హిందువులకు ఇంటికో తుపాకీ.. లక్నో వేదికగా రాజాసింగ్ 'భద్రతా' మంత్రం
| లక్నో పర్యటనలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందూ ఇంట్లో ఆత్మరక్షణ కోసం లైసెన్స్‌డ్ గన్ ఉండాలని సూచించారు. ఇద్దరు పిల్లల నిబంధనపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, అది అమలు కాకపోతే కుటుంబాల భద్రత కోసం ఆయుధాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
సాధారణంగా కొత్త ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి ఏం బహుమతిగా ఇస్తారు? ఏ వెండి గ్లాసో.. దేవుడి పటమో.. లేదంటే మహా అయితే ఒక మిక్సీనో ఇస్తారు. కానీ గోషామహల్ ఎమ్మెల్యే.. బీజేపీ నేత రాజాసింగ్ ఆలోచన మాత్రం వేరే లెవల్‌లో ఉంది. ఆయన ఉద్దేశంలో ఇకపై ప్రతి హిందూ ఇంట్లో ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ఉన్నా లేకపోయినా కచ్చితంగా ఒక లైసెన్స్‌డ్ గన్ మాత్రం ఉండి తీరాలట.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పర్యటనలో స్థానికులతో జరిగిన ఒక చిట్‌చాట్‌లో రాజాసింగ్ ఈ ఆత్మరక్షణ సూత్రాన్ని ప్రతిపాదించారు.
రాజాసింగ్ ప్రతిపాదన వెనుక ఒక ఆసక్తికరమైన లాజిక్ ఉందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. దేశంలో జనాభా సమతుల్యత దెబ్బతింటోందని.. ఒక మతం వారి జనాభా పెరుగుతోందని.. అందుకే ప్రభుత్వం వెంటనే ఇద్దరు పిల్లల నిబంధన చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ చట్టం రాకపోతే భవిష్యత్తులో కుటుంబాల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని.. అప్పుడు అందరూ తమను తాము కాపాడుకోవడానికి ఇంట్లో తుపాకులు ఉంచుకోవాలని ఆయన సూచించారు. అంటే జనాభా నియంత్రణ చట్టం అమలు కాకపోతే దేశంలోని ప్రతి ఇల్లు ఒక మినీ ఆయుధ కర్మాగారంగా మారాలన్నమాట..
రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత భద్రత ప్రతి పౌరుడి హక్కు అని.. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఉండటంలో తప్పులేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అయితే విశ్లేషకులు.. విమర్శకులు మాత్రం విభేదిస్తున్నారు. చిన్నపాటి పార్కింగ్ గొడవలకే రోడ్లపైకి వచ్చి కొట్టుకునే రోజుల్లో ఇంటికో తుపాకీ ఉంటే ఇక వీధులన్నీ యాక్షన్ సినిమాలను తలపిస్తాయని.. శాంతిభద్రతల సమస్యలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే భారతదేశంలో ఆయుధాలు కలిగి ఉండటం అనేది ఆయుధ చట్టం, 1959' నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం ఎవరికైనా తుపాకీ లైసెన్స్ కావాలంటే ప్రాణహాని ఉందని నిరూపించుకోవడం నుండి పోలీసుల విచారణ వరకు ఎన్నో కఠిన నిబంధనలు దాటాలి. అంతేకానీ కేవలం ఒక మతానికి లేదా వర్గానికి చెందినవారనే కారణంతో లైసెన్సులు ఇచ్చే వెసులుబాటు చట్టంలో లేదు.
లక్నోలో రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశంలో జనాభా విధానం.. ఆయుధ చట్టాలు.. పౌరుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు తెరలేపాయి.