విశాఖకు రెండు ఎయిర్ పోర్టులు ఉండాలి... బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-08-17 14:54 GMT

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభించడంతో విశాఖలో ఎయిర్ పోర్టు మూతపడటంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 45 ఏళ్లుగా సేవలు అందిస్తున్న విమానాశ్రయాన్ని ఒకేసారి ఆపేయడం సరికాదని, ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయానమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకసారి ఆలోచించాలని ఎమ్మెల్యే విష్ణు సూచించారు.

అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించుకున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడాన్ని స్వాగతిస్తూనే అక్కడికి వెళ్లాంటే కనీసం గంటన్నర సమయం పడుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. రద్దీ సమయాల్లో రెండు గంటలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతులు లేకుండా భోగాపురం నుంచి రాకపోకలు సాగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ బాధ తనకే కాదని, చాలా మంది పెద్దవాళ్లు ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు.

విశాఖ-భీమిలి బీచ్ రోడ్డును మరింత విస్తరించే పని పూర్తయ్యేవరకు అయినా విశాఖలో విమానాశ్రయం నడపాలని ఎమ్మెల్యే విష్ణకుమార్ రాజు డిమాండ్ చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా సేవలు అందించిన విమానాశ్రయాన్ని ఒకేసారి ఆపేస్తామంటే కుదరదని అన్నారు. ఉదయం, సాయంత్రం మూడేసి గంటలు చొప్పున అయినా పౌర విమాన సర్వీసులకు అనుమతి ఉండాలని సూచించారు. విశాఖ నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు విమానాలు నడపాలని సూచించారు. ఒక నగరం పరిధిలో రెండు విమానాశ్రయాలు ఉంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.

కాగా, కూటమిలోని కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నెటిజన్లను ఆకర్షించాయి. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటే, విశాఖ నుంచి భోగాపురం వెళ్లేందుకు సరైన సౌకర్యాలు లేవని అధికార కూటమి ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది. విశాఖలో విమానాశ్రయాన్ని మూసేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలను తొలి నుంచి విష్ణుకుమార్ రాజు వ్యతిరేకిస్తూ వస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే భోగాపురం నుంచి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ విశాఖ నుంచి పౌర సేవలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News