వైసీపీకి సుప్రీంకోర్టులో షాక్.. స్థానిక ఎన్నికలపై కీలక ఆదేశం!
అయితే.. ప్రస్తు తం `సర్` గడువు ఇంకా పూర్తికాలేదని.. ఈ ప్రక్రియ అక్టోబరు చివరి వారం వరకు పొడిగించారని వైసీపీ చెబుతోంది.
ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ.. వైసీపీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు లో తాజాగా విచారణ జరిగింది. వైసీపీ చెబుతున్న వాదనలో పసలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు దీనిని సాకుగా చూపుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించడం గమనార్హం. వైసీపీ చెబుతున్న వాదన కూడా సరిగా లేదని, దీనికి ఎలాంటి హేతు బద్ధత కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. అయితే.. శుక్రవారం నాడు దీనిపై సమగ్ర విచారణ చేస్తామని పేర్కొంది.
విషయం.. ఏంటి?
రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే.. ప్రస్తు తం `సర్` గడువు ఇంకా పూర్తికాలేదని.. ఈ ప్రక్రియ అక్టోబరు చివరి వారం వరకు పొడిగించారని వైసీపీ చెబుతోంది. దీంతో ఎన్నికలను కూడా వాయిదా వేయాలని కోరుతోంది. అలా వాయిదా వేయకపోతే.. లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతారని.. కాబట్టి సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎన్నికలను నిర్వహిస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైసీపీ వాదిస్తోంది.
దీనికి ముందు హైకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ వైసీపీ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. సర్ ప్రక్రియ సహా కొత్త ఓటర్ల నమోదు.. పాత ఓటర్ల తీసివేతలు(మరణించిన వారి) కామన్‌గా జరుగుతూనే ఉంటాయని.. అలాగని ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ కూడా ఇదే వాదన వినిపించగా.. సుప్రీంకోర్టు దీనికి విరుద్ధమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను ఆపే మిష కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
కాగా.. సుప్రీంకోర్టులో వైసీపీ మరో వాదనను కూడా వినిపించింది. రాష్ట్రంలో వార్డుల విభజన జరుగుతోందని.. ఇది కూడా పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది. అయితే.. వార్డుల విభజనకు.. ఎన్నికలకు సంబంధం లేదని.. వార్డులు విభజించినంత మాత్రాన ఓటర్లు ప్రభావితం కారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమగ్ర విచారణ నేపథ్యంలో పిటిషన్‌ను శుక్రవారానికి వాయిదా వేసింది.