రాహుల్ యూపీ స్కెచ్...పీఎం సీటుకు గేట్ వే !

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత హుషారుగా కనిపిస్తున్నారు. ఆయన గతంలో విజయాలు సాధించవచ్చు కానీ అవి కాంగ్రెస్ ఖాతాలో విజయాలుగానే నమోదు అయ్యాయి.

Update: 2026-10-19 05:30 GMT

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత హుషారుగా కనిపిస్తున్నారు. ఆయన గతంలో విజయాలు సాధించవచ్చు కానీ అవి కాంగ్రెస్ ఖాతాలో విజయాలుగానే నమోదు అయ్యాయి. కానీ 2024 నుంచి మాత్రం రాహుల్ వ్యక్తిగత ఇమేజ్ ని పెంచేలా ఆయన రాజకీయ పోరు సాగుతోంది. ఆయన పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతోంది. కేంద్రంలో బలమైన ఎన్డీయే సర్కార్ ని అనేక సార్లు ఇరకాటంలో పెడుతూ వస్తున్న రాహుల్ కి ప్రతిపక్ష పాత్రలో అతి పెద్ద విజయం అక్కడే దక్కుతోంది అని అంటున్నారు. అందుకే రాహుల్ ఉత్సాహం పట్టలేనంతగా ఉంది. అంతే కాదు గాంధీల వంశం అయిదవ తరం వారసుడికి ప్రధాని పీఠం చేరువలోకి వస్తోంది అన్న శుభ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

యూపీలో గెలుపు :

వచ్చే ఏడాది మొదట్లోనే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. యూపీలో చూస్తే సమాజ్ వాదీ పార్టీ పెద్దగా ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన కాంగ్రెస్ కూడా తన ప్రాధాన్యతను పెంచుకోవాలని చూస్తోంది. మొత్తం 403 సీట్లు ఉన్న యూపీ అసెంబ్లీలో సగానికి సగం సీట్లు అయినా పొత్తులో కావాలని కోరుకుంటోంది. నిజానికి ఇది చాలా అత్యాశగా కనిపిస్తోంది. కానీ ఇక్కడే కాంగ్రెస్ వ్యూహం ఉంది అని అంటున్నారు. రెండు వందల సీట్లు కోరితే అందులో వంద సీట్లు అయినా ఇస్తారు అన్నదే కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు.

బలంగా ఉంటేనే తప్ప :

ఇక యూపీ దేశ రాజకీయాలకు గుండె కాయ అన్నది కూడా తెలిసిందే. అక్కడ ప్రస్తుతం 80 దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. మొత్తం 543 సీట్లు ఉన్న పార్లమెంట్ లో ఇది అతి పెద్ద వాటాగా ఉంది. అందువల్లనే యూపీలో ఈసారి ఎక్కువ ఎంపీలు తెచ్చుకుంటే ప్రధాని సీటు కాంగ్రెస్ పరం అవుతుందని లెక్కలు ఉన్నాయని అంటున్నారు 2024లో ఎస్పీ కాంగ్రెస్ కూటమి యూపీలో పైచేయిగా నిలిచారు. బీజేపీ బలం 30 ప్లస్ దగ్గర ఆగిపోయింది. ఎస్పీ కాంగ్రెస్ కలసి 45 ప్లస్ సీట్లు సాధించారు. ఈసారి వాటిని మరింతగా పెంచుకోవాలని అందులో ఎస్పీతో సమానంగా కాకపోయిన ఒకటి రెండు తగ్గినా కాంగ్రెస్ భారీగానే తెచ్చుకోవాలని రాహుల్ గాంధీ ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు.

నాలుగు దశాబ్దాలుగా :

యూపీలో కాంగ్రెస్ బలం అధికారమూ రెండూ పోయి నాలుగు దశాబ్దాలు అవుతోంది. అందుకే పోయిన చోట వెతుక్కోవాలని చూస్తోంది. దీంతో సోషల్ ఇంజనీరింగ్ ని కూడా ఈసారి చేపడుతోంది. యూపీలో 13 శాతం బ్రాహ్మిన్స్, 22 శాతం దళితులు కాంగ్రెస్ కి ఒకప్పుడు ఓటు బ్యాంక్ గా ఉన్నారు దళితులు బీఎస్పీ వైపు బ్రాహ్మిన్స్ బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ఇపుడు బీఎస్పీ బలహీనం కావడంతో దళితులను మళ్లీ దగ్గరకు తీయాలని కాంగ్రెస్ చూస్తోంది. వారికి పార్టీ పదవుల్లో కీలకంగా చేస్తోంది. అలాగే బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్న బ్రాహ్మిన్స్ ని కూడా అక్కున చేర్చుకుంటోంది.

ఓట్ల చోరీ మీద ఉద్యమంతో :

యూపీసీసీ చీఫ్ గా ఆరాధనా మిశ్రాని నియమించడం వెనక బ్రాహ్మిన్స్ ఓట్లను ఆకట్టుకోవాలని రాహుల్ గాంధీ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. అలాగే ముస్లిమ్స్ ని కూడా చేరదీస్తోంది. వారికి యూపీలో బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ విధంగా రెండు వందల దాకా అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ తన పట్టు పెంచుకోవాలని చూస్తోంది. ఓట్ల చోరీ మీద ఉద్యమంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ దూకుడుగా చేస్తున్న పోరు యూపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు అందిస్తుందని భావిస్తున్నారు. యూపీలో అసెంబ్లీలో ఎక్కువ సీట్లు సాధించిన తరువాత ఎంపీ సీట్ల మీదనే రాహుల్ గురి పెడతారని అంటున్నారు.

Tags:    

Similar News