జులైలోనే విమానం కూల్చాలని ప్లాన్.. ఫ్లైదుబాయ్ ఘటనలో నిందితుడి సంచలన విషయాలు

30,000 అడుగుల ఎత్తున ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణాన్ని ఒక్కసారిగా మరణ మృదంగంగా మార్చేందుకు కాక్‌పిట్‌లోనే మాటువేసిన ఒక ముందస్తు కుట్ర బయటపడింది.

Update: 2026-10-05 05:57 GMT

30,000 అడుగుల ఎత్తున ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణాన్ని ఒక్కసారిగా మరణ మృదంగంగా మార్చేందుకు కాక్‌పిట్‌లోనే మాటువేసిన ఒక ముందస్తు కుట్ర బయటపడింది. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను తెగించి కాపాడుకున్న కెప్టెన్ ధైర్యంతో టెల్ అవీవ్‌ను వణికించాలనుకున్న కో-పైలట్ దారుణ ప్రణాళిక తుస్సుమంది. ఈ పైలెట్ విచారణలో తాజాగా సంచలన నిజాలు వెలుగుచూశాయి.

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయంకరమైన కాక్‌పిట్ దాడి ఘటనపై దర్యాప్తు అధికారులు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. సెప్టెంబర్ 30న కాక్‌పిట్‌లో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై క్రాష్ యాక్స్‌తో దాడి చేసిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీకి ఇది ఆకస్మిక ఆలోచన కాదని.. నెలల తరబడి వేసిన ముందస్తు ప్రణాళిక అని ఇజ్రాయెల్ మీడియా వర్గాలు తెలిపాయి.

అసలేం జరిగింది?

విమానం ఆకాశంలో ఉన్న సమయంలో హమ్మామీ ఒక్కసారిగా కెప్టెన్‌పై గొడ్డలితో విరుచుకుపడ్డాడు. ఈ దాడి వల్ల విమానం క్షణాల్లో అదుపు తప్పి కేవలం 30 సెకన్లలో దాదాపు 14,000 అడుగులు కిందికి పడిపోయింది. అయితే తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యంతో కాక్‌పిట్ తలుపులు తెరవగలిగారు. వెంటనే ప్రయాణికులు, విమాన సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి నిందితుడిని బంధించారు. అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరొక పైలట్ అదుపు సాధించి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

బెన్ గురియన్ ఎయిర్‌పోర్టే టార్గెట్?

దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణలో నిందితుడి ప్రణాళికలు అత్యంత తీవ్రమైనవిగా తెలిసాయి. కెప్టెన్‌ను హతమార్చి విమానంపై పూర్తి నియంత్రణ సాధించాక ఇజ్రాయెల్‌లోని 'బెన్ గురియన్' అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ క్లియరెన్స్ తీసుకోవాలని భావించాడు. అనంతరం విమానాన్ని విమానాశ్రయ భవనంపైకి కానీ, అక్కడ నిలిపి ఉంచిన మరొక విమానంపైకి కానీ ఢీకొట్టించి భారీ ప్రాణనష్టం కలిగించాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

జులైలోనే అమలు చేయాలని ప్లాన్

అంతేకాకుండా ఇదే తరహా దాడిని జులైలోనే అమలు చేయాలని నిందితుడు ప్రయత్నించాడని.. అయితే ఆ సమయంలో విమానంలో తనకు సన్నిహితుడైన సిబ్బంది ఉండటంతో ఆఖరి నిమిషంలో విరమించుకున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. జోర్డాన్ గగనతలంలోకి చేరిన తర్వాత దాడి చేయడం ద్వారా తన ప్లాన్ అమలుకు తగినంత సమయం లభిస్తుందని భావించినట్లు తెలుస్తోంది.

తీవ్రవాద కోణం.. భద్రతా సమీక్ష

హమ్మామీ గతంలో ఒమన్ ఎయిర్‌లైన్స్‌‌లో పనిచేస్తున్న సమయంలో అతడి తీవ్రవాద భావజాలం, భద్రతా కారణాల దృష్ట్యా విమానాలు నడపకుండా నిషేధానికి గురైనట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అలాగే మెల్‌బోర్న్‌‌లోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయంలో చదివిన అతడికి ఆస్ట్రేలియా ఇతర ప్రాంతాలతో ఉన్న సంబంధాలపై కౌంటర్ టెర్రరిజం అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం దీనిని ఒంటరి దాడి గా అనుమానిస్తున్నప్పటికీ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది.

ఈ ఘటనతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విదేశీ పౌర విమానయానానికి సంబంధించిన భద్రతా నియమాలపై సమగ్ర సమీక్షకు ఆదేశించారు. భద్రతా పరమైన హెచ్చరికలు ఉన్న వ్యక్తులు కాక్‌పిట్ వరకు ఎలా రాగలిగారనే దానిపై ప్రపంచ విమానయాన రంగంలో కొత్త చర్చ మొదలైంది.

Tags:    

Similar News