సీఎం అంటే...జగన్ కేనా బాబు చెప్పింది ?
సీఎం అంటే ఎలా ఉండాలో ఎలా చేయాలో చంద్రబాబు బాపట్ల జిల్లా రేపల్లె మీటింగులో భారీ బహిరంగ సభలో జనం ముందు చెప్పారు.
సీఎం అంటే ఎలా ఉండాలో ఎలా చేయాలో చంద్రబాబు బాపట్ల జిల్లా రేపల్లె మీటింగులో భారీ బహిరంగ సభలో జనం ముందు చెప్పారు. సీఎం అంటే ఒక నిర్వచనం కూడా ఇచ్చారు. కామన్ మ్యాన్ అని ఆయన ఫుల్ ఫార్మ్ లో చెప్పారు. సీఎం అంటే ప్రజలతో కలసిపోవాలని ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపించాలని బాబు చెప్పారు. తాను కామన్ మ్యాన్ ని అని బాబు చెప్పకనే చెప్పుకున్నారు. అంతే కాదు సీఎం అంటే ఎక్కడో సెక్రటేరియట్ లో కూర్చోవడం కాదని బాబు సెటైర్లు పేల్చారు.
బటన్ నొక్కడం కాదు :
బటన్ నొక్కడం తన విధానం కాదని చంద్రబాబు చెప్పారు. ఇది కూడా ఆయన సెటైరికల్ గా అన్న మాటనే. బటన్ నొక్కుడు సీఎం అని గతంలో జగన్ ని బాబు సహా టీడీపీ నేతలు విమర్శించేవారు. ఇపుడు అదే మాటను మరోలా చెబుతూ జగన్ ని కార్నర్ చేశారు అని అంటున్నారు. తాను బటన్ నొక్కను అని జనం మధ్యనే వచ్చి పేదలకు పథకాలు నేరుగా అందచేస్తాను అని ఆయన చెప్పారు. వరసగా 28వ నెల ఠంచను గా ఒకటో తేదీనే పేద వాడి ముంగిటకు వెళ్ళి మరీ పెన్షన్ సొమ్ముని అందచేస్తున్నామని అన్నారు. అలా చేయడమే తనకు ఇష్టం అన్నారు.
నెలలో నాలుగు సార్లు :
అంతే కాదు ప్రతీ నెలలో నాలుగు సార్లు పేదల సేవ కోసం తాను జనం మధ్యకు వస్తున్నాను అని బాబు వివరించారు. ఒకటవ తేదీన పెన్షన్లు ఇచ్చేందుకు 9వ తేదీన పట్టాదారు పాసు పుస్తకాలు అందించేందుకు అలాగే ప్రతీ నెలా మూడవ శనివారం పర్యావరణాన్ని కాపాడేందుకు స్వచ్చాంధ్రా కార్యక్రమానికి ప్రతీ 4వ శనివారం సంజీవిని కార్యక్రమానికి హాజరవుతున్నాను అన్నారు. ఇలా నెలలో నాలుగు సార్లు జనంతోనే ఉంటున్నట్లుగా బాబు చెప్పారు. గడచిన రెండేళ్ళుగా ప్రతీ వ్యక్తికి ప్రతీ కుటుంబానికి ఆర్ధిక సాధికార్త తీసుకుని రావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోంది అని ఆయన అన్నారు.
జనంలోనే బాబు :
ఈ విధంగా తాను ఏపీలో నాలుగో సారి అధికారంలోకి వచ్చాక ప్రజలలోనే ఉంటున్నట్లుగా బాబు తెలియచేశారు. అదే సమయంలో జగన్ పేరు ఎత్తలేదు కానీ పరోక్షంగా విమర్శలు చేశారు. సెక్రటేరియట్ లో కూర్చొవడం బటన్ నొక్కడం పాలన కాదని ఎద్దేవా చేశారు. ఈ విధంగా ఆయన జగన్ గురించి అన్నట్లుగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు జగన్ సెక్రటేరియట్ లోనే ఉంటూ బటన్ నొక్కిన విధానాన్ని బాబు ఈ విధంగా విమర్శించారు అని అంటున్నారు. జగన్ జనంలోకి సీఎం గా పెద్దగా రాలేదని ఆయన గుర్తు చేసి మరీ హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు.
గ్రాఫ్ పెరిగింది అంటూ :
జనంలో రెండేళ్లకు పైగా తాను సీఎం గా తిరుగుతూనే ఉన్నాను అని బాబు చెప్పారు. అదే సమయంలో ఏపీలో తాజా సర్వేలు చేస్తూ కూటమి గ్రాఫ్ బాగా పెరిగింది అని ఆయన అంటున్నారు. దీనిని బట్టి చూస్తే బాబు తరచుగా జనంలోకి రావడం వల్ల కూటమికి అది ఎంతో మేలు చేసింది అని కూడా విశ్లేషిస్తున్నారు. జగన్ పథకాలు అమలు చేశామని చెప్పడమే కానీ వాటిని జనం ముందు పెట్టి తమవిగా ప్రచారం చేసుకోలేకపోయారు అని అంటున్నారు. అంతే కాదు సీఎం గా ఎక్కువగా జనంలోకి రాకపోవడం వైసీపీకి మైనస్ అయింది అని అంటున్నారు. ఎక్కడ వైసీపీ తప్పు చేసిందో దానిని తాము చేయకుండా చంద్రబాబు రెండేళ్లకు పైగా పాలన చేస్తూ వస్తున్నారు అని అంటున్నారు. మరి బాబు పరోక్ష విమర్శల మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.