భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!
| బ్రిటన్లో 13 ఏళ్ల పాటు భార్యకు మత్తుమందు ఇచ్చి, ఇతర పురుషులతో అత్యాచారం చేయించిన కేసు వెలుగులోకి వచ్చింది. స్విండన్కు చెందిన ఫిలిప్ యంగ్ తన నేరాన్ని అంగీకరించగా, మరో ఐదుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. భర్త అనుమతి బాధితురాలి అంగీకారంగా పరిగణించలేమని ఈ కేసులో కీలకంగా స్పష్టం చేశారు. దోషులకు డిసెంబర్ 21, 22 తేదీల్లో శిక్షలు ఖరారు కానున్నాయి.
ఇంట్లోనే ఉంటున్న భార్యకు ఏం జరుగుతుందో తెలియదు. ఆమెకు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి పంపిన తర్వాత భర్త ఇతర పురుషులను ఇంటికి రప్పించేవాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13 ఏళ్ల పాటు సాగిన ఈ దారుణం ఇప్పుడు బ్రిటన్ కోర్టులో విచారణతో బయటపడింది.
స్విండన్కు చెందిన ఫిలిప్ యంగ్ (50) తన భార్య జోవాన్పై అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. ఆమెకు తెలియకుండా ఇంటర్నెట్లోని వెబ్సైట్లు, యాప్ల ద్వారా ఇతర పురుషులతో సంప్రదింపులు జరిపి ఇంటికి పిలిచేవాడు. ఈ కేసులో నార్మన్ మాక్సోని, రిచర్డ్ విల్కిన్స్, కానర్ శాండర్సన్-డాయిల్, మహమ్మద్ హసన్లను జ్యూరీ దోషులుగా తేల్చింది. మరో నిందితుడు డీన్ హామిల్టన్ కూడా గత ఫిబ్రవరిలోనే తన నేరాలను అంగీకరించాడు.
తన భర్తే తనకు ఇంతటి ద్రోహం చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదని జోవాన్ కోర్టులో చెప్పారు. ఈ ఘటన తన జీవితాన్నే కాకుండా పిల్లల జీవితాలను కూడా ప్రభావితం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తీర్పులో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బాధితురాలి భర్త నుంచి అనుమతి తీసుకున్నామని చెప్పడం ఇతర పురుషులకు రక్షణగా నిలవలేదు. లైంగిక సంబంధానికి అంగీకరించాల్సింది బాధితురాలే తప్ప, ఆమె భర్త కాదు. ఈ కేసులో అదే కీలకంగా మారింది. ఇంగ్లాండ్లో ఇలాంటి కేసులో జ్యూరీ విచారణ ద్వారా పలువురు పురుషులు దోషులుగా తేలడం ఇదే తొలిసారి.
మత్తుమందు ఇచ్చి జరిగే లైంగిక దాడులను గుర్తించడం, ఫిర్యాదు చేయడం కూడా బాధితులకు కష్టమేనని పోలీసులు చెబుతున్నారు. జరిగిన విషయం గుర్తుండకపోవడం వల్ల చాలామంది తమకు ఎదురైన దారుణాన్ని వెంటనే గుర్తించలేకపోతారని వివరించారు.
దోషులకు డిసెంబర్ 21, 22 తేదీల్లో శిక్షలు ఖరారు కానున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.