జగన్ ఇండియా కూటమిలోకి...బీజేపీ లెక్క వేరు ?

జగన్ జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ స్టాండ్ ని అనుసరిస్తున్నట్లుగా ఉన్నా ఆయన ఎన్డీయే వైపు కొంత మొగ్గుతున్నారు అని పలు కీలక బిల్లుల ఆమోదం సందర్భంగా వైసీపీ తీరు చాటిచెప్పింది అని గుర్తు చేస్తారు.

Update: 2026-10-05 19:30 GMT

ఏపీ రాజకీయాల మీద పూర్తి ఆధిపత్యం ఎవరికి ఉంది అంటే కచ్చితంగా బీజేపీకి అని చెప్పుకోవాలి. ఆ పార్టీలి ఏపీ పెద్దగా ఓటూ చోటూ ఇవ్వలేదు. అయినా కానీ ఏపీ రాజకీయం బీజేపీకి ఈ రోజుకీ అనుకూలమే అని చెప్పాల్సిందే. నూరు శాతం ఎంపీ సీట్లు ఒక విధంగా ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నట్లు లెక్క. వైసీపీ ఏపీ స్థాయిలోనే విమర్శలు చేస్తుంది. అది కూడా టీడీపీ జనసేనల మీదనే. బీజేపీని ఏమీ అనడం లేదని గుర్తు చేస్తున్నారు. ఇక బీజేపీ లోకల్ లీడర్స్ సమయానుసారం విమర్శిస్తారు. ఇక లేటెస్ట్ గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే జగన్ మీద ఘాటుగానే విమర్శలు చేశారు. ఇదే ఇపుడు హాట్ టాపిక్ గానే ఉంది అంటున్నారు.

సంకేతాలున్నాయా :

జగన్ జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ స్టాండ్ ని అనుసరిస్తున్నట్లుగా ఉన్నా ఆయన ఎన్డీయే వైపు కొంత మొగ్గుతున్నారు అని పలు కీలక బిల్లుల ఆమోదం సందర్భంగా వైసీపీ తీరు చాటిచెప్పింది అని గుర్తు చేస్తారు. అంతే కాదు మోడీని కానీ అమిత్ షాని కానీ పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు అని చెబుతారు. ఈ నేపథ్యంలో ఇటీవల మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం తీరు పట్ల జగన్ ట్వీట్ ద్వారా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అదే ఇపుడు వైసీపీ వైఖరి ఏమిటి అని జాతీయ స్థాయిలో చర్చకు ఆస్కారం కల్పిస్తోంది.

అండ ఉండాలనేనా :

అయితే ఇదొక్కటే సరిపోతుందా ఇంకా బలమైన ఆధారాలు ఉదంతాలు ఉన్నాయా అంటే బాహాటంగా అయితే లేవు కానీ వైసీపీ అన్న పార్టీ తన రాజకీయ ఉనికిని చాటుకుంటూ ఏపీలో నిలబడాలి కాబట్టి రెండవ వైపు చూసినా చూడవచ్చు అన్నదే ఒక చర్చ. ఎన్డీయేతో ఎటూ టీడీపీ జనసేన జట్టుగా ఉన్నాయి కాబట్టి వైసీపీకి జాతీయ స్థాయిలో ఒక అండ ఉండాలంటే ఇండియా కూటమితో నడవడం తప్పదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి వైసీపీకి ఆ ఆలోచన ఉందా లేదా అంటే అది ఈ రోజు దాకా బాహాటం కాలేదనే చెబుతున్నారు.

వైసీపీ ఆప్షన్లు :

అయితే వైసీపీ ఆప్షన్లు అన్నీ ఓపెన్ గా ఉంచుకుంటుందని అంటున్న వారూ ఉన్నారు. 2029 ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు అన్నది అయితే బలమైన విశ్లేషణగా ఉంది. ఎందుకంటే బీజేపీ మూడు టెర్ముల నుంచి అధికారంలో ఉండడం, యాంటీ ఇంకెంబెన్సీ పెరగడం, అదే సమయంలో ఇండియా కూటమి పుంజుకోవడం వంటి పరిణామాల వల్ల ఈసారి ఏ పార్టీకే కాదు కూటమికి కూడా మ్యాజికి ఫిగర్ కి సరిపడా సీట్లు దక్కవని అంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు రెండూ అయినా బీజేపీ కాంగ్రెస్ అలెర్ట్ గానే ఉంటాయని అంటున్నారు. తమ మిత్రులను ఇంకా పెంచుకోవడం, వీలైనంతవరకూ వైసీపీ వంటి న్యూట్రల్ పార్టీలను దగ్గరకు చేర్చుకోవాలని చూస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో అన్నీ లోతుగా ఆలోచిస్తున్న వైసీపీ అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.

బీజేపీ స్ట్రాటజీ :

ఇదిలా ఉంటే బీజేపీ వ్యూహాలు దేశవ్యాప్తంగా ఒకలా ఏపీలో మరొకలా ఉంటూ వస్తున్నాయి. ఏపీ బీజేపీకి యూపీ కంటే ఎక్కువగా రాజకీయ భరోసా ఇచ్చే స్టేట్ గా చెబుతారు. యూపీలో అయినా సగానికి సగం విపక్షం తీసుకుంటుంది. ఏపీలో అలా కాదు సెంట్ పర్సెంట్ గా తమకే మద్దతు అన్న ధీమా కమల దళానికి ఉంది. ఇక సౌత్ లో కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలలో ఉంది. ఒక్క ఏపీలోనే ఖాతా తెరవలేదు. వైసీపీతో పొత్తు ఉంటే కనుక కచ్చితంగా ఎదుగుతుంది. అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ ని సీట్ల బలాన్ని పెంచుతుంది. ఆ ప్రమాదం నేరుగా వచ్చి తాకేది బీజేపీకే. అందుకే ఏపీలో వైసీపీ కదలికలను బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే గమనిస్తూ ఉంటుందని అంటున్నారు. 2029 లో రాజకీయ తులాబారంలో ఎవరెటు అన్నదే అధికారం తెచ్చి పెడుతుంది. దాంతో ఏపీ మీద బీజేపీ ఫోకస్ మరింతగా పెరిగే సీన్ అయితే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News