మా సంకల్పం గట్టిది.. కూటమికి తిరుగులేదు: చంద్రబాబు
జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా 30,156 కోట్లతో పనుల్ని ప్రారంభించామని సీఎం చెప్పారు.
``మా సంకల్పం గట్టిది. కూటమికి తిరుగులేదు. మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారు.`` అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడప జిల్లా పొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. గట్టి సంకల్పం కేంద్ర సహకారంతో గడచిన 28 నెలల్లో రాష్ట్ర పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేయగలిగామన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల అభివృద్ది కోసం గడచిన 7 రోజుల్లోనే 9 కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
పల్లె పండుగ ద్వారా 11,085 కోట్లతో గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, వీధిలైట్ల లాంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, విశాఖ, మంగళగిరిలో రూ.52 వేల కోట్ల విలువైన నివాసస్థలాలకు పట్టాలిచ్చామన్నారు. రాయలసీమ దశా దిశ మార్చేలా లక్ష కోట్లతో గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికీ ఇల్లు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇందులో భాగంగా 19 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.
జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా 30,156 కోట్లతో పనుల్ని ప్రారంభించామని సీఎం చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వ ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛతను పెంపొందించేలా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇచ్చి ప్రోత్సహించామన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ, ఆవిష్కరణల్ని అందిపుచ్చుకుని మెరుగైన పాలన అందించేలా ఐఐటీ నిపుణుల మేధస్సును వినియోగించుకుంటామని తెలిపారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించాలనే సంకల్పంతో 'జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార' పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం.. ఆయన మాట్లాడుతూ.. గతంలో తాగునీటి ఎద్దడి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు ఈ పథకం ఒక శాశ్వత పరిష్కారం కానుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో దాదాపు 30 వేల కోట్ల రూపాయల భారీ అంచనాతో ఈ మెగా ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 లక్షల 36 వేల కొత్త కుళాయి కనెక్షన్లను దీని ద్వారా అందించబోతున్నామని వివరించారు.