సుప్రీంకోర్టులో ‘దీదీ’ గర్జన: ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా వాదనలు!
భారత న్యాయ, రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.;
భారత న్యాయ, రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సిట్టింగ్ సీఎం హోదాలో దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కి, న్యాయవాదిగా మారి తన వాదనలను వినిపించారు. ఓటరు జాబితా సవరణ అంశంపై ఆమె చేపట్టిన ఈ న్యాయపోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
న్యాయస్థానంలో ఏం జరిగింది?
బుధవారం జరిగిన విచారణలో మమతా బెనర్జీ "పార్టీ ఇన్ పర్సన్" గా హాజరయ్యారు. అంటే తన తరపున ఏ న్యాయవాదినీ నియమించుకోకుండా స్వయంగా తన కేసును తానే వాదించుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రులు తమ తరపున సీనియర్ న్యాయవాదులను నియమిస్తారు. కానీ దీదీ మాత్రం తానే రంగంలోకి దిగారు.
మమత ప్రధాన వాదనలు ఏంటంటే?
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి 6 సార్లు లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతోనే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. "ఇది నా రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం కాదు, సామాన్య ఓటర్ల హక్కుల కోసం చేస్తున్న పోరాటం" అని ఆమె కోర్టు ముందు స్పష్టం చేశారు.
న్యాయవాదిగా మమతకు ఉన్న నేపథ్యం
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మమతా బెనర్జీకి న్యాయవిద్యలో ప్రవేశం ఉంది. ఆమె కోల్‌కతాలోని జోగేశ్ చంద్ర చౌదరీ లా కాలేజీ నుండి లా డిగ్రీ పట్టా పొందారు. 2003 వరకు ఆమె న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం కూడా ఉంది. ఆ పాత అనుభవంతోనే ఆమె సుప్రీంకోర్టులో అత్యంత చాకచక్యంగా చట్టపరమైన పట్టుతో వాదనలు వినిపించగలిగారు. ఎన్నికల సంఘం పనితీరును ఒక ముఖ్యమంత్రి న్యాయస్థానంలో ప్రశ్నించడం వ్యవస్థాగత చర్చకు దారితీసింది.ప్రజల హక్కుల కోసం తానే నేరుగా పోరాడుతానని మమత తన కేడర్‌కు , ప్రజలకు బలమైన సంకేతం ఇచ్చారు. ఒక సిట్టింగ్ సీఎం సుప్రీంకోర్టులో స్వయంగా వాదించడం భారత న్యాయ చరిత్రలో అత్యంత అరుదైన సంఘటనగా చెప్పొచ్చు.
ఓటరు జాబితాల్లో అన్యాయంగా పేర్లు తొలగించడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని మమతా బెనర్జీ చేసిన వాదనలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ విచారణ ఫలితం భవిష్యత్తులో దేశవ్యాప్త ఎన్నికల సంస్కరణలు.. ఓటరు నమోదు ప్రక్రియపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. న్యాయవాది కోటు వేయకపోయినా ముఖ్యమంత్రి హోదాలో ఆమె వినిపించిన తర్కం న్యాయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.