4 గంటల పనే చాలు.. రచయిత చేతన్ భగత్ సూచన దీపికకు మద్ధతు కాదు!
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కార్యాలయాల్లో మారుతున్న పరిస్థితులు - ఉద్యోగ భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కార్యాలయాల్లో మారుతున్న పరిస్థితులు - ఉద్యోగ భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టెక్నాలజీ కారణంగా పని గంటలు పెరగడం, తీవ్రమైన ఒత్తిడి వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఒక భిన్నమైన - ఆసక్తికరమైన కోణాన్ని వినిపించారు. బెంగళూరులో అక్టోబర్ 3న జరిగిన 18వ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్ (PMSAC) లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రోజువారీ కార్యాలయాల్లో గంటల తరబడి బల్లల మీద కూర్చుని పనిచేయడం కంటే.. చేసే పని నాణ్యత చాలా ముఖ్యమని భగత్ స్పష్టం చేశారు. తాను స్వయంగా రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పని చేస్తానని.. పూర్తి అంకితభావంతో పనిచేస్తే ఆ సమయం సరిగ్గా సరిపోతుందని ఆయన తెలిపారు. అయితే తాను చెప్పే నాలుగు గంటల పని సమయంలో ఆఫీస్ మీటింగ్‌లు, విరామాలు ఇతర బ్రేక్ లు ఏవీ ఉండవని స్పష్టం చేశారు.
ఉద్యోగులు తాము కేటాయించుకున్న ఆ నాలుగు గంటల సమయంలో అత్యంత ఏకాగ్రతతో పనిచేయాలని, ప్రాధాన్యతా క్రమంలో పనులను పూర్తి చేయాలని భగత్ సూచించారు. ఏఐ రాకతో ఉద్యోగులపై ఉత్పాదకతను పెంచుకోవాలనే ఒత్తిడి పెరుగుతున్న వేళ ఆయన ఈ రిలేడెడ్ అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోవైపు దేశ యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి గతంలో వాదించిన సంగతి తెలిసిందే.
అయితే నారాయణ మూర్తి వాదనకు భిన్నంగా ఎక్కువ గంటలు పనిచేయడం కంటే వ్యక్తిగత సంతోషం- ఏకాగ్రత -వ్యక్తిగత శ్రేయస్సు ముఖ్యం అని భగత్ అభిప్రాయపడ్డారు. వర్క్ -లైఫ్ బ్యాలెన్స్ గురించి ప్రస్తావిస్తూ తన పుస్తకం `11 రూల్స్ ఫర్ లైఫ్` లోని సూత్రాల ఆధారంగా ప్రజలు తమకు సంతోషం కలిగించే పనులపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే చేతన్ భగత్ చెప్పుకొచ్చిన 4 గంటల పని సమయం సెట్లో పని చేసే ఆర్టిస్టులకు సూటబుల్ కాకపోవచ్చు. సినిమా షూటింగుల విధానం పూర్తిగా వేరే ఇతర నియమాలపై ఆధారపడి ఉంటుంది.
భారతీయ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన యువ రచయితలలో ఒకరైన చేతన్ భగత్ ఎన్నో విజయవంతమైన నవలలను రచించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన రాసిన `ఫైవ్ పాయింట్ సంథింగ్`,`వన్ నైట్ ఎట్ ది కాల్ సెంటర్`, `ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్`,` 2 స్టేట్స్` .. `హాఫ్ గర్ల్‌ఫ్రెండ్` వంటి నవలలు పాఠకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా యువత ఆలోచనా విధానాన్ని.. మోడ్రన్ డే సంబంధాలను.. విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రతిబింబించేలా ఆయన సామాన్యమైన ఇంగ్లీషులో రాసిన ఈ రచనలే జాతీయ స్థాయిలో అపారమైన కీర్తిని.. మంచి పేరును తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా చేతన్ భగత్ రాసిన అనేక నవలలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన హిందీ చిత్రాలుగా రూపాంతరం చెందాయి.