బ్రేకింగ్ న్యూస్.. మాజీ మంత్రి అంబటికి బెయిలు.. అయినా తప్పని జైలు!
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి అరెస్టు అయిన విషయం తెలిసిందే.;
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి అరెస్టు అయిన విషయం తెలిసిందే. గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీసులు గత నెల 31న అంబటి రాంబాబును అరెస్టు చేశారు. ఆ తరువాత రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి రాజమండ్రి జైలులోనే ఉన్న అంబటిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. అయితే కస్టడీ పిటిషన్ ను తిరస్కరించిన గుంటూరు స్పెష్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై దూషణల కేసులో మాజీ మంత్రి అంబటికి బెయిలు మంజూరైనా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ఒక కేసులో ఆయనకు బెయిలు వచ్చినా, మరో కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. గత ఏడాది నవంబర్ 12న గుంటూరు పట్టాభిపురం సీఐ విధి నిర్వహణకు అడ్డుపడ్డారనే విషయమై మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసుపై సోమవారమే పీటీ వారెంట్ ద్వారా అంబటిని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ న్యాయస్థానం విధించింది.
ఒక కేసులో బెయిలు వచ్చినా, ఇంకో కేసులో రిమాండ్ ఉండటంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో అంబటిపై వరుస కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించారన్న కారణంగా ఆయనపై టీడీపీ కేడర్ రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేస్తోంది. ఇలా 8 రోజుల్లో మొత్తం 36 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఇక పెండింగులో ఉన్న ఇతర కేసులతో కలిపి అంబటిపై మొత్తం 52 కేసులు ఉన్నాయని అంటున్నారు.
మరోవైపు మాజీ మంత్రి అంబటిపై కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పెండింగులో ఉన్న కేసులపై పీటీ వారెంట్ వేసి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలని చూస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఒక కేసులో పీటీ వారెంటు తీసుకోగా, ఆ కేసుకు సంబంధించి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందని చెబుతున్నారు. అదేవిధంగా మరికొన్ని కేసుల్లో పీటీ వారెంటు దాఖలు చేయాలని పోలీసులకు సూచనలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 3 కేసుల్లో అంబటిపై పీటీ వారెంటు దాఖలు చేసినట్లు చెబుతున్నారు.
నవంబరు 12న నమోదైన కేసులో రిమాండ్ పడటంతో మిగతా కేసుల్లోనూ రిమాండ్ పడేలా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఒక కేసులో బెయిలు వచ్చినా మరో కేసులో అంబటి జైల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సందేహిస్తున్నారు. అంతేకాకుండా ఆయనపై ఉన్న కేసులపై రాష్ట్రంలో ఒక చోట నుంచి మరో చోటకు తిప్పే పరిస్థితి ఉందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంబటి వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇంకా కఠినంగా వ్యవహరిస్తుందా? లేక ఇక్కడితో వదిలేస్తుందా? అనేది కూడా చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా ప్రస్తుతానికి సీఎంపై దూషణల కేసులో అంబటికి బెయిలు వచ్చినా, ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోవడంపై వైసీపీ విచారం వ్యక్తం చేస్తోంది.