ఏడాదిలో రెండు నెలలు బస్సుల్లోనే.. బెంగళూరు రోడ్లపైనే కరిగిపోతున్న పసిపిల్లల కలలు

మనోహరమైన వాతావరణం.. ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కొలువులకు నెలవైన బెంగళూరు నగరంలో నాణేనికి మరోవైపు ఉన్న చేదు నిజం అత్యంత దారుణమైన ట్రాఫిక్ రద్దీ. రోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్‌లో నలిగిపోవడం మనం వింటూనే ఉన్నాం.

Update: 2026-10-01 17:23 GMT

మనోహరమైన వాతావరణం.. ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కొలువులకు నెలవైన బెంగళూరు నగరంలో నాణేనికి మరోవైపు ఉన్న చేదు నిజం అత్యంత దారుణమైన ట్రాఫిక్ రద్దీ. రోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్‌లో నలిగిపోవడం మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ రాక్షస ట్రాఫిక్ చిట్టిపొట్టి చిన్నారుల ముద్దుల బాల్యాన్ని కూడా మింగేస్తోంది. ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకోవాల్సిన వయసులో మన పిల్లలు పాఠశాల బస్సుల్లో ఆటోల్లో గంటల తరబడి చిక్కుకుపోయి నరకం అనుభవిస్తున్నారు.

తాజాగా వెలువడిన ఒక నివేదిక ప్రతీ ఒక్క తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది. బెంగళూరులోని కొంతమంది స్కూల్ విద్యార్థులు ప్రయాణం కోసమే ఏటా ఏకంగా 53 రోజులు.. అంటే దాదాపు 374 గంటల విలువైన కాలాన్ని కేవలం రోడ్లపైనే వృథా చేసుకుంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. ఏడాదిలో దాదాపు రెండు నెలల కాలం పసిపిల్లలు ప్రయాణానికే కేటాయించాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విశేషించి స్టేట్ హైవే-35లోని వర్తూర్–గుంజూర్ మార్గంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల చిన్నపాటి దూరాన్ని చేరుకోవడానికి విద్యార్థులు నిత్యం రెండున్నర గంటలకు పైగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయాన్నే అరకొర నిద్రతో లేచి బస్సెక్కిన పిల్లలు, సాయంత్రం అలసిపోయి ఇళ్లకు చేరేసరికి రాత్రి అయిపోతోంది. ఉదయం, సాయంత్రం నిలిచిపోయే వాహనాల మధ్య పొగ, ధూళి, కంటిమీద కునుకు లేని పయనం వారి చిన్నారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఈ దారుణమైన ప్రయాణాల వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం, ఆటలు, విశ్రాంతి పూర్తిగా దూరమైపోతున్నాయి. బడి నుంచి రాగానే బల్లెక్కి చదువుకోవడానికో.. తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవడానికో కనీసం తల్లిదండ్రుల ఒడిలో సేదతీరడానికో కూడా సమయం మిగలడం లేదు. నిత్యం పొగ, హారన్ల గోల మధ్య గంటల తరబడి కూర్చోవడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రోజూ ఆ పసిమొహాల్లో నిరాశ, అలసట చూసి తల్లిదండ్రులు కంటనీరు పెట్టుకుంటున్నారు.

వర్తూర్-గుంజూర్ ప్రాంతాల్లో పెరిగిన అపార్ట్‌మెంట్లు, బడులు, వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రోడ్లను విస్తరించకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ప్రజా రవాణాను మెరుగుపరచడం.. స్కూల్ బస్సులకు ప్రత్యేక లేన్లు కేటాయించడం.. రోడ్ల విస్తరణ వంటి చర్యలు తక్షణమే చేపట్టాలి. నగర అభివృద్ధి పేరిట భవిష్యత్ తరాల బాల్యాన్ని.. వారి అమూల్యమైన సమయాన్ని రోడ్లపై కరిగించివేయడం ఎంతవరకు న్యాయం? ఇప్పటికైనా పాలకులు, అధికారులు కళ్ళు తెరిచి దీర్ఘకాలిక పరిష్కారం చూపకపోతే మన పిల్లల భవిష్యత్తు ట్రాఫిక్ పొగలోనే మాడిపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News