చంద్రబాబు పవన్ 'లోకల్ ' భేటీ...ఎవరికి ఎన్ని సీట్లు ?
ఇప్పటిదాకా చూస్తే ఎన్డీయే సమావేశాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగాయి. అవి మూడు పార్టీల కీలక నేతల మధ్యన జరిగాయి.
ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. దానికి పూర్వ రంగం అంతా రాష్ట్ర ఎన్నికల సంఘం చేసి ఎపుడైనా ఎన్నికలు నిర్వహించేలా సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల మీద ఫోకస్ పెట్టి ఉన్నాయి. టీడీపీ తమ పార్టీ వారితో సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనసేన నాయకులతో క్యాడర్ తో సమీక్షలు నిర్వహించారు. బీజేపీ సైతం ఇదే విషయం మీద సొంత పార్టీలో నాయకులతో సమావేశాలు నిర్వహించి అప్రమత్తం అవుతోంది.
ఎన్డీయే మీటింగులు :
ఇప్పటిదాకా చూస్తే ఎన్డీయే సమావేశాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగాయి. అవి మూడు పార్టీల కీలక నేతల మధ్యన జరిగాయి. మూడు పార్టీలు కలసికట్టుగా పోటీ చేయాలని ఐక్యత ముఖ్యం అన్న దాని మీదనే అక్కడ చర్చించాయి. ఆ మేరకు అంగీకారం కూడా కుదిరింది. ఇక సీట్ల పంచాయతీ అయితే తేలాల్సింది అధినాయకత్వం స్థాయిలోనే కాబట్టి దాని వైపు అందరి చూపు ఉంది. ఈ నేపథ్యంలో అందరూ ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన భేటీ జరుగుతోంది.
బాబు తో పవన్ :
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం అయిన ఉండవల్లికి మంగళవారం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు. అలా మూడు పార్టీల అధినేతలు కూర్చుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెక్కడ నుంచి పోటీ చేయాలి ఎవరి బలాబలాలు ఎంత, క్యాడర్ ఆకాంక్షలు ఇవన్నీ చర్చిస్తారు అని అంటున్నారు. ఈ ఎన్నికల కోసం కూటమిలోని మిత్రులు అంతా ఏ విధంగా ముందుకు సాగాలి అన్నది కూడా ఇదే సమావేశంలో నిర్ణయిస్తారు అని అంటున్నారు.
లెక్క తేలనుంది :
ఏపీలో దాదాపుగా 17 వరకూ మేయర్ పదవులు ఉన్నాయి. అలాగే 80 పైగా మున్సిపల్ చైర్మన్ పదవులు ఉన్నాయి. కోర్టు కేసులు తెమిలితే మరో పాతిక మునిసిపాలిటీ చైర్మన్లు, మేయర్లు కలుపుకుని నంబర్ ఉంటుంది. జెడ్పీలు అయితే 28 దాకా ఉన్నాయి. అలాగే ఆరేడు వందలకు పైగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇక వేలలో ఎంపీటీసీలు సర్పంచు పదవులు ఉన్నాయి. ఈ భేటీలో మేయర్ జెడ్పీల గురించి ప్రధానంగా లెక్క తేలుతుంది అని అంటున్నారు. మేయర్ అంటే నగరాలకు జెడ్పీలు జిల్లా కేంద్రాలలో అతి ముఖ్యం కాబట్టి వాటి మీదనే తొలి దశలో ఫోకస్ పెడతారు అని అంటున్నారు. మూడు పార్టీలు ఏ విధంగా వీటిని సర్దుబాటు చేసుకుని పోటీ చేయాలి అన్నది చర్చకు వస్తుందని చెబుతున్నారు.
గెలుపు గుర్రాలకే :
మూడు పార్టీలు అంతిమంగా గెలవాలని నూరు శాత్రం స్ట్రైక్ రేట్ ని సాధించాలని కూడా నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా డెసిషన్ తీసుకుంటారు అని అంటున్నారు. పార్టీలుగా కంటే కూటమిగా గెలుపు సాధించాలన్న కీలక సందేశాన్ని అందిస్తారు అని కూడా తెలుస్తోంది. అయితే జనసేనలో 30 శాతం సీట్లకు పోటీ చేయాలని ఒక డిమాండ్ ఉంది. బీజేపీ కూడా ఎక్కువ స్థానాలకు కోరాలని చూస్తోంది. మరి ఈ భేటీలో ఏమి తేలుతుందని అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.