డీప్ ఫేక్-మార్ఫ్ వీడియోలు తొల‌గించండి.. కోర్టులో స‌మంత విజ‌యం

బాంబే హైకోర్టులో అగ్ర క‌థానాయిక‌ సమంత రూత్ ప్రభుకి చారిత్రాత్మక విజయం లభించింది. తన అనుమతి లేకుండా AI వేదిక‌లు, డిజిటల్ మీడియా సంస్థలు తన పేరు- ఇమేజ్- వాయిస్‌ని ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ ఇటీవ‌ల సామ్ కోర్టును ఆశ్రయించారు

Update: 2026-10-05 03:49 GMT

బాంబే హైకోర్టులో అగ్ర క‌థానాయిక‌ సమంత రూత్ ప్రభుకి చారిత్రాత్మక విజయం లభించింది. తన అనుమతి లేకుండా AI వేదిక‌లు, డిజిటల్ మీడియా సంస్థలు తన పేరు- ఇమేజ్- వాయిస్‌ని ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ ఇటీవ‌ల సామ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు త‌న‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప‌ర్స‌నాలిటీ రైట్స్ విష‌యంలో స‌మంత బ‌ల‌మైన వాద‌న వినిపించ‌డంతో కోర్టులో సానుకూల తీర్పు వెలువ‌డింది.

టెక్ కంపెనీలు, ఏఐ డెవలపర్లు, ఈ-కామర్స్ పోర్టల్స్ సహా మొత్తం 18 మంది ప్రతివాదులపై సమంత ఈ పిటిషన్ దాఖలు చేశారు. త‌న‌ గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ఆన్‌లైన్‌లో సృష్టిస్తున్న డీప్‌ఫేక్ - మార్ఫ్ చేసిన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ మాధవ్ జమ్దార్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), ఆర్టికల్ 21 కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, గోప్యతా హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కింద సమంత వ్యక్తిగత- పబ్లిసిటీ హక్కులు పూర్తిగా రక్ష‌ణ ప‌రిధిలోకి వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. అలాగే కాపీరైట్ చట్టం ప్రకారం పెర్ఫార్మర్ నైతిక హక్కులు కూడా ఉల్లంఘనకు గురయ్యాయని జ‌డ్జి అభిప్రాయపడ్డారు.

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కూడా రక్షణ కోరుతూ `జాన్ డో` ఆర్డర్‌ను సమంత అభ్యర్థించారు. ముంబైలో తన వ్యాపారం, గుడ్‌విల్ ఉండటం వల్ల బాంబే హైకోర్టు పరిధి కింద ఈ పిటిషన్‌ను విచారించడానికి కోర్టు అనుమతి తెలిపింది. అనధికారిక కంటెంట్‌ను తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా నిషేధం విధించింది.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న అనర్థాలకు, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కీలక కేసు తదుపరి విచారణను డిసెంబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

టాప్ స్టార్ల‌కు కోర్టులో ఊర‌ట‌..

భారతదేశంలో ప్రముఖ సెలబ్రిటీల వ్యక్తిగత గుర్తింపు, పేరు, ఫోటోలు, వాయిస్ వంటి అంశాలను అనధికారికంగా వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా AI డీప్‌ఫేక్స్ ద్వారా దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ప్రముఖ హీరోలు- నటీమణులు న్యాయస్థానాలను ఆశ్రయించి చారిత్రాత్మక విజయాలు సాధించారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ఎన్టీఆర్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, సునీల్ శెట్టి , కరణ్ జోహార్ వంటి టాప్ టాలీవుడ్, బాలీవుడ్ నటులు తమ పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిగత హక్కులు) కాపాడుకోవడానికి ఢిల్లీ - బాంబే హైకోర్టుల ద్వారా అనుకూలమైన మధ్యంతర ఉత్తర్వులు, నిషేధాజ్ఞలను పొందడంలో సఫలమయ్యారు.

Tags:    

Similar News