికంగా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇక, కూటమి పార్టీల మధ్య సమన్వయం కూడా బాగానే ఉంది.
వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే..
ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర అంతర్గత విభేదాలు, వర్గపోరుతో సతమతమవుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై: నియోజకవర్గంలో పార్టీ నేతలు మండిపడుతున్నారు. కిరణ్ కుమార్ వర్గానికి, పార్టీలోని మరికొందరు స్థానిక సీనియర్ నేతలకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాలు ఇటీవల మరింత రచ్చకెక్కాయి.స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆందోళన కూడా కనిపిస్తోంది. క్యాడర్‌ను బలోపేతం చేయాల్సింది పోయి, నాయకుల మధ్యే అంతర్గత కుమ్ములాటలు పెరగడంపై వైసీపీ అధిష్ఠానం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ.. ఈశ్వరరావుకు కలిసి వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఫీల్‌గుడ్ ఎమ్మెల్యేగా ఎన్ ఈఆర్ గుర్తింపు పొందుతున్నారు.