నాకు పెళ్లి చేయండి సీఎం సారూ.. ఇదో వింత విజ్ఞప్తి
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఒక గ్రామీణ యువకుడు కలిసిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వు రాక మానదు.
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఒక గ్రామీణ యువకుడు కలిసిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వు రాక మానదు. "సార్.. మీరు ఐదు గ్యారంటీలు ఇచ్చారు కదా.. ఇంకో ఆరో గ్యారంటీ కూడా పెట్టండి.. అదే 'పెళ్లిళ్ల గ్యారంటీ" అంటూ ఆయన వేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. "ఎకరాల కొద్దీ నల్లరేగడి భూములున్నాయి సార్.. కానీ ఒక్క అమ్మాయి కూడా ముఖం చూడటం లేదు" అని ఆ యువకుడు పడిన ఆవేదన వింటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి.
పెళ్లి చేయాలని సీఎంకు ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్
కర్ణాటకలో ఓ గ్రామీణ వ్యక్తి చేసిన ఆసక్తికరమైన విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫైవ్ గ్యారంటీస్’కు మరో కొత్త హామీని జోడించాలని కోరిన ఆ వ్యక్తి.. అందుకు చెప్పిన కారణం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘సార్.. ఎకరాల కొద్దీ భూమి ఉన్నా గ్రామీణ యువకులను అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. దయచేసి దీనిపై ఏదైనా చేయండి’’ అంటూ ఆయన డీకే శివకుమార్‌ను కోరారు.సాధారణంగా ప్రభుత్వాన్ని ప్రజలు రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఉపాధి, రైతు సమస్యలు, సంక్షేమ పథకాల వంటి అంశాలపై ప్రశ్నిస్తుంటారు. అయితే ఈ వ్యక్తి మాత్రం తన వ్యక్తిగతంగా కనిపించే సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ఆసక్తిని రేకెత్తించింది. గ్రామీణ యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని, దీనిపై ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలని ఆయన కోరడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.
ఒకప్పుడు పల్లెటూర్లలో "అబ్బాయికి పది ఎకరాల పొలం ఉంది" అంటే చాలు.. పెళ్లిచూపులకి పందిళ్లు వేసేసేవారు. కానీ కాలం మారింది.. కలలూ మారాయి.. ఇప్పుడు పొలంలో వంద ఎకరాలు ఉన్నా సరే.. "ఏదైనా ఐటీ ఉద్యోగం ఉందా? నెలకు చేతికి 'ఫిక్స్‌డ్' జీతం వస్తుందా? మెట్రో సిటీలో అపార్ట్‌మెంట్ ఉందా?" అని ఆరా తీస్తున్నారు. ఎండనపడి వ్యవసాయం చేసే రైతు కంటే చిన్న ఏసీ గదిలో కూర్చుని కోడింగ్ రాసే కుర్రాడికే డిమాండ్ పెరిగిపోయింది.
పంట దిగుబడి వస్తుందో రాదో, ఆకాశం వైపు చూడాలి. వచ్చిన పంటకు గిట్టుబాటు ధర దక్కుతుందో లేదో మార్కెట్ వైపు చూడాలి. ఈ అనిశ్చితి మధ్య బతకడం కంటే నెల తిరిగేసరికి అకౌంట్‌లో పడే జీతమే బెటర్ అని నేటి విద్యావంతులైన అమ్మాయిలు భావిస్తున్నారు. పైగా గ్రామీణ జీవనం కంటే పట్టణాలలోని హంగులు, ఆర్భాటాలు, కెరీర్ అవకాశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఫలితంగా పల్లెల్లో ఎకరాలకు ఎకరాలు భూములు ఉన్న యువకులు పెళ్లి కాక విలవిలలాడుతున్నారు. "మా దగ్గర బంగారు లాంటి ఆస్తి ఉంది.. స్వచ్ఛమైన గాలి ఉంది.. సొంత ఇల్లు ఉంది" అని వారు ఎంత మొత్తుకున్నా.. "మీ దగ్గర 'ఆఫర్ లెటర్' ఉందా?" అనే ప్రశ్న ముందర వారి భూములు వెలవెలబోతున్నాయి.
డీకే శివకుమార్ ప్రభుత్వం ఈ 'వివాహ గ్యారంటీ' పథకాన్ని మేనిఫెస్టోలో చేరుస్తుందో లేదో తెలియదు కానీ ఈ కుర్రాడి విజ్ఞప్తి మాత్రం సమాజంలో మారిన ఆలోచనా సరళికి అద్దం పడుతోంది. "భూమి ఉంటే భవిష్యత్తు భద్రం" అనే పాత సిద్ధాంతానికి కాలం చెల్లి, "జాబ్ ఉంటేనే జీవితం సైడ్" అనే కొత్త ట్రెండ్ మొదలైందని ఈ వింత ఘటన నిరూపిస్తోంది. ఏది ఏమైనా మన పల్లెటూరి జమీందార్లకు త్వరలోనే శుభవార్త అందాలని ఆశిద్దాం.