ఓటుకు నోటు ...ఎక్కడ స్టార్ట్ అయింది సార్లూ !
ఓటు అన్నది ఒక గొప్ప విషయం. ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగాయన్నది ఈ తరానికి అసలు తెలియదు. అవును, ఇది నూటికి నూరు పాళ్లు నిజం.
ఓటు అన్నది ఒక గొప్ప విషయం. ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగాయన్నది ఈ తరానికి అసలు తెలియదు. అవును, ఇది నూటికి నూరు పాళ్లు నిజం. నేడు మనకు సులభంగా దొరుకుతున్న ఓటు హక్కు వెనుక ఎన్నో దశల పోరాటాలు త్యాగాలు ఉన్నాయి అన్న సంగతి ఎంత మందికి తెలుసు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాకనే కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాతలు దీనిని ఎంతో విలువైనదిగా భావించారు. అంతకు ముందు కొందరికే ఓటు హక్కు ఉందని తెలిస్తే ఈ తరం గుండెలు బాదుకోవాల్సిందే. మరి అంతటి విలువైన ఓటు పవిత్రమైన ఓటుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ హక్కుని తమ గౌరవంగా ప్రజాస్వామ్యంలో ప్రభువు అన్న ధీమాగా తామే ప్రజా సేవకులకు అసలైన యాజమాన్యం అన్న సంగతికి గుర్తెరగాల్సిన అవసరం అయితే ఉంది.
ఓటు విలువ తెలుసా :
కానీ ఓటు హక్కుని చాలా మంది ఎందుకో సరిగ్గా బాధ్యతగా తీసుకోవడం లేదు. కొంతమంది ఉన్నత భవనాలలో ఉంటూ ఎండలో ఓటు ఎందుకు వేయాలి అని ఆలోచిస్తున్నారు. మరి కొందరు అయితే పోలింగ్ రోజు తమకు అచ్చమైన సెలవుగా భావిస్తున్నారు. ఇక పేదలలో కొంతమంది అయితే ఓటు ఉందంటే దాని వల్ల తమకు ఏదైనా ప్రతిఫలం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది. వ్యవస్థలో లోపాల వల్లనే అన్న సంగతి పెద్దలు గద్దెనెక్కిన ప్రభువులూ గుర్తు చేసుకోవాలని అంటున్నారు. ఓటుకు నోటు అన్నది ఎవరు అలవాటు చేశారు అంటే జవాబు ఇక్కడ చాలా సింపుల్. కొనేవాడు ఉంటేనే అమ్మే వాడు ఉంటాడు అన్నది లాజిక్ పాయింట్. మరి కొనడానికి ఎవరు ముందుకు వచ్చారో కూడా అందరికీ తెలిసిందే.
నీతి పాఠాలు ఎవరి కోసం :
రాజకీయ నాయకులు పెద్దలు అంతా చేసింది అంతా చేసేసి నీతి పాఠాలు చెబుతూంటారు. తాము శుద్ధ పూసలుగా జనాలు అనుకోవాలని తంటాలు పడుతూంటారు. అమాయక జనాలను పేదలను ఓటుకు నోటు ఆశతో ఎర వేసి తమ పబ్బం గడుపుకుంటున్న నాయకులు ఎంతో మంది అన్నది బహిరంగ రహస్యమే. ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు తప్పనిసరిగా ఉంటాడు. అందరూ కాదు కానీ పేదలు ఆకలితో అలమటిస్తున్న వారూ నోటుకు పడిపోకుండా ఎలా ఉండగలరు అన్న ప్రశ్న వేసుకోవాలి. నిజం చెప్పాలీ అంటే ఎన్నికల రోజు తప్ప వారికి గుర్తించి గౌరవించే వారు కూడా ఎవరూ ఉండదు. అలా మానసికంగా వారిలో ఉన్న న్యూనతా భావానికి సామాజికంగా ఉన్న వెనుకబాటుతనానికి అర్ధికంగా చితికిపోయిన తనానికి వెలకట్టి ఓటుకు నోటు ఇచ్చి వేయించుకుంటున్న వ్యవస్థ సాగుతోంది. ఎక్కడో ఒట్టు పెట్టుకుని నోటు తీసుకోని వారు ఉండవచ్చు. అలాగే అందరూ కాదు కానీ కొందరు నాయకులు ఓటుకు నోటు ఇవ్వకపోయి ఉండవచ్చు. కానీ మెజారిటీ ఇదే కదా జరుగుతోంది అని అంటున్నారు.
రెండు వైపులా తప్పు ఉంది :
ఓటుకు నోటు తీసుకోవడం అంటే ఇచ్చేవాడిది తప్పు అయితే పుచ్చుకునే వాడిది కూడా తప్పే. అలా రెండు వైపుల నుంచి తప్పు ఉంది. కానీ ఓటర్లదే మహా పాపం అయినట్లుగా మీరు ఓటుకు నోటు పుచ్చుకోవద్దు అని చెప్పడం పూర్తిగా వారి మీదకు పాపం తోసేయడమే. నిజానికి తలచుకుంటే ఈ రాజకీయ అవినీతిని ఓటుకు నోటు నేరాలను అరికట్టగల సామర్థ్యం పాలకులకు లేదా అన్న చర్చ సాగుతోంది. ఎక్కడైనా ఎవరైనా ఓటు తీసుకుని పట్టుబడితే ఇచ్చే వాడినే కాదు పుచ్చుకున్న వాడినీ కేసు పెట్టి చర్యలు తీసుకుంటే ఈ జాడ్యం తగ్గుతుందే కదా. ఇది ఆలోచించాలి కదా.
మంచి మాట చెప్పారు :
ఇదంతా ఎందుకు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తన నివాసంలో మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఓటుకు నోటు గురించి చెప్పారు. మీరు డబ్బులు తీసుకోవద్దు అని ఉద్బోధ చేశారు. అయితే ఇది మంచి మాటగానే ఉండిపోతోంది తప్ప ఆచరణలో ఏమైనా ఫలితం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. మంచి మాటలు చెప్పిన బాబు లాంటి వారే చట్ట రూపేణా దీనిని కట్టడి చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తే అపుడు మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అంతే కాదు ఓటుకు నోటుకు వద్దు అంటూ అవగాహన కార్యక్రమాలు కూడా నిరవ్హించాలి. అపుడే మార్పు అన్నది వస్తుందని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంటున్నారు.