ఒమన్.. మొరాకో.. దుబాయ్.. కో పైలట్ దాడిలో ఎవరి తప్పెంత?
ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చే ప్రయత్నం చేసిన కోపైలట్ ఉదంతానికి సంబంధించి విస్మయానికి గురి చేసే అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చే ప్రయత్నం చేసిన కోపైలట్ ఉదంతానికి సంబంధించి విస్మయానికి గురి చేసే అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అదే సమయంలో.. ఈ మొత్తం ఉదంతంలో ఏ దేశానికి ఎక్కువ తప్పు అన్న ప్రశ్నపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఒమన్ దేశస్తుడైన కోపైలట్ హమామ్ అల్-హమామీను సొంత దేశం అతడ్ని విమానాలు నడపకుండా గ్రౌండ్ చేసినప్పుడు.. దుబాయ్ లాంటి దేశం అతడికి తమ విమానయాన సంస్థలో కో పైలట్ ఉద్యోగాన్ని ఎలా ఇచ్చింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ విమానయాన రంగంలో ఈ అంశంపై ఇప్పుడు భారీ చర్చ జరుగుతోంది. కో పైలట్ నియామక అంశాన్ని చూస్తే.. దారుణమైన కమ్యునికేషన్ లోపాలు మాత్రమే కాదు.. భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.
ఒమన్ జాతీయ విమానయాన సంస్థ తమ దేశస్తుడైన హమామ్ అల్-హమామీలోని తీవ్రవాద భావజాలం ఉందన్న విషయాన్ని గుర్తించి.. విమానాలను నడిపే బాధ్యత నుంచి తొలగించి.. అతడిని డెస్క్ జాబ్ కు పరిమతం చేశారు. అంతేకాదు.. అతడికి డీ రాడికలైజేషన్ ప్రోగ్రాం కూడా ఇచ్చారు. అయితే.. ఒమన్ అధికారులు ఇతడి కారణంగా ఉండే భద్రతా ముప్పు సమాచారాన్ని అంతర్జాతీయ విమానయాన డేటాబేస్ లలో కానీ.. పొరుగు దేశాలతో కానీ షేర్ చేసుకోకపోవటం ప్రాధమికంగా జరిగిన అతి పెద్ద తప్పుగా చెప్పాలి.
ఫ్లైదుబాయ్ సంస్థ తమ విమానయాన సంస్థలో అతడికి కో పైలట్ జాబ్ ఇచ్చే క్రమంలో రికార్డులను సరిగా చెక్ చేయలేదా? అతడి నేపథ్యం మీద కన్నేయలేదా? అతడిలోని అతివాద లక్షణాల్ని గుర్తించటంలో ఎందుకు ఫెయిల్ అయ్యిందన్న విషయంలోకి వెళితే.. బయటకు వచ్చేది మొరాకో దేశ నిర్వాకం. ఎందుకంటే ఒమన్ లో అతడ్ని పైలట్ నుంచి గ్రౌండ్ చేసి డెస్క్ కు పరిమితం చేసిన తర్వాత అతను మళ్లీ పైలట్ బాధ్యతల్లో చేరింది మొరాకో రాయల్ ఎయిర్ లైన్స్ లో. కీలక బాధ్యతలు అప్పగించే ముందు.. అతను అంతకు ముందు నిర్వహించే బాధ్యతల వివరాల్ని సేకరించటం లాంటివి చేయాలి. ఈ విషయంలో మొరాకో అడ్డంగా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి.
అక్కడి నుంచి ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్ లో కో పైలట్ జాబ్ ను పొందే వేళలో.. దుబాయ్ అతడి గురించి లోతుగా ఆరా తీయలేదా? అంటే..అతను తమకంటే ముందు పని చేసిన మొరాకో లోని వివరాల్ని మాత్రమే పరిశీలించింది. అంతకు ముందు ఒమన్ లో అతడి జాబ్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. అదే తాజా కుట్రకు అవకాశాన్ని ఇచ్చినట్లైంది. ఇతగాడి నియామకం ఎలా జరిగిందన్న దానిపై దుబాయ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఫ్లైదుబాయ్ సంస్థలో సదరు కో పైలట్ ను ఇంటర్వ్యూ చేసి.. రిక్రూట్ చేసిన హెచ్ఆర్.. భద్రతా విభాగానికి చెందిన సిబ్బందిని యూఏఈ నిఘా సంస్థలు ప్రస్తుతం తీవ్రంగా విచారిస్తున్నాయి. ఈ ఉదంతంలో ఒమన్ చేసిన తప్పును మొరాకో కంటిన్యూ చేయగా.. దుబాయ్ అందులో చిక్కుకుందని చెప్పాలి.
ఈ నేపథ్యంలో తమ విచారణ వివరాల్ని ఫ్లైదుబాయ్ సంస్థ అధికారులు వెల్లడించలేమని చెబుతున్నారు. తమ నియామక ప్రక్రియలపై అనేక ప్రశ్నలు తలెత్తిన మాట నిజమే అన్న విషయాన్ని అంగీకరించటం గమనార్హం. ఇంతకూ కో పైలట్ హమామ్ అల్-హమామీకు ఆస్ట్రేలియా లింకులు ఏమిటి? అన్నది మరో ప్రశ్నగామారింది. ఆ అంశంలోకి వెళితే.. అతను ఆ దేశంలోని మెల్ బోర్న్ నగరంలో దాదాపు రెండేళ్లు విద్యార్థిగా ఉన్నాడు. ఆ దేశంలోని ప్రముఖ వర్సిటీల్లో ఒకటైన ఆర్ ఎంటీలో అతను ఇంజనీరింగ్ చదివాడు.అతడికి 2014లో ఆస్ట్రేలియా విద్యార్థి వీసా మంజూరైంది. ఆ తర్వాత 2017 వరకు ఆస్ట్రేలియాలో ఉండి చదువుకున్నాడు. కోర్సును మధ్యలోనే వదిలేసి దేశం విడిచి వెళ్లిపోయాడు. కోర్సు పూర్తి చేయనికారణంగా అతడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం 2019లో అతడి వీసాను రద్దు చేసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్.. ఆ దేశ నిఘా సంస్థ ఎఎస్ఐవోకి చెందిన ప్రత్యేక కౌంటర్ టెర్రరిజం టీంలు ఈ కేసును విచారిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలోనే కో పైలట్ హమామ్ అల్-హమామీ ఏమైనా తీవ్రవాద భావజాలానికి లోనయ్యాడా? తమ దేశంలోనే ఉగ్రవాద లింకులు మొదలయ్యాయా? లాంటి ప్రశ్నలను చేధించే పనిలో ఆ దేశ నిఘా సంస్థ దర్యాప్తు చేస్తోంది. మొత్తంగా కో పైలట్ హమామ్ అల్-హమామీ దారుణ చర్యకు అసలు కారణమేమిటన్న దానిపై దాదాపు ఆరు దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టాయని చెప్పాలి.