కాంగ్రెస్ కి ఎస్పీ షాక్...మొదటి జాబితా రిలీజ్ !
| 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల పొత్తులో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ మొదలైంది. 403 స్థానాల్లో తమకు 130 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతుండగా, ఎస్పీ మాత్రం 26 సీట్లే ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ కోరిన రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు చర్చల్లో ఉత్కంఠ నెలకొంది.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కలిసుంటే కలదు సుఖం అన్న నీతిని పాటించి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీ భారీగా లబ్ది పొందాయి. ఫలితంగా బీజేపీ బాగా దెబ్బ తిన్నది. 2024 లోక్ సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 33 సీట్లు వస్తే ఎస్పీకి 37 వచ్చాయి. కాంగ్రెస్ కి ఆరుగురు ఎంపీలు వచ్చాయి. అంతకు ముందు 2022 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన ఈ పార్టీలు ఓటమి చూశాయి. అందుకే 2027 ఎన్నికల్లో కలిసి పోటీకి సిద్ధపడుతున్నాయి. అయితే అసలైన పోటీ సీట్ల విషయంలోనే వస్తోంది. తమకు భారీగానే సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. దాంతో ఎస్పీ ససేమిరా అంటోంది.
తొలి జాబితాతో ఎస్పీ :
ఇలా ఒక వైపు సీట్ల సర్దుబాటు చర్చలు సాగుతూండగానే మరో వైపు సమాజ్ వాదీ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. అలా చూస్తే కనుక సహరాన్‌పూర్ జిల్లాలోని బెహట్ నుంచి ఉమర్ అలీ ఖాన్, సహరాన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆశు మాలిక్ పోటీ చేయనున్నారు. షామ్లీ జిల్లాలోని కైరానా నుంచి నాహిద్ హసన్, అమ్రోహా నుంచి మెహబూబ్ అలీ, లలిత్‌పూర్ నుంచి జ్యోతి లోధి బరిలోకి దిగనున్నారు. ఎస్పీ తన అభ్యర్ధులను ప్రకటించడంలో తప్పు లేదు కానీ ట్విస్ట్ ఏంటి అంటే కాంగ్రెస్ కోరిన స్థానాలలో రెండింటిలో ఎస్పీ అభ్యర్థులను ప్రకటించడం. కాంగ్రెస్ తో సీట్ల వ్యవహారం కొలిక్కి రాకుండానే ఈ జాబితా విడుదల అంటే ఎస్పీ షాక్ ఇచ్చినట్లే అని అంటున్నారు.
కాంగ్రెస్ నంబర్ 130 :
యూపీలో మొత్తం 403 అసెంబ్లీ సీట్లలో తమకు 130 దాకా సీట్లు కేటాయించాల్సిందే అని కాంగ్రెస్ పట్టుబడుతోంది. నిజానికి మొదట్లో 181 సీట్లు కావాలని కోరిన కాంగ్రెస్ 51 సీట్లను తానుగానే తగ్గించుకుని ఈ నంబర్ కి వచ్చింది. అయితే ఇది కూడా బిగ్ నంబర్ అని ఎస్పీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ కి గ్రౌండ్ లో అంత బలం లేదని ఆ సీట్లు ఇస్తే కనుక బీజేపీకే ప్రయోజనం అని కూడా ఎస్పీ నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ కి ఎక్కడ పట్టు ఉందో చూసి మాత్రమే సీట్లు పంపిణీ చేస్తామని ఎస్పీ నేతలు చెబుతున్నారు.
జస్ట్ 26 మాత్రమేనట :
కాంగ్రెస్ కి యూపీలో బలం ఉన్న అసెంబ్లీ సీట్లను ఎస్పీ చూసి మరీ 26 సీట్లను ఇవ్వ చూపుతోంది. అంతకు మించి ఇస్తే అది కూటమి గెలుపునకే విఘాతం అవుతుందని అంటోంది. కాంగ్రెస్ తన బలం పెరిగింది అని ఎంతగా చెబుతున్నా వాస్తవాలు వేరేగా ఉన్నాయని ఎస్పీ నేతలు అంటున్నార్జు. అందుకే అన్ని విషయాలను పరిశీలించిన మీదటనే ఈ సీట్లు కాంగ్రెస్ కి ఇస్తున్నామని అంటున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ కూడా వెల్లడించినట్లుగా వార్థా కథనాలు పేర్కొన్నాయి. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదని గెలుపు అని ఎస్పీ నేతలు అంటున్నారు. ఎక్కడ ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయన్నది సమగ్రమైన అధ్యయనం చేసిన మీదటనే ఈ సీట్ల కేటాయింపు అని కూడా చెబుతున్నారు. ఇక ఒంటరిగా 2022 లో పోటీ చేసిన కాంగ్రెస్ కి అప్పట్లో వచ్చినవి రెండే సీట్లు అంటూ ఎస్పీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఎస్పీ భారీగానే :
మరో వైపు చూస్తే ఎస్పీ ఈసారి 350 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ గట్టిగా పట్టుబడితే మరో నాలుగు కలిపి 30 సీట్లతో ముగించాలని చూస్తోంది అని అంటున్నారు. అంతే కాకుండా ఇతర మిత్రులకు కూడా తక్కిన సీట్లు కేటాయించి బలమైన కూటమిగా బరిలోకి దిగి ఈసారి అధికారం చేపట్టాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి దీనికి కాంగ్రెస్ ఎంతమేరకు ఒప్పుకుంటుందో చూడాలి. ఈ పొత్తులు పెటాకులు అయితే మాత్రం బీజేపీకి పూర్తిగా అవకాశం ఇచ్చినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కాంగ్రెస్ ఆ ధైర్యం చేయబోదని కూడా అంటున్నారు.