వైసీపీ నేత హ్యాట్రిక్ ఆశ‌లు.. పార్టీ లెక్క వేరే ఉందా...?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి విజ‌యం ద‌క్కించు కోవాల‌ని భావిస్తున్నారు.

Update: 2026-08-17 19:30 GMT

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి విజ‌యం ద‌క్కించు కోవాల‌ని భావిస్తున్నారు. వ‌రుస‌గా కాక‌పోయినా.. మూడోసారి విజ‌యం ద‌క్కించుకుంటే.. అది చాలు అన్న‌ట్టుగా ఆయ‌న లెక్క‌లు వేసుకుంటున్నారు. తిరుప‌తి జిల్లాలోని ఎస్సీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేసిన సూళ్లూరు పేట ఉంచి కిలివేటి గ‌తంలో రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2014, 2019లో వైసీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు.

``ఈ ఒక్క‌సారి గెలిస్తే.. చాలు.. గెలిపిస్తే చాలు`` అంటూ గ‌త 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో కిలివేటి ప్ర‌చారం కూడా చేశారు. కానీ, కూట‌మి హ‌వా నేప‌థ్యంలో కిలివేటి వెనుక‌బ‌డ్డారు. సుమారు 29 వేల ఓట్ల తేడాతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. వాస్త‌వానికి సూళ్లూరుపేటలో కిలివేటికి భారీ వ్య‌తిరేక‌త ఏమీ లేదు. పైగా.. అంద‌రికీ అందుబాటులో ఉంటార‌న్న పేరు కూడా తెచ్చుకున్నారు. అంతేకాదు.. పెద్ద‌గా వెనుకేసుకున్న‌ది కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని పార్టీ నాయ‌కులు కూడా చెబుతుంటారు.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు అంత కూట‌మి హ‌వాలోనూ.. 81 వేల పైచిలుకు ఓట్లు ప‌డ్డాయి. అయినా.. మూడోసారి విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న కిలివేటి ఆశలు.. అంచ‌నాలు ప‌టాపంచ‌ల‌య్యాయి. ఇక‌, ఇప్ప‌టి నుంచే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. కానీ.. ఈ విష‌యంలోనే పార్టీ ప‌రంగా గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌డం లేదు. దీనికి వ‌యోసంబంధిత కార‌ణాల‌ను పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో 60 + వారిని ప‌క్క‌న పెట్టే ఆలోచ‌న ఉంద‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది.

ఇది కిలివేటి హ్యాట్రిక్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న వ‌య‌సు 65 దాట నుంది. దీంతో పార్టీ ప‌రంగా ఆయ‌న‌కు టికెట్ ద‌క్కుతుందా? లేదా? అనేది సందేహం. మ‌రోవైపు.. ఇవేవీ ప‌ట్టించుకో కుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు కిలివేటి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే స‌మ‌యంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను జాగ్ర‌త్త‌గా మెయింటెన్ చేస్తున్నారు. ఇక‌, సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఏర్ప‌డుతున్న స‌హ‌జ‌మైన వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒక‌వేళ పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఇండిపెండెంటుగా పోటీ చేసే అవ‌కాశం కోసం కూడా చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tags:    

Similar News