యూటర్న్ తీసుకున్న చంద్రబాబు, పవన్.. పులివెందుల పర్యటనలో మార్పు

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన కడప జిల్లా పర్యటన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది.

Update: 2026-10-05 09:53 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన కడప జిల్లా పర్యటన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో కాకుండా చంద్రబాబు, పవన్ కార్యక్రమం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సాగడంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. పులివెందుల పర్యటనకు వస్తారనగా, అందుకు రెండు రోజుల ముందు సీఎం, డీసీఎం టూర్ షెడ్యూల్ మారిపోవడంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.




జలజీవన్ మిషన్ అమరజీవి జలధార 2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కడప జిల్లాలో పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.30,156 కోట్ల వ్యయంతో జలధార పనులు చేపడుతున్నారు. ఇందుకు ప్రొద్దుటూరులో పైలాన్ ఆవిష్కరించారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు సరఫరా చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ముందుగా జలధార 2.0 కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించాలని భావించారు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ను ఆహ్వానించి, వేదికపై నుంచి ఆయనను ఇరుకన పెట్టే కార్యక్రమానికి డిజైన్ చేశారని చెబుతున్నారు.




ఇక ముఖ్య నేతలు ఇద్దరూ పులివెందుల పర్యటనకు సిద్ధమవడం రాజకీయంగా వేడెక్కించింది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్ సొంత ఇలాకాలో చంద్రబాబు, పవన్ వెళుతున్నారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పటికే పలు అంశాల్లో జగన్ ను టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వ అధినేతలు పులివెందులలో ఏ రాజకీయ బాంబు పేల్చుతారో అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, ఏమైందో ఏమో అనూహ్యంగా పులివెందుల కార్యక్రమాన్ని ప్రొద్దుటూరుకు మార్చేశారు. దీంతో కూటమి కార్యకర్తలు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. మరోవైపు పులివెందుల కార్యక్రమం అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై అనేక విధాలుగా చర్చ జరుగుతోంది.




అయితే పులివెందులలో జలజీవన్ మిషన్ కార్యక్రమం ఉంటుందని అధికారికంగా ప్రకటన చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాలో కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని, ఇందుకోసం పలు నియోజకవర్గాలను పరిశీలించామని మాత్రమే చెబుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి స్వయంగా ఆహ్వానించడంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారని అంటున్నారు. అయితే పులివెందుల పర్యటన వాయిదా వేయడానికి ఇంకో కారణం ఉందని స్థానికంగా ఒక ఆసక్తికర అంశం ప్రచారం జరుగుతోంది.




వాస్తవానికి గత నెల 30న పులివెందులలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించారని, ఇందుకోసం పులివెందులలో తాగునీటి గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా చేపట్టారని అంటున్నారు. అయితే కార్యక్రమం నిర్వహించాల్సిన సమయంలో ప్రధానమైన చిత్రావతి రిజర్వాయర్ లో నీరు లేకపోవడంతో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారని అంటున్నారు. నీళ్లు లేకుండా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుందనే ఆలోచనతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గండికోట జలాశయం వద్దకు కార్యక్రమానికి మార్చారని అంటున్నారు. ఇక సీరియర్ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కూడా కార్యక్రమం నిర్వహించేందుకు ఉత్సాహం చూపడంతో సీఎం, డిప్యూటీ సీఎం ప్రొద్దుటూరు పర్యటనకు మొగ్గుచూపారని చెబుతున్నారు.








Tags:    

Similar News