బెట్టింగ్ దుమారం: 'బొమ్మాళీ' ఆస్తులు అటాచ్!
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అనేక మందిని అప్పుల ఊబిలో దింపడంతోపాటు.. కొందరి ఆత్మ హత్యలకు కూడా పరోక్షంగా కారణమయ్యారని సినీ ప్రముఖులు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.;
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అనేక మందిని అప్పుల ఊబిలో దింపడంతోపాటు.. కొందరి ఆత్మ హత్యలకు కూడా పరోక్షంగా కారణమయ్యారని సినీ ప్రముఖులు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీరిలో కొందరు తెలుగు వారు కూడా ఉన్నారు. రానా సహా పలువురు విచారణకు కూడా హాజరయ్యారు. ఇకపై ఇలాంటి పనులు చేయనని ఇటీవలే బహుభాషా నటుడు.. ప్రకాష్ రాజ్ ప్రకటించారు. బెట్టింగ్ యాప్‌ల కారణంగా అప్పుల పాలై, ప్రాణాలు తీసుకున్న వారి కుటుంబాలకు ఆయన సానుభూతి కూడా వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే.. తాజాగా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా.. కోట్ల రూపాయలను ఆర్జించిన నటులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు దృష్టి పెట్టారు. వీరికి ఆ నగుదు ఎలా వచ్చింది? దీనికి పన్నులు చెల్లించారా? లేదా? అనే విషయాలపై కూపీ లాగారు. ఈ క్రమంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ఆన్‌లైన్ బెట్టింగ్ నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రముఖ నటులు నేహా శర్మ, సోనూసూద్(బొమ్మాళీ డైలాగ్‌తో ఫేమస్), ఊర్వశి రౌతేలా వంటివారు ఉన్నారు. అయితే.. రౌతాలా తెలివిగా తన ఆస్తులను తల్లి పేరుతో బదలాయించింది. ఈ ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.
తాజాగా వారి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీరితోపాటు ప్రముఖ మాజీ క్రికెటర్లు.. యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ జాబితాలో చేర్చింది. ఇక, రాజకీయ నాయకుడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాజీ ఎంపీ చక్రవర్తి ఆస్తులను కూడా ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఆయా ఆస్తులపై ఇక నుంచి ఎలాంటి లావాదేవీలు చేయడానికి వీలుండదు. వాటిపై వచ్చే ఆదాయం, వడ్డీలు కూడా ఈడీ ఖాతాకు జమ అవుతాయి. కోర్టులో కేసు గెలిస్తే.. అప్పుడు మాత్రమే వాటిని తీసుకునేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఉంటుంది. కాగా.. బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే పలువురి ఆస్తులను అటాచ్ చేశారు.