భోగాపురంలో ఫస్ట్ డే, ఫస్ట్ ఫ్లైట్.. ఏమోషనల్ మూమెంట్స్!
ఏపీ ఏవియేషన్ రంగంలో సరికొత్త శకం మొదలైంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఏపీ ఏవియేషన్ రంగంలో సరికొత్త శకం మొదలైంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్టు అధికారికంగా పనిచేయడం ప్రారంభించారు. ఇదే సమయంలో నాలుగున్నర దశాబ్దాలుగా పౌర విమాన సేవలు అందిస్తున్న విశాఖపట్నం ఎయిర్ పోర్టు మూతపడింది. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు ఉచితం ప్రయాణ సౌకర్యం కల్పించారు. దాదాపు రెండు వేల మంది వరకు రైతులు భూములు ఇవ్వగా తొలి విడతలో కొందరికి ఉచిత ప్రయాణం కల్పించినట్లు చెబుతున్నారు.
సోమవారం ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి షెడ్యూల్డ్ విమానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులకు ఘనస్వాగతం పలికిన అధికారులు, వారికి చిరకాలం గుర్తుండిపోయేలా 'ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లు' అందజేశారు. తొలిరోజు రాకను పురస్కరించుకుని విమానాశ్రయంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రయాణికులకు స్వాగతం చెబుతూ, ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేయడం విశేషం.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రాజెక్టు కోసం భూములను అప్పగించిన సుమారు 2,500 మంది రైతులకు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సోమవారం నుండి ఉచిత విమాన ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. తమ భూమిలో వెలసిన అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా విమానం ఎక్కడం ఆ రైతుల జీవితాల్లో ఒక చిరస్మరణీయమైన అనుభూతిగా మిగిలిపోయిందని చెబుతున్నారు.
విశాఖకి ఉద్వేగభరిత వీడ్కోలు
మరోవైపు, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ వద్ద వాతావరణం ఉద్వేగభరితంగా మారింది. సుమారు 50 ఏళ్ల పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు, పర్యాటక రంగానికి సేవలందించిన ఈ విమానాశ్రయం, ఇప్పుడు తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. చివరి విమానం బయలుదేరే సమయంలో సిబ్బంది, ప్రయాణికులు ఎమోషనల్ అయ్యారు. ఎయిర్‌పోర్ట్ ఆవరణలో సెల్ఫీలు తీసుకుంటూ, ఆ ప్రాంగణంతో ఉన్న తమ జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించుకున్నారు.
భోగాపురం విమానాశ్రయం నుండి ఇకపై హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు విమాన సర్వీసులు నిరంతరం అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే అధికారులు విమాన సర్వీసుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నగరం నుండి భోగాపురం విమానాశ్రయానికి సులభంగా చేరుకునేలా 20 ప్రత్యేక విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ కొత్త విమానాశ్రయం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పర్యాటక వృద్ధిలో కీలకంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. పాత తరం జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూనే, సరికొత్త ఆశలతో భోగాపురం విమానాశ్రయం తన ప్రయాణాన్ని ప్రారంభించింది.