కాంగ్రెస్-బీఆర్ఎస్... 'బిగ్‌బాస్ షో': బండి
తెలంగాణలో గురువారం ఉదయం నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో గురువారం ఉదయం నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని ప్రజల సమస్యలను గాలికి వదిలేశాయని విమర్శించారు. ఇరు పక్షాలు చేస్తున్న నటనకు `ఆస్కార్` అవార్డులు ఇవ్వొచ్చని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయకులు.. నటించడంలో ఎవరికి ఎవరూ తీసిపోరని అన్నారు.
రెండు పార్టీలూ.. డ్రామాలు ఆడుతున్నాయన్న బండి.. అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే.. ఈ రెండు పార్టీల నేతలకే దక్కుతాయని చెప్పారు. మీడియాతో మాట్లాడిన సంజయ్.. ఇరు పక్షాలు.. అవినీతి, అప్పుల్లో దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. పైగా.. సవాళ్లు రువ్వుకుని వీధులకెక్కడం ద్వారా.. ప్రజల సమస్యలను హైజాక్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఇరు పక్షాలు పోటీ పడాలని హితవు పలికారు. ప్రస్తుతం జరుగుతున్నది చూస్తే.. ఇరు పక్షాలు వారం ముందే రిహార్సల్స్ చేసి.. రోడ్డెక్కినట్టు అనిపిస్తోందని సెటైర్లు వేశారు.
జూపల్లి వర్సెస్ కేటీఆర్
మంత్రి జూపల్లి కృష్ణారావు వర్సెస్ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ల మధ్య తీవ్రస్థాయిలో మాటల మంటలు చెలరేగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని.. దీనిని ఆధారాలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి వచ్చినా తాను రెడీనేనని ఆయన మరోసారి సవాల్ రువ్వారు. దమ్ముంటే గన్‌పార్క్ దగ్గరకు రావాలని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో అప్పటి వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్న కేటీఆర్.. గన్‌పార్క్ వద్దకు బయలు దేరి వెళ్లేందుకు రెడీ అయ్యారు.
అయితే.. పోలీసులుకేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం.. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. జూపల్లి స్పృహ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు. చర్చకు తాము సిద్ధమేనని అన్నారు. అంతేకాదు.. సవాల్‌ను స్వీకరించి చర్చకు సిద్ధమైన తమను పోలీసులతో అడ్డుకుంటూ.. చేతకాని తనాన్ని నిరూపించుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు.