అమరావతిని ఆపే అధికారం ఎవరికీ లేదు: చంద్రబాబు
అమరావతి అన్ స్టాపబుల్.. అని, దీనిని ఆపే అధికారం ఎవరికీ లేదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి అన్ స్టాపబుల్.. అని, దీనిని ఆపే అధికారం ఎవరికీ లేదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన వీబీజీరాంజీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. గతంలో మూడు రాజధానులు అంటూ మూడు ముక్కల ఆటతో ఊరేగారని.. అధికారం పోగానే.. మావిగన్ అంటూ మడత మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కానీ, ప్రజలు కోరుకున్నది అమరావతి ఒక్కటే రాజధాని అని చంద్రబాబు తెలిపారు.
గొడ్డలి పార్టీ నేత రోజుకొక మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అమరావతిని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. అమరావతి సహా ఆంధ్రప్రదేశ్ అన్ స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ మాటలను ఎవరూ విశ్వసించరని చెప్పారు. 2014లో అమరావతి రాజధానికావాలని.. భారీ ఎత్తున భూములు అవసరమని చెప్పి న వ్యక్తి.. తర్వాత మాట మార్చి మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. ప్రజలు ఛీకొట్టినా.. గొడ్డలి పార్టీకి బుద్ది రాలేదని అన్నారు. ఇప్పుడు `మావిగన్` అంటూకొత్త పాట పాడుతున్నారని దుయ్యబట్టారు.
కానీ, అమరావతిని ఏ వ్యక్తీ, శక్తీ కూడా అడ్డుకోలేదని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని తెలిపారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా, ఐటీకి కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కోస్తా ప్రాంతాలను పాలనాపరంగానే కాకుండా.. సాగు పరంగా కూడా డెవలప్ చేయనున్నట్టు వెల్లడించారు.
ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరని చంద్రబాబు చెప్పారు. గొడ్డలిపార్టీ కుట్రలను ప్రతి ఒక్కరూ ఎదిరించాలని.. పిలుపునిచ్చారు. రాష్ట్రానికి గొడ్డలి పార్టీ పెను విఘాతంగా మారిందని అన్నారు.