ఆలయంలో మృత్యుఘోష: ప్రచారమే ముంచింది!
మరో దశాబ్దం వరకు ఇంత మంచి రోజు రాదని.. లేదని.. దీనిని వదులు కుంటే కష్టమని, ఈ ముహూర్తంలోనే పరమశివుడిని అభిషేకించాలని.. సకల కోరికలు నెరవేరుతాయని చేసిన ప్రచారం.. భక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది
ఒక ప్రచారం.. భక్తుల ప్రాణాలు తీసింది. మరో దశాబ్దం వరకు ఇంత మంచి రోజు రాదని.. లేదని.. దీనిని వదులు కుంటే కష్టమని, ఈ ముహూర్తంలోనే పరమశివుడిని అభిషేకించాలని.. సకల కోరికలు నెరవేరుతాయని చేసిన ప్రచారం.. భక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అలెర్ట్ అయిన యంత్రాంగం బాధితులను ఆసుపత్రులకు తరలించింది.
ఏం జరిగింది?
సోమవారం(ఆగస్టు 17) శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమిగా ఉత్తరాది ప్రజలు భావిస్తారు. అయితే..దీనిని కొందరు జ్యోతిషులు అతి చేశారు. దశాబ్ద కాలంలో వచ్చే మంచి రోజు ఇదేనని.. దీనిని మించిన తరణం మరొకటి లేదని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయాన్నే పరమశివుడిని దర్శిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా ప్రకటించారు. అంతేకాదు.. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, పెళ్లి కాని వారికి దోషాలు తొలిగిపోతాయని విజృంభించి మరీ చెప్పారు. దీంతో భక్తులు లఖిసరాయ్ జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయం అశోక్‌ధామ్‌కు పోటెత్తారు.
పాటలీపుత్రను పరిపాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించిన ఆలయం కావడం.. సంతాన సాఫల్య దేవాలయంగా దీనికి పేరు కూడా ఉండడంతో పాటు జ్యోతిష్యులు చేసిన ప్రచారం కారణంగా వందలాది మంది భక్తులు.. సోమవారం ఉదయం ఆలయానికి పోటెత్తారు. అయితే.. సరైన ఏర్పాట్లు లేని కారణంగా.. గుంపుగుంపులుగా అక్కడ చేశారు. ఈ లోగా.. ఓ కరెంటు వైరు తెగి కిందపడింది. దానిని చూసిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వాస్తవానికి దానిలో కరెంటు ప్రసారం కావడం లేదని అధికారులు తెలిపారు.
కానీ.. ఈ విషయం తెలియని భక్తులు.. దాని బారి నుంచి రక్షించుకునేందుకు.. పరుగులు పెట్టారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆలయంలోనే ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు.. సొమ్మసిల్లి పడిపోయారు. కాగా.. ఈ ఘటనలో మరింత మంది చనిపోయారని ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. సొమ్మసిల్లిన వారిని ఆసుపత్రులకు తరలించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.