ఓట్ల తొలగింపుపై సుప్రీం జడ్జి తాజా వ్యాఖ్యలు విన్నారా?

ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారటమే కాదు.. రానున్నరోజుల్లో మరింత చర్చకు కారణం కావటం ఖాయంగా కనిపిస్తోంది.

Update: 2026-10-05 07:23 GMT

ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారటమే కాదు.. రానున్నరోజుల్లో మరింత చర్చకు కారణం కావటం ఖాయంగా కనిపిస్తోంది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన 19వ నల్సార్ - జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి మెమోరియల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ లో కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా దేశంలో ఓటల తొలగింపు వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

జస్టిస్ భూయాన్ వ్యాఖ్యలను చదవటానికి ముందు ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాల్సిందే. అదేమంటే.. తీవ్ర విమర్శలకు గురైన ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు సమర్థించింది. ఓటుహకంకు కల్పించటానికి అవసరమైన పత్రాలు సమర్పించలేని పౌరుల ఓట్లను తొలగించే అధికారం ఈసీకి ఉందని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల ఆధారంగానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడిని పెంచింది. సీఈసీగా ఉండే హక్కును జ్ఞానేశ్ కుమార్ కోల్పోయారని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యల ద్వారా తేలినట్లుగా కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కట్ చేస్తే.. తాజాగా నల్సార్ లో అదే న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ ఆయన ఏమన్నారు? ఏమేం వ్యాఖ్యలు చేశారన్నది ఆయన మాటల్లోనే చదివితే..

- ఓటరు జాబితా నుంచి మూకుమ్మడిగా పౌరుల ఓట్లను తొలగించి.. ఓటుహక్కును నిరాకరించటం రాజ్యాంగ విరుద్ధం. ఇలా చేయటానికి ఎవరికీ అధికారం లేదు. దీనిని ఏ కోర్టు సమర్థించదు. దేశంలోని పౌరులను ఓట్లు ఉన్నవారు.. ఓట్లు లేనివారు అంటూ రెండు వర్గాలుగా రాజ్యాంగం విభజించలేదు. లక్షల కొద్దీ ఓట్లను తొలగించి.. సొంత దేశంలోనే పౌరులను రెండో జాతివారిగా మార్చే ఏ ప్రక్రియ అయినా చట్ట విరుద్ధమైనదే. ఆ ప్రక్రియ రాజ్యాంగ హ్రదయంపై దాడే అవుతుంది.

- మూకుమ్మడిగా ఓట్లను తొలగించటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 326ను ఉల్లంఘించటమే అవుతుంది. భారత పౌరసత్వ విధానం ప్రకారం ఎన్నికల్లో ఓటు వేసే హక్కును.. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే హక్కును పౌరుడినుంచి ఎవరూ వేరు చేయటానికి వీల్లేదు.

- ఓటుహక్కును పౌరుడి నుంచి వేరు చేయటం.. శరీరం నుంచి ఆత్మను వేరు చేయటమే అవుతుంది. మన పూర్వీకులు సుదీర్ఘకాలం సాగించిన స్వాతంత్య్ర పోరాట ఫలితమే ఓటుహక్కు. ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఈ ఓటుహక్కు రాలేదు. ఆర్టికల్ 326ను మార్చటం వీలుకాదు. ఏ అధికారిక వర్గానికి కానీ.. వ్యక్తికి కానీ ఆ అధికారం లేదు. ఇందుకు ఎవరూ అతీతులు కారు.

- మరణించిన వారు తప్పించి.. బతికి ఉన్న అర్హులైన పౌరుల ఓట్లు తొలగించటం కుదరదు. ఒకసారి ఓటరు లిస్టులో ఓటు నమోదైన తర్వాత ఆ ఓటరుకు నోటీసులు ఇవ్వకుండా.. విచారణ జరపకుండా ఓటు తొలగించలేరు. ఒక ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత అధికారం ఉండేది ఆ దేశాధ్యక్షుడి కార్యాలయానికి కాదు.. ఆ దేశంలోని పౌరుడికి అన్న అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫెలెక్స్ ఫ్రాంక్ ఫర్డ్ మాటను మర్చిపోకూడదు.

Tags:    

Similar News